రామాయంపేటలో పత్తి కొనుగోలు కేంద్రం​ పెట్టాలె

రామాయంపేటలో పత్తి కొనుగోలు కేంద్రం​ పెట్టాలె
  • ఎట్టకేలకు మెదక్​ జిల్లాలో ఒక సెంటర్​ ఏర్పాటుకు నిర్ణయం
  •  కొన్ని ప్రాంతాలకు ఓకే.. మరికొన్ని మండలాలకు అవే ఇబ్బందులు.. 
  • ఇంకో కేంద్రం పెట్టాలని రైతుల డిమాండ్

మెదక్​ జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి పాపన్నపేటలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఒక పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దీనివల్ల కొన్ని మండలాల రైతులకు మాత్రమే ప్రయోజనం కలుగనుంది. మెజారిటీ మండలాల రైతులకు అవే ఇబ్బందులు కొనసాగనున్నాయి. అందుకు నర్సాపూర్ లో కానీ, రామయంపేట, చేగుంట పరిధిలో కానీ మరో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. 

మెదక్ (నిజాంపేట), వెలుగు : మెదక్​ జిల్లాలో ఈసారి 92 వేల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. అయితే సమృద్ధిగా వర్షాలు పడటంతో మెజారిటీ రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు. మొత్తం 48,257 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. దీంతో దాదాపు  3 లక్షల 86 వేల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని ఆఫీసర్ల అంచనా. అయితే మరికొద్ది రోజుల్లో పత్తి పంట దిగుబడి చేతికందే సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో పత్తిని అమ్ముకునే విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాపన్నపేటలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈసారి కొత్తగా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నా.. దీనివల్ల అల్లాదుర్గం, టేక్మాల్, పాపన్నపేట మండలాల రైతులకు మాత్రమే ప్రయోజనం కలుగనుంది. కొల్చారం, కౌడిపల్లి, నర్సాపూర్, చిలప్ చెడ్, శివ్వంపేట, నిజాంపేట, రామాయంపేట, చేగుంట, వెల్దుర్తి, తూప్రాన్ మండలాల మెజారిటీ రైతులు పత్తి అమ్ముకునేందుకు ఇబ్బందులు కొనసాగనున్నాయి. వారు 20 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్, సంగారెడ్డి జిల్లా వట్ పల్లిలో ఏర్పాటు చేసే పత్తి కొనుగోలు కేంద్రాలకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. దీనివల్ల రైతులపై రవాణా ఖర్చుల భారం పడనుంది. అందుకు జిల్లాలో మెజార్టీ రైతులు ఉన్న ప్రాంతంలో మరో పత్తి కొనుగులో కేంద్రం ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్​చేస్తున్నారు.

రామాయంపేటలో  కేంద్రం​ పెట్టాలె
ప్రతి ఏడాది పత్తి అమ్మేందుకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు వెళ్లాల్సి వస్తోంది. చార్జీలు ఎక్కువవుతున్నాయి. కాంటాకావడం కోసం చాలా రోజులు అక్కడే పడిగాపులు కాయాల్సి వస్తోంది. అందుకని రామాయంపేట లేదా చేగుంట మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత రైతులకు తక్లీబ్ ఉండదు.– మంగిలిపల్లి తిర్మలయ్య, రైతు, చల్మెడ