- ఘనపూర్ప్రాజెక్ట్ ముంపు భూములను గుర్తించినా నేటికీ పరిహారం ఇవ్వలే
- నిర్వాసిత రైతుల్లో ఆందోళన
మెదక్/పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లాలో జిల్లాలో ఏకైక మధ్య తరహా సాగునీటి ప్రాజెక్ట్ ఘనపూర్ఆనకట్ట ఎత్తు పెంపుతో నిర్వాసిత రైతుల్లో ఆందోళన నెలకొంది. ముంపునకు గురయ్యే భూములను గుర్తించినప్పటికీ నేటికీ రైతులకు పరిహారం ఇవ్వడంలేదు. కాగా సేకరణ కోసం గుర్తించిన భూములను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం వల్ల వందలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
1.725 మీటర్ల ఎత్తు పెంచేందుకు నిర్ణయం
కొల్చారం, పాపన్నపేట మండలాల సరిహద్దులో మంజీరా నది మీద ఉన్న ఘనపూర్ ఆనకట్ట నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోవడంతో ఎత్తు పెంచాలని 2014లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే చేసి ఆనకట్ట ఎత్తు 1.725 మీటర్లు పెంచేందుకు రూ.43.64 కోట్లు మంజూరు చేయగా 2015లో ఆ పనులకు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. ఆనకట్ట ఎత్తు పెంపు వల్ల ఇటు కొల్చారం మండలం చిన్న ఘనపూర్, సంగాయిపేట.. అటు పాపన్నపేట మండలం నాగ్సానిపల్లి, శేరిపల్లి, కొడపాక గ్రామాల పరిధిలో 300 ఎకరాలు ముంపునకు గురవుతాయని రెవెన్యూ అధికారులు గుర్తించారు.
ఈ భూములకు నష్ట పరిహారం చెల్లించేందుకు రూ.13 కోట్లు అవసరం కాగా కేవలం రూ.5 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. ఈ నిధులతో పాపన్నపేట మండల పరిధిలో కొడపాక, శేరిపల్లి గ్రామాల రైతులకు మాత్రమే పరిహారం అందింది. 2019లో ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనకు పంపగా, 2023లో ప్రభుత్వం రూ.8.10 కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించింది. కానీ ఫండ్స్రిలీజ్కాలేదు. ఫలితంగా భూసేకరణ ప్రక్రియ పెండింగ్‌లోనే ఉంది.
పాపన్నపేట మండలం నాగ్సన్‌పల్లి పరిధిలోని సర్వే నంబర్ 148 నుంచి 172 వరకు దాదాపు150 మంది రైతులకు చెందిన సుమారు 200 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సర్వే నిర్వహించి ముంపునకు గురయ్యే భూములను గుర్తించిన అధికారులు ఆ భూములను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. కాగా పరిహారం రాకపోవడంతో భూములు తమ ఆధీనంలోనే ఉన్నా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడం వల్ల పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు బ్యాంక్ లోన్ రావడం లేదని వాపోతున్నారు. వెంటనే పరిహారం చెల్లించాలని, లేదా తమ భూములను బ్లాక్ లిస్ట్ లో నుంచి తొలగింగించాలని నాగ్సాన్‌పల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రజావాణిలో కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు.
15 రోజుల్లో పరిష్కారం కాకుంటే దీక్ష
ఘనపూర్ఆనకట్ట ఎత్తు పెంచుతామని చెప్పి భూములు సర్వే చేసిన్రు. భూములు మునుగుతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లిస్తామన్నరు. సర్వే చేసి పదేండ్లవుతున్నా ఇప్పటికీ నయా పైసా ఇయ్యలేదు. మా భూములను బ్లాక్ లిస్టులో పెట్టడంతో మస్తు ఇబ్బందులు పడుతున్నం. పైసలు అత్యవసరమై ఒకటి, రెండు గుంటలు అమ్ముకుందామనుకున్నా వీలైతలేదు. ఆఫీసర్లు 15 రోజుల్లో ఏదో ఒక పరిష్కారం చూపియ్యాలే. లేకుంటే రైతులందరం కలిసి దీక్ష చేస్తం. -కొమురయ్య, రైతు, నాగ్సాన్‌పల్లి
