ధాన్యం కొనడం లేదని.. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న రైతులు

ధాన్యం కొనడం లేదని.. ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్న రైతులు

మహబూబాబాద్​అర్బన్, వెలుగు : ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే హరిప్రియ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. బయ్యారంలోని కోదండరామస్వామి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వచ్చారు. ఈ సందర్భంగా వారి వాహనాన్ని రైతులు అడ్డుకోగా ఎమ్మెల్యే హరిప్రియ కారు దిగి వచ్చారు. రైతులు మాట్లాడుతూ బయ్యారం కొనుగోలు సెంటర్​లో 20 రోజుల కింద ధాన్యం పోసినా ఇప్పటివరకు కొనలేదన్నారు.

మంచిగా ఉన్న ధాన్యాన్ని తడిసిందని కొర్రీలు పెడుతూ  గోస పుచ్చుకుంటున్నారని వాపోయారు. ‘ఇంత జరుగుతున్నా మీకు పట్టింపు లేదా?  మీకు మా సమస్య కంటే ఆత్మీయ సమ్మేళనమే ముఖ్యమా’ అని ఎమ్మెల్యేను నిలదీశారు. తర్వాత ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే రైతులకు న్యాయం చేస్తామని, ఆత్మీయ సమ్మేళనం తర్వాత రైతుల దగ్గరకు వస్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అయితే, మీటింగ్​ తర్వాత ఎమ్మెల్యే హరిప్రియ రైతులను కలవకుండానే వెళ్లిపోయారు.  

వడ్లు కాంటా పెడ్తలేరని రైతుల ఆందోళన

మెదక్ (శివ్వంపేట) :  సెంటర్​కు వడ్లు తెచ్చి ఇరవై రోజులవుతున్నా కాంటా పెడ్తలేరని శుక్రవారం శివ్వంపేట మండలం కొంతాన్​పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. పీఏసీఎస్​ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా, లీడర్లు వచ్చి కొబ్బరికాయ కొట్టి సెంటర్​ ఓపెన్​చేసి పోయారని, ధాన్యం మాత్రం తూకం వేయడం లేదన్నారు. ఇరవై రోజులుగా రాత్రింబవళ్లు వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని, అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయి మొలకలు వస్తున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

టాపర్లకు రోజుకు రూ.300 దాక కిరాయి అవుతోందని, ఇట్లయితే తమకు ఏం మిగులుతాయని ప్రశ్నించారు. సెంటర్​ నిర్వహకులను అడిగితే లారీలు వస్తలేవంటున్నారని, మమ్మల్నే ట్రాక్టర్లు తెచ్చుకొని వడ్లు తీసుకుపోవాలని చెబుతున్నారన్నారు. అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించేలా చూడాలని డిమాండ్ చేశారు.