జనగామ, వెలుగు : గ్రామాల్లోని కొనుగోలు సెంటర్లతో పాటుగా జనగామ మార్కెట్లో వడ్ల కుప్పలు పేరుకొని పోయాయి. బుధవారం తెల్లవారుజామున జిల్లాలోని జనగామ, బచ్చన్నపేట, లింగాల ఘణపురం, పాలకుర్తి, దేవరుప్పల మండలాల్లో 12 మిల్లీ మీటర్ల వాన కురిసింది. జనగామ మార్కెట్ సహా ఆయా మండలాల్లోని కొనుగోలు సెంటర్లలోని వడ్లు తడిచాయి. మార్కెట్‌కు వచ్చిన ఆర్డీవో గోపీరామ్‌ను రైతులు అడ్డుకొని ఆయనతో వాగ్వాదానికి దిగారు. లారీలు రావడం లేదని, వడ్ల కాంటా సరిగా వేయడం లేదని, వేసిన వడ్లను లారీల్లో లోడ్ చేయడం లేదని ఆరోపించారు. మిల్లర్లు కూడా వడ్లను అన్లోడ్ చేయకపోవడంతో లారీలు కూడా మిల్లుల వద్దే రోజుల తరబడి ఉంటున్నాయని తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. వడ్ల కొనుగోలు స్పీడ్ జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు. కాగా, వాన కురిసి కొనుగోలు సెంటర్లలోని వడ్లు తడవడంతో జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. తడిచిన వడ్లను వెంటనే మిల్లులకు లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో జనగామ మండలం చీట కోడూరు, గానుగపహాడ్, బచ్చన్నపేట, నారాయణపూర్, లింగంపల్లి కొనుగోలు సెంటర్లలో 1605 క్వింటాళ్ల తడిచిన వడ్లను మిల్లులకు తరలించారు.
