అలైన్మెంట్ మార్చొద్దు.. మా గ్రామాలను ముంచొద్దు

అలైన్మెంట్ మార్చొద్దు.. మా గ్రామాలను ముంచొద్దు

సిద్దిపేట రూరల్, వెలుగు: మల్లన్నసాగర్ రిజర్వాయర్​ అడిషనల్​ టీఎంసీ నీటి తరలింపునకు సంబంధించి అలైన్మెంట్ మార్పు వల్ల తమ గ్రామాలు మునిగిపోతాయని, తమకు అన్యాయం చేయవద్దని డిమాండ్​చేస్తూ సిద్దిపేట మండలం పుల్లూరు, బండచర్లపల్లి రైతులు, గ్రామస్తులు మంగళవారం పుల్లూరు స్టేజీ వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు ఐదు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న రైతులు మాట్లాడుతూ అదనపు టీఎంసీ నీటి తరలింపునకు సంబంధించి గతంలో అధికారులు సర్వే నిర్వహించి అలైన్మెంట్ ను ఖరారు చేశారని, రెండు రోజుల క్రితం  కొత్తగా మరో సర్వే చేశారన్నారు. కొత్త సర్వే ప్రకారం పనులు చేపడితే బండచర్లపల్లి గ్రామం పూర్తిగా మునగడమే కాకుండా పుల్లూరు రైతుల భూములు ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామంటూ పుల్లూరు స్టేజీ వద్ద బైఠాయించారు. దీంతో సిద్దిపేట–ముస్తాబాద్​దారిలో రాకపోకలు స్తంభించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన  రైతులు దిష్టిబొమ్మను దహనం చేశారు.  రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్​రూరల్​సీఐ సురేందర్ రెడ్డి అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు రైతులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

రోడ్డుపైనే వంటావార్పు

ఆందోళన చేస్తున్నా అధికారులు ఎవరూ రాకపోవడంతో గ్రామస్తులు రోడ్డుపైనే వంటావార్పు కార్యక్రమాన్ని  ప్రారంభించారు. కేవలం కొందరు అధికార పార్టీ నేతల భూములును కాపాడటం కోసం అలైన్మెంట్ మార్చడం వల్ల పేద రైతులు భూములు కోల్పోవడమే కాకుండా బండచర్ల పల్లి గ్రామమే ముంపునకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు ఇరిగేషన్  ఏఈ ఖాజామోయినోద్దీన్​ను పిలిపించారు. ఇరిగేషన్​ఏఈ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. అడిషనల్ టీఎంసీ నీటి తరలింపు సందర్భంగా బండచర్లపల్లి గ్రామం ముంపునకు గురికాదని, కేవలం గ్రామ చెరువును రిజర్వాయర్ గా మారుస్తామన్నారు. రిజర్వాయర్ చుట్టూ రివిట్​మెంట్​వాల్​నిర్మిస్తామని వివరించారు. బండచర్లపల్లి నుంచి టన్నెల్ నిర్మించాలని ప్రభుత్వం అనుకుంటోందని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. దీంతో దాదాపు ఐదు గంటల అనంతరం రైతులు ఆందోళన విరమించారు.