వద్దంటున్నా వరి కొయ్యలకు నిప్పు!..ప్రమాదాలు, నష్టం జరుగుతున్నా మారని రైతుల తీరు 

వద్దంటున్నా వరి కొయ్యలకు నిప్పు!..ప్రమాదాలు, నష్టం జరుగుతున్నా మారని రైతుల తీరు 
  • సిద్దిపేట జిల్లాలో మంటలంటుకుని రైతు మృతి
  • ఉమ్మడి మెదక్ జిల్లాలో వడ్ల బస్తాలు, స్టార్టర్లు, పైప్ లైన్లు దగ్ధం

మెదక్/ సిద్దిపేట, వెలుగు: వరి కొయ్యలను కాల్చొద్దని ఎంత చెబుతున్నా కొందరు రైతులు వినడం లేదు. ప్రమాదాలు జరుగుతున్నా, నష్టం కలుగుతున్నా, మనుషుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోకుండా పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల వరి కొయ్యలకు నిప్పు పెడితే అవి కాలుకుంటూ వడ్ల బస్తాలు, బోరు మోటర్ల స్టార్లర్లు, పైప్‌‌‌‌ లైన్లు దగ్ధమయ్యాయి. కాలుష్యానికి కారణమయ్యే వారికి భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నప్పటికి పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆగడం లేదు. 

అధికారులు చెబుతున్నా వినడంలేదు 

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 8 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగవుతోంది. పంటను హార్వెష్టర్లతో కోశాక కొయ్యలతోపాటు వరి గడ్డి మిగిలిపోతుంది. ప్రతి సీజన్​ ముగిసిపోగానే.. మరో సీజన్‌‌కు పొలాలను సిద్ధం చేసే క్రమంలో పొలాల్లో కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. ఇలా పంట వ్యర్థాలను కాల్చడం ఎంత మాత్రం మంచిది కాదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా రైతులు వినిపించుకోవడం లేదు. వరి కొయ్యలు కాల్చడం వల్ల పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు చనిపోతాయని, తద్వారా పంటలకు తెగుళ్ల బెడద ఏర్పడుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. అంతేగాక భూసారం కూడా దెబ్బతింటుందని, ఇది పంట ఎదుగుదల, దిగుబడిపై ప్రభావం చూపుతుందంటున్నారు. అంతేగాక పొలాల్లో నిప్పు పెట్టడం వల్ల పొగ వెలువడి గాలి కలుషితమై ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. వరి కొయ్యలు కాల్చడం వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి రైతు వేదికల్లో నిర్వహించే సమావేశాలు, శిక్షణ కార్యక్రమాల్లో వివరిస్తున్నా రైతులు తమ సూచనలు పాటించడం లేదని చెబుతున్నారు. 

రూ.25 వేల వరకు జరిమానా

వరి కొయ్యలు కాల్చడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జీవో 27 జారీ చేసింది. ఈ జీవో ప్రకారం నిబంధనలను ఉల్లంఘించిన వారికి పర్యావరణ పరిహారం పేరిట భారీ జరిమానాలు విధిస్తారు. బహిరంగంగా పంట వ్యర్థాలను తగలబెట్టే తీవ్రతను బట్టి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానాలు విధించి ఆయా గ్రామ పంచాయతీలు జరిమానాలు వసూలు చేస్తాయి. ఈ విషయాలను వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తున్నా వరి కొయ్యలను రైతులు కాలుస్తూ ప్రమాదాలు కారణమవుతున్నారు. 

సంఘటనలిలా..

మూడు రోజుల కిందట సిద్దిపేట జిల్లా అక్బర్‌‌‌‌పేట– భూంపల్లి మండలం ఎనగుర్తి గ్రామంలో వరి కొయ్యలు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు మంటల్లో పడి కొప్పుల ఎల్లయ్య(65) అనే రైతు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. 
    
కోహెడ మండలం తంగళ్లపల్లిలో వరి కొయ్యలు కాల్చే క్రమంలో గ్రామానికి చెందిన తులసీరాం అనే రైతు ట్రాక్టర్ ఇంజన్, పశుగ్రాసం, పంపు సెట్, మల్బరీ తోట దగ్ధమై లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.
    
ఇదే మండలం నారాయణపూర్‌‌‌‌లో వరి కొయ్యలు కాల్చడం వల్ల వెలువడిన మంట కారణంగా రెండు ఎకరాల్లో పామాయిల్ తోట దగ్దమైంది. పెద్దచెరువుపల్లిలో వరి కొయ్యలు కాల్చే క్రమంలో ఎకరం పామాయిల్ తోట దగ్ధమైంది. 
    
ఇటీవల మెదక్ మండలం పేరూర్​ గ్రామంలో రైతులు పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెట్టగా మంటలు ఎగిరిపడి వచ్చి సమీపంలోని ఓ ప్రైవేట్​వెంచర్‌‌‌‌లో నిల్వ చేసిన సుమారు 40 ధాన్యం బస్తాలు తగలబడిపోయాయి. 
    
కౌడిపల్లి మండలం బూర్గుగడ్డలో సుమారు 200 గడ్డి మోపులు దగ్గమయ్యాయి. పలువురు రైతులకు సంబంధించిన బోరు మోటర్ స్టార్టర్​ డబ్బా, కేబుల్ వైర్లు, పైపులు కాలిపోయాయి. నాగ్సానిపల్లిలోనూ గడ్డి మోపులు దగ్ధమయ్యాయి.

కాల్చడం మంచిది కాదు

పొలాల్లో వరి కొయ్యలను కాల్చడం వల్ల నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. ఈ విషయాన్ని మండల వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది రైతులు మా సూచనలు పాటించకుండా కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. అలా చేసే బదులు పొలంలో నీరు పెట్టి జనుము, జీలుగ వంటి పచ్చి రొట్ట విత్తనాలు చల్లుకోవాలి. పచ్చి రొట్టను కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుంది. జనుము, జీలుగ విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అన్ని మండలాల్లో అందుబాటులో ఉన్నాయి. - దేవకుమార్​, డీఏవో, మెదక్‌‌