ముందస్తు అరెస్ట్ చేసినా ఆగని రైతుల నిరసనలు

ముందస్తు అరెస్ట్ చేసినా ఆగని రైతుల నిరసనలు
  • ల్యాండ్ పూలింగ్కు వ్యతిరేకంగా రైతుల ఆందోళన బాట
  • మా భూములు ఇచ్చేదే లేదు
  • ఉమ్మడి వరంగల్​లో భూసేకరణ వద్దంటూ రైతుల మహాధర్నా 

జనగామ/స్టేషన్​ఘన్ పూర్, వెలుగు: వరంగల్​లో రింగ్ రోడ్డు, వెంచర్ల కోసం వేలాది ఎకరాలు సేకరించాలన్న రాష్ట్ర సర్కార్ నిర్ణయంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని నష్కల్ వద్ద నేషనల్ హైవేపై రైతులు మహాధర్నాకు దిగారు. ఎండను సైతం లెక్క చేయకుండా దాదాపు రెండు గంటలకు పైగా ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

‘‘మా భూములు ఇచ్చేదే లేదు. సర్కారు నిర్ణయంతో మా బతుకులు ఆగమైతయ్. భూములు పోతే, మా బతుకులెట్ల గడవాలె” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో మొత్తంగా 21వేల ఎకరాలకు పైగా సేకరించాలని సర్కార్ చూస్తోందని, నష్కల్​లో వెయ్యి ఎకరాలకు పైగా సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ల్యాండ్ పూలింగ్ కోసం సర్కార్ ఇచ్చిన జీవోను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం లీడర్లు మద్దతు పలికారు. వాళ్లూ ఆందోళనలో పాల్గొని నిరసన తెలిపారు. 
11 మంది అరెస్టు... 

జనగామ అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ధర్నా కాడికి వచ్చి, రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. ఐదుగురు రైతుల కమిటీ కలెక్టర్ వద్దకు వస్తే చర్చించి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. రైతులు, లీడర్లు మరింత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ధర్నాను విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా బీజేపీ, కాంగ్రెస్​కు చెందిన 11 మంది లీడర్లను అరెస్ట్​ చేసి మడికొండ పోలీస్​స్టేషన్​కు తరలించారు. రైతుల ఆందోళనను విరమింపజేశారు. కాగా, ధర్నాతో హైవేపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ధర్నాలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర నాయకులు విజయ రామారావు, రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. 
భూమి పోతే ఎట్ల బతకాలె.. 

నాకు బస్ స్టేజీ సమీపంలో ఎకరం భూమి ఉంది. నాకు ముగ్గురు కొడుకులు ఉన్నరు. ప్రభుత్వం రింగ్ రోడ్డు కోసం ఇచ్చిన ల్యాండ్ పూలింగ్ జీవో కింద నా ఎకరం పోతుందని అధికారులు సర్వే చేస్తుండగా తెలిసింది. 30 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నం. సర్కారోళ్లు భూమి గుంజుకుంటే మేం ఎట్లా బతకాలె.  - యాపగోని జనార్దన్, రైతు, నష్కల్  
 

భూములు గుంజుకొని రోడ్డున పడేస్తరా? 


మా నాయిన ద్వారా నాకు మూడెకరాలు వచ్చింది. నేను కష్టపడి నాలుగెకరాలు కొన్న. నాకు ముగ్గురు కొడుకులు ఉన్నరు. అందరూ వ్యవసాయమే చేస్తరు. ల్యాండ్ పూలింగ్ జీవోతో నాకున్న ఏడెకరాల భూమి పోతదని అధికారులు చెప్పిన్రు. గిట్ల బలవంతంగా భూములు గుంజుకొని రోడ్డున పడేస్తం అంటే ఎట్ల.  - మోడెం ఎల్లయ్య, రైతు, నష్కల్ 

 

 

ఇవి కూడా చదవండి

ఆదివారాలు, పండుగల రోజుల్లో డ్యూటీలకు హాజరుకాలేదని.. 57 మంది డాక్టర్లకు మెమోలు జారీ

మంత్రి జగదీశ్ రెడ్డిపై ఎంపీ కోమటిరెడ్డి ఆరోపణలు

ఎన్నికల వార్​లో సోషల్​ సైన్యం