కరెంట్ కోతలతో కర్నాటకలో రైతులు సూసైడ్ చేసుకుంటున్నరు : జగదీశ్ రెడ్డి

కరెంట్ కోతలతో కర్నాటకలో రైతులు సూసైడ్ చేసుకుంటున్నరు : జగదీశ్ రెడ్డి
  • కాంగ్రెస్​కు ఓటేస్తేతెలంగాణలో చీకటే: జగదీశ్ రెడ్డి
  • మాయ మాటలు నమ్మిమోసపోవద్దని సూచన

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ హామీలు నమ్మి ఓటేసిన కర్నాటక రైతులు కరెంట్ కోతలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్​లో ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్ లీడర్ రాజారాం యాదవ్​తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ను నమ్మితే కర్నాటక పరిస్థితే ఇక్కడా రిపీట్ అవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నాటక రాజధాని బెంగళూరు సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయని, తమ బాధను వెళ్లగక్కేందుకు అక్కడి రైతులు సబ్​స్టేషన్లలో మొసళ్లు వదిలేసి నిరసన తెలుపుతున్నారని అన్నారు.

కర్నాటకలో ఐదు గంటల కరెంట్ ఇవ్వలేనోళ్లు ఇక్కడేదో ఉద్దరిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నారు. కాంగ్రెస్ మాయ మాటలు నమ్మితే 2014కు ముందు నాటి పరిస్థితులే మళ్లీ వస్తాయన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోవడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే మూడు గంటల కరెంట్​మాత్రమే ఇస్తారని, పొరపాటున కాంగ్రెస్​ను నమ్మితే రాష్ట్రం నట్టేటా మునగడం ఖాయమని హెచ్చరించారు. 17వేల మెగావాట్ల డిమాండ్ ఉన్నా నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని, మనతో పోల్చితే డబుల్ ఉండే కర్నాటక 15వేల మెగావాట్ల డిమాండ్​ను తీర్చలేని పరిస్థితిలో ఉందన్నారు. జానారెడ్డి మంత్రిగా ఉన్నప్పడు నాగార్జున సాగర్​లో రాత్రి పూట కూడా కరెంట్​ఉండేది కాదని విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే బీఆర్ఎస్​కు ప్రచారం చేస్తానని చెప్పిన జానారెడ్డి.. ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఘటనలో విచారణ చేపట్టామని, అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు.