సర్కార్ నిర్లక్ష్యంతో బీమా కోల్పోతున్న రైతులు

సర్కార్ నిర్లక్ష్యంతో బీమా కోల్పోతున్న రైతులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : అన్నీ అర్హతలు ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా లక్షలాది మంది అన్నదాతలు ‘రైతు బీ మా’ స్కీం కోల్పోతున్నారు. ఈ ఏడాది 13.05 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్​ కోల్పోయారు. 18 ఏండ్ల నుంచి 59 ఏండ్లు ఉండి.. పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్న రైతులు ఈ స్కీంకు అర్హులు. 50.82 లక్షల మంది రైతులు ఇన్సూరెన్స్​కు అర్హత ఉన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. తాజాగా ఆగస్టు 14 నుంచి షురూ అయిన 2022–23 ఐదో సీజన్‌‌‌‌‌‌‌‌లో, 37లక్షల 76వేల 760 మంది రైతులను స్కీమ్‌‌‌‌‌‌‌‌లో  నమోదు చేశారు. ఈ రైతుల కోసం ప్రీమియంను ఎల్​ఐసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. అర్హుల్లో మరో 13,05,319 మంది రైతులకు బీమా అమలు జరగడం లేదు.

4.57 లక్షల మంది అర్హులు..

లాస్ట్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌ 2021 ఆగస్టు 14 నుంచి 2022 ఆగస్టు 13లోగా  కొత్తగా పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌  పుస్తకాలు వచ్చి బీమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి 4.57లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. గతంలో 7.25 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు వచ్చినా వివరాలు అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ కాలేవు. తాజాగా వీరికి కూడా ఫ్రెష్‌‌‌‌‌‌‌‌గా దరఖాస్తు చేసుకునేందుకు చాన్స్​ ఇచ్చారు. ఇలా మొత్తం 11.83 లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారు. గతంలో ఇన్సూరెన్స్​ అర్హత ఉన్న 38.98లక్షల మందితో పాటు తాజాగా అర్హులైన కొత్త, పాత పాస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు ఉన్న రైతులు.. ఇలా అంతా కలిపి 50.82 లక్షల మంది రైతులు బీమాకు ఎల్జిబుల్​గా తేల్చారు. 

37.76 లక్షల మంది రైతులకే బీమా

రాష్ట్ర వ్యాప్తంగా 50.82 లక్షల మంది రైతు బీమాకు అర్హులుగా ఉన్నారు. కానీ ఈ ఏడాది 37లక్షల 76 వేల 760 మందికి మాత్రమే బీమా స్కీమ్‌‌‌‌‌‌‌‌లో  నమోదు చేశారు. ఫలితంగా 13.05 లక్షల మంది రైతులు అనర్హులుగా మిగిలిపోయారు. అర్హులైన రైతులను గుర్తించి ఇన్సూరెన్స్​ అమలు చేసి అండగా నిలబడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఫలితంగా లక్షలాది మంది రైతులు బీమా కోల్పోతున్నారు.

దరఖాస్తు చేస్తున్నప్పుడే పోర్టల్​ క్లోజ్​

2019–20లో  1.34 లక్షల మందికి రైతు బీమా ప్రీమియం కట్టలేదు. వారిలో 690 మంది చనిపోతే పరిహారం కోసం అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా అందలేదు. 2021–22లో  కూడా అర్హులైన 75వేల మందికిపైగా దరఖాస్తులు రైతు బీమా పోర్టల్‌‌‌‌‌‌‌‌లో నమోదు కాలేదు. ఈ ఏడాది జులై 15 నుంచి ఆగస్టు 1 వరకు నమోదుకు చాన్స్​ ఇచ్చారు. 
దరఖాస్తులు పరిశీలనలో ఉండగానే పోర్టల్‌‌‌‌‌‌‌‌ క్లోజ్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీంతో మళ్లీ  ఈనెల 10 నుంచి 13 దాకా గడువు ఇచ్చారు. ఇలా మొత్తంగా రెన్యూవల్.. కొత్త దరఖాస్తులు.. గతంలో నమోదు కాని వారి కోసం.. అవకాశం ఇచ్చారు. గ్రామాల వారీగా  రైతులను గుర్తించి డేటా వెరిఫై చేసి బీమా నమోదు చేయాల్సి ఉంది.

పెరుగుతున్న కొత్త పాస్​ బుక్​లు

ప్రీమియం డబ్బులు కట్టలేకే అర్హులందరికీ బీమా నమోదు పూర్తి స్థాయిలో చేయకుండా క్లోజ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నరనే విమర్శలు వస్తున్నాయి. నాలుగు సీజన్‌‌‌‌‌‌‌‌లను పోల్చి చూస్తే.. రైతుల్లో అవగాహన పెరిగింది. దీంతో  ప్రతి ఏటా దరఖాస్తులు పెరుగుతున్నాయి.  కుటుంబాల్లో ఇంటి పెద్ద పేరుపై  ఉన్న భూమి కుటుంబ సభ్యులకు పంచిస్తూ.. రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేయిస్తున్నారు. దీంతో కొత్త పట్టా పాస్‌‌‌‌‌‌‌‌ పుస్తకాలు పెరుగుతున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే 4.57 లక్షల మంది అర్హులైన రైతులకు కొత్త పాస్‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌లు వచ్చాయి. దీంతో అర్హులైన రైతుల సంఖ్య ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతున్నది.

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు

అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ అధికారులకు రైతు బీమా అప్లికేషన్లు ఇచ్చినా.. అధికారులు పోర్టల్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాలి. వారికి ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ఐడీలు వస్తేనే బీమా పరిహారానికి అర్హులు అని ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ వర్గాలు అంటున్నాయి. బీమా పోర్టల్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ కాకుండానే.. కొందరు రైతులు చనిపోతున్నారు. వీరికి ఎల్‌‌‌‌‌‌‌‌ఐసీ ఐడీలు రాకపోవడంతో పరిహారం అందడం లేదు. సర్కారు నిర్లక్ష్యంతో ఐడీలు రాని రైతులు చనిపోతే.. రూ.5 లక్షల బీమా పరిహారం పొందలేకపోతున్నారు.