‘సాయం’ సాలదాయె..  లోన్లు​ ఇవ్వరాయె

‘సాయం’ సాలదాయె..  లోన్లు​ ఇవ్వరాయె

మహబూబ్​నగర్​, వెలుగు : వానాకాలం సాగుకు పెట్టుబడి సాలక రైతులు అప్పుల తిప్పలు పడుతున్నారు. ‘పెట్టుబడి సాయం’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు బంధు’ పైసలిస్తున్నా.. అవి ఏ మూలకు సరిపోవడం లేదని వాపోతున్నారు.  ప్రభుత్వం బ్యాంకుల నుంచి క్రాప్​లోన్లు ఇస్తున్నామని చెబుతున్నా, అవి సగం మందికి కూడా అందడం లేదు. గత్యంతరం లేక వడ్డీ వ్యాపారుల వద్ద ఎక్కువ మిత్తీలకు అప్పులు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సగం మందికే ‘రైతుబంధు’

పాలమూరు జిల్లాలో 5 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా, ఈ వానాకాలం సీజన్​లో 4,77,220.33 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అగ్రికల్చర్​ ఆఫీసర్లు అంచనా వేశారు. ప్రధాన పంటలుగా వరి, పత్తి, కందులు, మక్క, జొన్నలు సాగు కానున్నాయి. జిల్లాలో మొత్తం 2,09,607 మంది రైతులు ఉండగా, వీరికి  ‘రైతుబంధు’ కింద  ఎకరాకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.1,486.51 కోట్లు జమ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత సాయం కింద జూన్​ 28 నుంచి రెండున్నర ఎకరాల్లోపు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. అయితే, ఈ డబ్బులు పంటల పెట్టుబడులకు  చాలడం లేదు. పెరిగిన విత్తనాలు, ఎరువుల ధరలు, దున్నకం, కూలీలకు చెల్లింపులు తదితర వాటికి ఒక్కో పంటకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. 

లోన్లు ఇవ్వని బ్యాంకర్లు..

పంటల సాగుకు బ్యాంకులు విరివిగా లోన్లు ఇవ్వాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశిస్తున్నా, ఏ బ్యాంక్​ కూడా రైతులకు వంద శాతం పంట రుణాలు ఇవ్వడం లేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంట రుణాల కోసం 1,05,514  మందికి రూ.2,751.82 కోట్ల రుణాలు ఇవ్వాలని టార్గెట్​ పెట్టుకోగా, 1,491.35 కోట్ల రుణాలను మాత్రమే ఇచ్చారు.  54.19 శాతం మాత్రమే లక్ష్యాన్ని సాధించారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,26,597 అకౌంట్లకు 2,951.41 కోట్ల రుణాలు ఇవ్వాలని టార్గెట్​పెట్టుకున్నారు. 

రూ. 3 మిత్తి అయితేనే అప్పు ఇస్తున్రు..

దుక్కులు పూర్తి చేసుకున్న రైతులు జూన్​ రెండో వారం నుంచి పత్తి, కందులు, మక్కలు, జొన్న విత్తనాలను చల్లుకున్నారు. ఇప్పటికే   పంటల సాగు కోసం వడ్డీ వ్యాపారుల నుంచి రూ.3కు మొదటి విడతగా రూ.15 వేల వరకు అప్పులు తెచ్చుకున్నారు. వరి సాగుకు రెడీ అవుతున్న రైతులు ఇప్పటికే నారు పోసుకొని అదును కోసం ఎదురు చూస్తున్నారు. వీరు కూడా వడ్డీ వ్యాపారుల నుంచి రూ.10 వేల వరకు అప్పు తెచ్చుకున్నారు. ఆగస్టులో కలుపు తీత, జరుగు మందులు, ఇతరాత్ర ఖర్చుల కోసం మరో విడత అప్పు చేయాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఎవరి వద్దకు వెళ్లినా, కనీసం రూ.3 మిత్తీ అయితేనే అప్పులు ఇస్తామని చెబుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తోందని అంటున్నారు.

‘రైతుబంధు’ సాకుతో సబ్సిడీలు బంద్​

రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి ‘రైతుబంధు’ అమలు​ చేస్తూ .. అగ్రికల్చర్​సబ్సిడీలు అన్నీ ఎత్తేసింది. వ్యవసాయ పరంగా రైతులకు రాష్ర్ట ప్రభుత్వం నుంచి  రైతుబంధు మినహా, ఎలాంటి స్కీంలు వర్తించడం లేదు. ‘యంత్రలక్ష్మి’, విత్తనాలు, ఎరువులు, పిండి సంచులు, వ్యవసాయ పరికరాలు, టార్పాలిన్లు, డ్రిప్​, స్ప్రింక్లర్లు తదితర వాటికి సబ్సిడీ బంద్ పెట్టింది. దీంతో రైతులకు వీటి ఖర్చులు కూడా భారంగా 
మారాయి. 

ఈమె గండీడ్​ మండలం జక్లపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు గంగుల లావణ్య.  ఈమెకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా రూ.10 వేలు ‘రైతుబంధు’ పైసలు పడ్డయ్.  రెండు ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా.. ఎకరానికి  రూ.20 వేల పెట్టుబడి అవుతోంది. ఎకరాకు ప్రభుత్వం ఇచ్చే రూ.5 వేలు సాయం దేనికీ సరిపోక, నూటికి మూడు రూపాయల మిత్తి లెక్కన రూ.40 వేలు అప్పు తెచ్చి పంటకు పెట్టుబడి పెట్టానని చెబుతోంది.

ఈయన పేరు రూప్లా. బాలానగర్​ మండలం బోడ జానంపేట గ్రామం. 5 ఎకరాల భూమి ఉండగా, 4 ఎకరాల్లో వరి, ఎకరా పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ‘రైతుబంధు’ పైసలు పడక వరి సాగు కోసం రూ.1.10 లక్షలు, పత్తి సాగుకు రూ.30 వేలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. నిరుడు లాగే పంట లాస్​వస్తే అప్పులు మీద పడ్తయోమోనని ఆందోళన చెందుతున్నాడు.