సన్నొడ్లు కొంటలె.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు

సన్నొడ్లు కొంటలె.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పడిగాపులు
  •     మద్దతు ధర పెంపుపై గైడ్​లైన్స్​ రాలేదంటున్న ఆఫీసర్లు
  •     నాలుగైదు రకాలను వేర్వేరుగా ఎట్ల కొనాలో సర్కార్​ క్లారిటీ ఇవ్వలేదని వెల్లడి
  •     డైరెక్ట్ కొంటవోతే అగ్గువకు అడుగుతున్న మిల్లర్లు
  •     పలు జిల్లాల్లో సిండికేట్​గా మారి దోపిడీ
  •    రైతులు రోడ్డెక్కుతున్నా పట్టించుకోని సర్కారు

నెట్వర్క్, వెలుగు: సన్న వడ్లు పండించిన రైతులు పంటను అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారు. మార్కెట్లలో దొడ్డు వడ్లను కొంటున్న ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ సెంటర్ల నిర్వాహకులు.. సన్న వడ్లను మాత్రం కొనడం లేదు. ప్రభుత్వం నుంచి ఇంకా గైడ్​లైన్స్ రాలేదని, నాలుగైదు రకాల సన్నవడ్లను వేర్వేరుగా ఎలా కొనాలనే విషయంలో క్లారిటీ లేదని చెబుతున్నారు. దీంతో రైతన్నలు చేసేది లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసుకుని పడిగాపులు కాస్తున్నారు. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో సన్నవడ్లను రైస్​మిల్లులకు డైరెక్ట్​గా  ​తీసుకుపోతున్నారు. అక్కడ మిల్లర్లు తప్ప, తాలు అంటూ అడ్డికి పావుశేరుకు అడుగుతున్నారు.పలు జిల్లాల్లో సిండికేట్​గా మారి దోపిడీ చేస్తున్నారు. దీంతో పలు చోట్ల రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సర్కారు స్పందించడం లేదు.

గైడ్​లైన్స్ రాలేదంట

తప్ప, తాలు లేని సన్నవడ్లను కూడా గ్రేడ్ ‘ఏ’ కింద క్వింటాల్​కు రూ.1,888 కే కొనాలని ఆఫీసర్లకు ఆదేశాలున్నాయి. కానీ కనీసం క్వింటాల్​కు రూ.2,500 చొప్పున చెల్లిస్తే తప్ప తమకు గిట్టుబాటు కాదని రైతులు అంటున్నారు. మద్దతు ధర పెంచాలంటూ అన్ని జిల్లాల్లో ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలో రైతుల ఆందోళనపై సీఎం కేసీఆర్​స్పందించారు. అక్టోబర్​ 31న జనగామ జిల్లా కొడకండ్ల రైతు సభలో మాట్లాడుతూ.. సన్నవడ్లకు రూ.100 కానీ, 150 కానీ అదనంగా ఇస్తామని ప్రకటించారు. కానీ ఆ మేరకు పై నుంచి జిల్లాల ఆఫీసర్లకు ఇంకా ఎలాంటి ఆర్డర్స్, గైడ్​లైన్స్ రాలేదు. జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ సెంటర్లలో దొడ్డు రకాలను కొనుగోలు చేస్తున్న సిబ్బంది.. సన్నాల విషయానికి వచ్చే సరికి వెనుకాముందు ఆడుతున్నారు. నాలుగైదు రకాల సన్నవడ్లను వేర్వేరుగా ఎలా కొనాలనే దానిపై తమకింకా పై ఆఫీసర్ల నుంచి స్పష్టత లేదని చెబుతున్నారు. కొన్నిచోట్ల సన్నవడ్లు కొంటున్నా.. దొడ్డు వడ్ల రేటే ఇస్తున్నారు. దీంతో రైతులు సన్నవడ్లను నేరుగా మిల్లులకు తీసుకుపోతున్నారు. ఇదే అదునుగా సిండికేట్​గా మారుతున్న మిల్లర్లు తప్ప, తాలు పేరిట క్వింటాల్​కు రూ.1,600 నుంచి రూ.1,700 మాత్రమే ఇస్తున్నారు.

రూ.2,500 ఇవ్వాలి

వానాకాలం సీజన్​లో రైతులు స్టేట్​వైడ్ సుమారు 52 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇందులో 24 లక్షల ఎకరాల్లో బీపీటీ, తెలంగాణ మసూరి లాంటి సన్నాలు వేశారు. భారీ వర్షాలు, చీడపీడల కారణంగా ఒక్కో ఎకరాపై ఫెస్టిసైడ్స్​కోసం రూ.10 వేలకు పైగా ఖర్చు చేశామని రైతులు అంటున్నారు. సర్కారు చెప్పిందని సన్నాలు వేశామని, దొడ్డు రకాల కంటే ప్రతి ఎకరాకు సగటున 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి తక్కువగా వచ్చిందని వాపోతున్నారు. దీంతో క్వింటాల్​కు రూ.2,500 చొప్పున కొనాలని కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.

జిల్లాల్లో పరిస్థితి ఇదీ

  • వరంగల్ అర్బన్ జిల్లాలోని కమలాపూర్ మండలంలో 11 సెంటర్లను గత నెల 29న మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. కానీ ఎక్కడా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. దీంతో రైతులు ఆయా సెంటర్లలో వడ్లు రాశులు పోసుకొని పడిగాపులు కాస్తున్నారు. మిల్లులు అలాట్ చేయకపోవడం వల్లే వడ్లు కొనడంలేదని ఆఫీసర్లు చెబుతున్నారు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సన్న వడ్లపై సర్కారు క్లారిటీ ఇవ్వలేదు. మిల్లర్లు కూడా కొనడంలేదు.
  • జనగామ జిల్లాలో ఇప్పటికీ కొనుగోలు సెంటర్లు తెరవలేదు. జనగామ అగ్రికల్చర్ మార్కెట్ యార్డుకు రైతులు సన్న వడ్లను తెస్తుండగా, వ్యాపారులు క్వింటాలుకు రూ.1,100 -–1,500  మాత్రమే ఇస్తున్నారు.
  • కామారెడ్డి జిల్లాలో సన్న వడ్లు కొనడంలేదు. దీంతో రైతులు సెంటర్ల దగ్గరే పడిగాపులు కాస్తున్నారు. రైస్ మిల్లర్లు కూడా కొనడం లేదు.
  • కరీంనగర్ జిల్లాలో సన్న వడ్లు ఇప్పుడిప్పుడే కొనుగోలు కేంద్రాలకు వస్తుండగా.. ఎ గ్రేడ్ కింద రూ.1,888కే కొంటున్నారు.
  • నిజామాబాద్ జిల్లాలో నేరుగా సన్నవడ్లు కొంటున్న రైస్ మిల్లర్లు క్వాలిటీ లేవంటూ 1,500 – 1,600కు  మాత్రమే పెడుతున్నారు.

నల్లొండ/ మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసినా సన్న వడ్లు కొనడం లేదు. సెంటర్ల వద్ద కుప్పలు తెప్పలుగా వడ్ల రాశులు పేరుకుపోయాయి. దీంతో చేసేది లేక రైస్ మిల్లులకు డైరెక్ట్​గా వడ్లు తీసుకెళ్తున్న రైతులను మిల్లర్లు అందినకాడికి దోచుకుంటున్నారు. సన్నరకం వడ్లకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించకుండా మిల్లర్లు సిండికేట్​గా మారారు. రూ.1,600–  1,700 మాత్రమే చెల్లిస్తున్నారు. రైతులు ఆందోళన చేయడంతో ఆఫీసర్లు జోక్యం చేసుకుని మిల్లుల వద్ద పోలీసుల గస్తీ ఏర్పాటు చేసి మద్దతు ధరతో వడ్లను కొనేలా చర్యలు తీసుకున్నారు. మిర్యాలగూడ, హుజూర్​నగర్, నాగార్జునసాగర్, నల్గొండ ప్రాంతాల్లోని మిల్లర్లు సిండికేట్​గా మారి మద్దతు ధరకు మంగళం పాడారు. ఇదే సమయంలో ఫిర్యాదులు రావడంతో రెండు రోజుల కిందట మిర్యాలగూడలో ఓ మిల్లును ఆఫీసర్లు సీజ్ చేశారు. మిల్లర్లు ఏకమై సీజ్ చేసిన మిల్లును ఓపెన్ చేయాలనే డిమాండ్​తో మంగళవారం కొనుగోళ్లు బంద్ పెట్టారు. రైస్​మిల్లుల ముందు వడ్ల ట్రాక్టర్లు బారులు తీరాయి. ఎంతకీ కొనుగోళ్లు జరపకపోవడంతో వెంకటాద్రిపాలెం, మిర్యాలగూడ–సాగర్ ప్రధాన రహదారి, శెట్టిపాలెం, అన్నపురెడ్డిగూడెం స్టేజీ,  అద్దంకి–నార్కెట్​పల్లి ప్రధాన హైవేపై రైతులు ధర్నా చేశారు. మిర్యాలగూడ ఆర్డీవో బి.రోహిత్ సింగ్, డీఎస్పీ వై.వెంకటేశ్వరరావు రైతులతో చర్చించారు. తర్వాత జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ​జీవన్ ​పాటిల్, ఎస్పీ రంగనాథ్​ మిల్లర్లతో చర్చలు జరిపారు. కనీసం1,800 చెల్లించాలని మిల్లర్లకు చెప్పారు. దీంతో మధ్యాహ్నం నుంచి మళ్లీ కొనుగోళ్లు స్టార్ట్ చేశారు.