రైతులకు బ్యాంకులు అప్పులిస్తలేవు

రైతులకు బ్యాంకులు అప్పులిస్తలేవు

హైదరాబాద్‌‌, వెలుగు: వానాకాలం పంటల సాగు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా 20 శాతం మించి రైతులకు రుణాలు అందలేదు. జూన్‌‌ నుంచే రైతులకు రుణాలు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకు రూల్స్ ఉన్నా బ్యాంకులు అవేమీ పాటించడం లేదు. జులై నెల పూర్తి కావస్తున్నా పావు వంతు కూడా అప్పులు ఇవ్వలేదు. ఎస్‌‌ఎల్‌‌బీసీ సమావేశాలు నిర్వహించి రైతులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు లక్ష్యాన్ని నిర్దేశించినా ఫలితాలు అనుకున్నంత స్థాయిలో రావడం లేదు. దీంతో పెట్టుబడికి డబ్బులు లేక రైతులు అవస్థలు పడుతున్నారు.

80 శాతం రుణాలు ఇంకా అందలే..

2021–22లో ఎస్‌‌ఎల్‌‌బీసీ పంట రుణాల కోసం బ్యాంకర్లకు రూ.59,440.44 కోట్లు లక్ష్యాన్ని విధించారు. వానాకాలం సీజన్‌‌కు రూ.35,665 కోట్ల టార్గెట్‌‌ పెట్టగా.. ఇప్పటిదాకా 20 శాతం వరకే అంటే దాదాపు 7 వేల కోట్ల దాకే రైతులకు రుణాలు అందించారు. ఇంకా 80 శాతం రుణాలు ఇవ్వలేదు. ఏటా ఇదే పరిస్థితి. నిర్దేశించిన లక్ష్యంలో ఎన్నడూ 70 శాతం కూడా నెరవేరడం లేదు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌‌ ముందే ప్రారంభం కావడం, బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం వల్ల రైతులకు పంట పెట్టుబడికి కష్టాలు తప్పడం లేదు. పెట్టుబడుల కోసం అప్పు తీసుకునేందుకు బ్యాంకులకు జులై నుంచి రైతులు క్యూకట్టారు. రిజర్వ్ బ్యాంకు రూల్స్‌‌ ప్రకారం రూ.లక్షా 60 వేల దాకా ఎలాంటివి కుదువ పెట్టుకోకుండా రుణాలు ఇవ్వాలి. కానీ బ్యాంకులు పాసుపుస్తకాలను తనాఖా పెట్టి రుణాలు ఇస్తున్నాయి. అది కూడా అందరికీ ఇవ్వడం లేదు. దీంతో చేసేది లేక ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తీసుకుంటున్నామని రైతులు వాపోతున్నారు. ఒకటీ రెండు ఎకరాలున్న రైతులకు రైతుబంధు పెట్టుబడి సొమ్ము ఏమాత్రం సరిపోవడం లేదు.

కొత్త అప్పు ఇస్తలే

రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష దాకా అప్పు మాఫీ చేస్తామని చెప్పడంతో రైతులు తీసుకున్న పాత రుణాలు తిరిగి కట్టలేదు. దీంతో ఇప్పుడు కొత్తగా రుణం ఇస్తారన్న భరోసా లేదని రైతులు చెబుతున్నారు. బ్యాంకులకు పోవాలంటేనే భయపడుతున్నరు. ‘‘ఆరేళ్ల కిందట రూ.60 వేలు పంట రుణం తీసుకున్నం. సర్కారు రుణమాఫీ చేస్తామంటే మేం కట్టలేదు. ఏటా పాత బాకీనే రెన్యూవల్‌ చేసుకుంట వస్తున్నం. పంటకు ఇవ్వాల్సిన లోన్‌ లిమిట్‌ కూడా దాటిపోయింది. ఇప్పుడు బ్యాంకుకు పోతే అప్పు ఏడ ఇస్తరు” అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్రవ్యాప్తంగా ఇలా చాలా మంది రైతులు రుణమాఫీ అయ్యే వరకు అప్పు తెచ్చుకోలేని పరిస్థితి నెలకొంది.

రుణమాఫీ చేయని సర్కారు రైతు రుణాల మాఫీలో భాగంగా మొదటి దఫాలో రూ.25 వేల లోపు అప్పులను సర్కారు మాఫీ చేసింది. రూ.409 కోట్లు ఖర్చు చేసి అక్కడితోనే చేతులు దులుపుకుంది. మిగతా రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పలేదు. దీంతో రైతులు బ్యాంకుల్లో రుణం అందక, గ్రామాల్లో అప్పు పుట్టక ఇక్కట్లు పడుతున్నారు. ఇన్నాళ్లు ఎరువుల డీలర్లు, ఫర్టిలైజర్‌ షాపుల్లో ఖాతాలు ఉండేవి. మరికొందరు షావుకార్ల దగ్గర బాకీకి తెచ్చి పంట పండినంక ఇచ్చేవారు. కరోనా ఎఫెక్ట్‌తో ఎవరూ అప్పు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు వడ్లు అమ్మిన పైసలు ఇంకా ఖాతాల్లో వెయ్యలేదు. రెండు నెలలుగా వడ్ల పైసల కోసం ఎదురు చూస్తున్నరు. 

‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’ను పట్టించుకుంటలే

రాష్ట్రంలోని బ్యాంకుల్లో  రూ.5,47,010 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం ఇందులో నుంచి 18 శాతాన్ని రైతు రుణాల కోసం కేటాయించాలి. ఆ లెక్కన ఈయేడు పంట రుణాల కింద రూ.98,462 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. 11 శాతం (59,440.44 కోట్లు) కేటాయింపులనే ఎస్ఎల్బీసీ చేసింది. దీనికి తోడు వానాకాలం సాగు షురూ అయి రెండునెలలు కావస్తున్నా ఇంత వరకు పంట రుణాలు అందలేదు. దీంతో రైతులు అధిక వడ్డీకి ప్రైవేట్‌ వారిపై ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులుంటే.. వారిలో 65 శాతం మంది మాత్రమే బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నారు. మిగతా 35 శాతం మందికి రుణాలు అందక.. దాదాపు రూ.20 వేల కోట్లను ప్రైవేటులో తెచ్చుకుంటున్నారు. అధిక వడ్డీలు చెల్లిస్తున్నారు.

కౌలు రైతులకు లోన్లే ఇస్తలేరు

కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలనే రూల్స్‌ ఉన్నా అమలు కావడం లేదు. నేను ఏటా ఆరేడు ఎకరాలు కౌలుకు చేస్తా. పంట పెట్టుబడికి తక్లీఫ్ అయితున్నది. కౌలుదారు చట్టం అమలు చేయక పోవడం వల్ల లోన్లు అందడం లేదు. ప్రభుత్వం రైతుబంధు ఇస్త లేదు. కౌలుకు ఎవుసం చేసుడు కష్టంగనే ఉన్నది.  - ఓదెల మల్లయ్య, పెద్దపల్లి జిల్లా

మాఫీ జేయలే.. అప్పు ఇయ్యలే

రూ.లక్ష లోన్‌ ఉన్నది. రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నం. పాత అప్పును రెన్యూవల్‌ చేయలేదు. మాఫీ అయితే లోన్‌ ఇస్తరని అనుకుంటున్న. పాత అప్పు ఉన్నదని బ్యాంకుకు పోయి లోన్‌ అడగలేక పోతున్నం. పెట్టుబడికి పైసలు లేవు. ఏం చేయాలో అర్థమైతలేదు. - జూలకంటి వెంకట్‌రెడ్డి, ఖమ్మం జిల్లా

ప్రభుత్వం చొరవ తీసుకోవాలి

రైతులకు బ్యాంకులు లోన్లు ఇచ్చేలా  ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఏక మొత్తంలో రుణమాఫీ చేసి రైతులకు విముక్తి కల్పించాలి. ఎస్‌ఎల్‌బీసీ ఏటా పంట రుణాల కోసం భారీ టార్గెట్లు పెట్టినా.. బ్యాంకులు ఏనాడూ 100 శాతం పంట రుణాలు ఇచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే పరిస్థితి.
- తీగల సాగర్‌, రాష్ట్ర కార్యదర్శి, రైతుసంఘం