ఏఈపై చర్యలు తీసుకోండని భైంసాలో రైతుల ఆందోళన

ఏఈపై చర్యలు తీసుకోండని భైంసాలో రైతుల ఆందోళన

భైంసా, వెలుగు:  24 గంటలకు పైగా వ్యవసాయానికి కరెంటు రావడం లేదని.. కరెంటు ఇవ్వాలని కోరిన రైతులపై ఆ శాఖ భైంసా రూరల్​ఏఈ రాంబాబు చిందులు తొక్కారు. ‘కరెంటు రాకపోతే నేనేం చేయాలి.. పంటకు అగ్గి పెట్టుకోండి’ అంటూ మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ.. మంగళవారం భైంసా 132/11 కేవీ సబ్​స్టేషన్ ​ముందు జాతీయ రహదారిపై ఆందోళనలకు దిగారు. రైతులు మాట్లాడుతూ.. కథ్​గాం గ్రామంలో 90 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఈ యాసంగిలో మొక్కజొన్న పంటలు సాగు చేశామని, కరెంటు 10 గంటలకు పోయి సరఫరా లేక పంట ఎండిపోయే స్థితిలో ఉందన్నారు. 

కరెంటు సరఫరా చేయాలని ఏఈ రాంబాబుకు ఫోన్​ చేస్తే.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేకపోతే తానేమి చేయలేనని, ఏదైనా ఉంటే లైన్​మెన్​ను అడగాలని.. లేదంటే పంటను అగ్గి పెట్టుకోవాలని చెప్పారన్నారు. సదరు ఏఈపై వెంటనే చర్యలు తీసుకొని వ్యవసాయానికి కరెంటు సరఫరాను పునరుద్ధరించాలని డిమాడ్​ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని రైతులను సముదాయించారు. ఎస్​ఈ జైవంత్​ చౌహాన్​తో ఫోన్​ మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీవ్వడంతో రైతులు శాంతించారు. సుమారు రెండు గంటలకుపైగా ధర్నా చేయడంతో ఇరువైపులా భారీగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.