కంది కొనుగోళ్లు షురూ కాలే : సెంటర్లు తెరవక ఇబ్బందులు పడుతున్న రైతులు

కంది కొనుగోళ్లు షురూ కాలే : సెంటర్లు తెరవక ఇబ్బందులు పడుతున్న రైతులు

పంట చేతికొచ్చి నెలరోజులైనా సర్కారు పట్టించుకుంటలే
సెంటర్లు తెరవక ఇబ్బందులు పడుతున్న రైతులు
ప్రైవేటు వ్యాపారులకు అగ్గువకే అమ్ముకుంటున్నమని ఆవేదన

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కందుల కొనుగోళ్లపై మార్క్‌‌ఫెడ్‌‌ మీనమేషాలు లెక్క పెడుతోంది. పంట చేతికొచ్చి ఇప్పటికే నెలరోజులు దాటింది. జనవరిలో ప్రారంభించాల్సిన సెంటర్లు ఇప్పటికీ స్టార్ట్‌‌ చేయకపోవడంతో రైతులు తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. 77 వేల టన్నుల కందుల కొనుగోళ్లు చేయాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్‌‌ అనుమతించినా.. ఇప్పటివరకు కొనుగోళ్లు ప్రారంభించకపోవడం గమనార్హం. రాష్ట్ర సర్కారు బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి ప్రతి ఏటా మార్క్‌‌ఫెడ్‌‌తో కందులు కొనుగోలు చేయిస్తుంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కందులు సేకరించి వాటిని అమ్మి బ్యాంకులకు మార్క్‌‌ఫెడ్‌‌ బాకీలు చెల్లిస్తుంది. ఏటా కొనుగోలు అమ్మకాలలో  మార్క్‌‌ఫెడ్‌‌కు వస్తున్న లాస్‌‌ను భరించాల్సిన సర్కారు చేతులెత్తేస్తోంది. దీంతో ఈ ఏడాది కందులు కొనుగోలు చేయాలా వద్దా అనే డైలమాలో మార్క్‌‌ఫెడ్‌‌ ఉందని తెలుస్తోంది.

ఒక్క సెంటర్‌‌ తెరవలే..

కంది కొనుగోళ్లకు మార్క్‌‌ఫెడ్‌‌ ఒక్క సెంటర్‌‌‌‌ కూడా ఇప్పటి వరకు తెరవలేదు. రాష్ట్రంలో ఈ ఏడాది కంది పంట ఎక్కువగా వేయడంతో దాదాపు 3 లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సెంట్రల్‌‌ పూల్‌‌ కోటా 77 వేల టన్నులు పోగా.. స్టేట్‌‌ పూల్‌‌ కింద 2 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయాలని మార్క్‌‌ఫెడ్‌‌ అంచనా వేసింది. కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై నెల రోజులైనా ఇంకా స్పష్టత రాలేదు.

అడ్డికి పావుసేరు లెక్కన సగం పంట అమ్ముకున్నరు

రాష్ట్రంలో కంది పంట కొనుగోలు చేయడానికి మార్క్‌‌ఫెడ్‌‌ ముందుకు రాకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఎంఎస్‌‌పీకి అటో ఇటో అన్నట్టుగా సుమారు లక్ష క్వింటాళ్ల కందులను అగ్గువకే అమ్ముకున్నారు. కొనుగోళ్లపై రాష్ట్ర సర్కారు ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు. షరతుల ఎవుసంలో భాగంగా 15 లక్షల ఎకరాల్లో కంది పంట వేయాలని సర్కారు రైతులను ఆదేశించింది. కాగా, రికార్డు స్థాయిలో 10.85 లక్షల ఎకరాల్లో కంది సాగైంది. రాష్ట్రంలో ఏటా 3 లక్షల టన్నులు దిగుబడి అయ్యే కందులు, ఈ ఏడాది 8.25 లక్షల టన్నులు దిగుబడి వస్తుందని మార్కెటింగ్‌‌ శాఖ అంచనా వేసింది.   భారీ వర్షాలకు కంది పంట దెబ్బతిన్న నేపథ్యంలో స్టేట్‌‌ పూల్‌‌లో 2 లక్షల టన్నులు కొనాలని మార్క్‌‌ఫెడ్‌‌ అంచనా వేసినా ఇప్పటికీ కొనుగోళ్లు షురూ చేయలేదు. దీంతో అప్పులు చేసి పంట పండించిన రైతులు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు.

అగ్గువకు అమ్ముకున్నం

ఈఏడాది మూడు ఎకరాల్లో కంది చేను వేసినం. వర్షాలతో దిగుబడి ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి 5 క్వింటాళ్లకు తగ్గింది. మద్దతు ధర రూ.6 వేలతో సర్కారు కొంటదని ఎదురు చూసినం. సెంటర్లు తెరవకపోవడంతో క్వింటాల్‌‌ రూ.5,600 చొప్పున ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకున్నా.  క్వింటాల్‌‌కు రూ.400 చొప్పున 15 క్వింటాళ్లకు రూ.6 వేలు నష్టపోయినం. – లక్ష్మీకాంత్‌‌ రెడ్డి, నష్కల్‌‌, వికారాబాద్‌‌ జిల్లా