వడ్లు కొనాలని కాళ్లు మొక్కారు..జనగామలో రైతుల ఆవేదన

వడ్లు కొనాలని కాళ్లు మొక్కారు..జనగామలో రైతుల ఆవేదన

జనగామ, వెలుగు: సార్.. మా ధాన్యం కొనండంటూ రైతులు ఆర్డీవో కాళ్ళు మొక్కిన్రు.  కొన్న వడ్లను మిల్లులకు తరలించాలని,  సమస్యను పరిష్కరిస్తామని  మాటివ్వాలని పట్టుబట్టిన్రు. నెలరోజుల నుంచి అవస్థ పడుతున్నమని, ఇంక గోస పెట్టొద్దని  బాధపడ్డరు.  జనగామ మండలంలోని అడవి కేశవపూర్ గ్రామానికి చెందిన రైతులు తమ ఊళ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎక్కడి వడ్లు అక్కడే ఉంటున్నాయని కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. 150 లారీల వడ్లు మిల్లులకు తరలించేందుకు రెడీ గా ఉన్నాయని,  లారీలు రాక 20 రోజుల నుంచి కొనుడు బంద్ పెట్టారని చెప్పారు. సెంటర్ లో ఉన్న వడ్లు అకాల వర్షానికి తడుస్తున్నయని, బస్తాల్లో మొలకలొస్తున్నయని  వాపోయారు.అధికారులకు చెప్పినా పట్టించుకోక పోవడంతో కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడకు చేరుకుని ఆర్డీవో మధు మోహన్ ను పిలిపించారు. తమకు న్యాయం చేయమంటూ రావుల బాల్​రెడ్డి అనే రైతు ఆర్డీవో కాళ్లమీద పడి వేడుకున్నాడు.  సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చిన ఆర్డీవో వెంటనే అడవి కేశవపూర్ గ్రామానికి వెళ్లారు. సివిల్ సప్లై డీఎం రాంపతి, డీఎస్ఓ రోజారాణిలను కూడా అక్కడికే పిలిపించి వడ్లను మిల్లులకు తరలించాలని, కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. రైతుల ఆందోళనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అరుట్ల దశమంత్ రెడ్డి, నాయకులు సౌడ రమేష్, బొట్ల శ్రీను, ఉడుగుల రమేష్ సంఘీభావం తెలిపారు. వారు కలెక్టరేట్ వద్దకు చేరుకుని రైతులతో
మాట్లాడారు.