మక్క రైతుకు దక్కని మద్దతు

మక్క రైతుకు దక్కని మద్దతు
  • సర్కార్ కొనుగోళ్లు లేకపోవడంతో నష్టపోతున్న రైతులు 
  • క్వింటాల్​కు రూ. 300 - 600 నష్టం  
  • ఇప్పటికే పడిపోయిన ధరలు..
  • తడిచాయన్న సాకుతో మరింత తగ్గిస్తున్న వ్యాపారులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు:  మక్క రైతులు మళ్లీ నష్టపోతున్నరు. రాష్ట్ర సర్కారు మక్కలు కొనకపోవడంతో వ్యాపారులు అడ్డికి పావుసేరు అడుగుతున్నరు. పంట చేతికొచ్చినంక ధర పడిపోవడంతో రైతులు అగ్గువకే అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. పోయిన నెల వరకు క్వింటా మక్కల ధర రూ.2,100 ఉండగా, ఇప్పుడు రూ.1,870 కూడా దక్కడం లేదు. మక్కలను మార్క్‌‌ఫెడ్ ద్వారా ఎంఎస్ పీకి కొనాల్సిన సర్కారు ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో బహిరంగ మార్కెట్‌లో ప్రైవేట్ వ్యాపారులు అగ్గువకే కొంటూ జేబులు నింపుకుంటున్నరు. కొందరు రైతులు తప్పనిసరై తక్కువ ధరకు అమ్ముకుంటుండగా, మరికొందరు సర్కారు కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నరు. ఇప్పటికే వానలతో మక్క చేన్లు నేలకొరిగి దెబ్బతిన్నయి. పంటనష్టంతో దిగుబడి కూడా తగ్గింది. ప్రభుత్వం కొనకపోవడంతో మక్క రైతులు మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

మద్దతు ధర దక్కట్లే.. 

మక్కలకు ఆగస్టు వరకు మార్కెట్‌‌‌‌లో భారీగా ధరలు పలికింది. ఇప్పుడు పంట చేతికొచ్చేసరికి ధరలు పడిపోయాయి. మార్కెట్‌‌‌‌లో కనీసం మద్దతు ధరకు కూడా మక్కలు కొనేవాళ్లే లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. మక్కలకు మద్దతు ధరను క్వింటాల్‌‌‌‌ కు రూ.1,870గా కేంద్రం నిర్ణయించింది. అయితే ప్రైవేటు వ్యాపారులు మద్దతు ధర కంటే రూ.300 నుంచి రూ.600 వరకు తక్కువకే అడుగుతున్నరు. క్వాలిటీ లేదన్న సాకుతో అన్ని మార్కెట్లలో వ్యాపారులు కుమ్మక్కై అగ్గువకే కొంటున్నరు. వానల ఎఫెక్టుతో ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. దీనికి తోడు కొంచెం తడిసినా మార్కెట్ లో ధరలు తగ్గిస్తున్నరు. ఈ నెల ప్రారంభం నుంచి క్వింటాల్ మక్కల ధర అత్యంత తక్కువగా రూ. 929 (భైంసా మార్కెట్), రూ. 1,006 (పాలమూరు) పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి.   

సర్కార్ కొంటదో.. కొనదో.. 

వానాకాలం సీజన్‌‌‌‌లో 7.09 లక్షల ఎకరాల్లో మక్కలు వేసిన్రు. ఈ సీజన్‌లో ఎకరానికి 19.61 క్వింటాళ్ల చొప్పున మొత్తం 13.91 లక్షల టన్నుల వరకు మక్కలు దిగుబడి వస్తాయని మార్కెటింగ్‌‌‌‌ శాఖ అంచనావేసింది. చేతికి వచ్చిన  మక్కలను రైతులు రోడ్ల మీద ఎండ బోస్తున్నరు. కొందరు మార్కెట్‌‌‌‌కు తీసుకువస్తున్నరు. కానీ సర్కారు మక్కల కొనుగోలుపై నిర్ణయం తీసుకోలేదు. నిరుడు వానాకాలంలో మక్కలు కొనబోమని సర్కారు చెప్పింది. ఆ తర్వాత కొనుగోళ్లు చేపట్టింది. నిరుడు యాసంగిలో ఒక్క గింజా కొనలేదు. ఈ సీజన్‌‌‌‌లో ప్రభుత్వం మక్కలు కొంటదో లేదోనని రైతులు అయోమయంలో ఉన్నరు. 

రోడ్లపైనే తడిసినయ్​

చేతికొచ్చిన మక్క పంటను రోడ్ల మీద ఆరబోసిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. రెండ్రోజుల పాటు కురిసిన మక్కలు తడిసి ముద్దయిపోయాయి. మహబూబాబాద్​, వరంగల్​, హన్మకొండ, జనగామ జిల్లాల్లో తడిసిపోయిన మక్కలను రోడ్లపై మళ్లీ ఆరబోస్తున్నారు.  

ఎకరానికి రూ.6 వేల నష్టం

మూడెకరాలు మక్కలు వేసినం. వానలతో దిగుబడి తగ్గింది. ఎకరానికి 30 క్వింటాళ్లు రావాల్సి ఉన్నా.. మూడెకరాలకు 42 క్వింటాళ్లే వచ్చింది. మద్దతు ధర కూడా దక్కడంలేదు. మార్కెట్‌‌‌‌లో క్వింటాల్‌‌‌‌ రూ.1400 నుంచి రూ.1600 కంటే ఎక్కువ ధర పెట్టడం లేదు. ఎకరానికి రూ.6 వేలకు పైగా నష్టపోతున్నం. సర్కారు మక్కలు కొనాలి.
- పి. కృష్ణారెడ్డి, నాచినపల్లి, దుగ్గొండి మండలం, వరంగల్‌‌‌‌ జిల్లా

సర్కారు కొనకుంటే ఆందోళన చేస్తం 

నిరుడు యాసంగి నుంచి ప్రభుత్వం మక్కలు కొంటలేదు. దీంతో క్వింటాల్‌‌‌‌కు రూ.500 వరకు రైతులు నష్టపోతున్నరు. మద్దతు ధర దక్కడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నరు. ప్రభుత్వం స్పందించి మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ ద్వారా మక్కలు కొనాలి. లేక పోతే రైతుల పక్షాన అందోళన చేపడతాం. 
- మూడ్‌‌‌‌ శోభన్‌‌‌‌, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి