
- ఇంకా 40% రైతులకు అందని ఖరీఫ్ పెట్టుబడి సాయం
- బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న అర్హులు
- కొందరికిచ్చి.. ఇంకొందరికి ఆపేయటంతో గందరగోళం
- రూ. 3400 కోట్లు పెండింగ్‌లో పెట్టిన రాష్ట్ర ఆర్థిక శాఖ
- నిధుల సమీకరణ కోసం ఆర్బీఐకి ఇండెంట్
- నిరుడు 2 సీజన్లలో 12,97,000 మందికి మొండిచేయి
- ఈసారైనా వస్తుందని భావించినా ఫలితం శూన్యం
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా రాష్ట్రంలో ఇప్పటివరకు 23 లక్షల 75 వేల మంది రైతులకు ‘రైతు బంధు’ సాయం అందలేదు. ఈ సీజన్లో మొత్తం 56 లక్షల 75 వేల మందికి పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా దాదాపు 40 శాతం మందికి సాయం అందకపోవడంతో వారంతా ఎదురుచూడాల్సి వస్తోంది. ఎప్పడు తమ ఖాతాల్లో పైసలు పడతాయని బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ సీజన్‌కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని జూన్ మొదటి వారంలోనే విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఒక్కో ఎకరానికి రూ. 5 వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. నెలరోజులు గడుస్తున్నా చాలా జిల్లాల్లో డబ్బులు పడలేదు. తొలకరి జల్లుల నుంచే సాగుకు సిద్ధమయ్యే రైతులు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం ఆగిపోవడంతో విధిలేక వడ్డీవ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.
రూ. 3,400 కోట్లు బకాయి
ఈ ఖరీఫ్‌లో 56 లక్షల 75వేల మంది రైతులకు పెట్టుబడి సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. ఇందుకు రూ. 69 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు రూ. 35వేల కోట్లే ప్రభుత్వం విడుదల చేసిందని, 33 లక్షల మంది రైతులకే లబ్ధి చేకూరిందని అధికారులు చెప్తున్నారు. మిగతా 23.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కాలేదు. సర్కారు నుంచి రూ. 34 వేల కోట్లు విడుదల కావాల్సి ఉంది. రెండు వారాలుగా రైతుబంధు నిధుల పంపిణీ అనధికారికంగా నిలిచిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసిన కొద్దీ రైతుల ఖాతాల్లో జమవుతాయని అధికారులు చెప్తున్నారు.
నిధుల కొరతే కారణమా?
నిధుల కొరత వల్లే ప్రభుత్వం పూర్తి నిధులు విడుదల చేయడం లేదన్న ప్రచారం సాగుతోంది. అందుకే కొందరు రైతులకు ఇచ్చి.. ఇంకొందరికి పెండింగ్‌లో పెట్టినట్లు అధికారులూ అంటున్నారు. ఇప్పటివరకు ఐదెకరాల్లోపు భూమి ఉన్న వారికే రైతుబంధు అందినట్లు తెలుస్తోంది. ఐదెకరాల్లోపు భూమి ఉండి కొత్తగా పాస్‌పుస్తకాలు వచ్చినవారిలో చాలా మందికీ పైసలు రాలేదు. జూన్ 9 నాటికి భూముల వివరాల నమోదుతోపాటు డిజిటల్ సంతకాలు పూర్తయిన పట్టాదారులందరూ రైతుబంధు స్కీమ్‌కు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా డిజిటల్ సంతకాలు చేయించుకున్న రైతులందరూ అర్హుల జాబితాలో చేరారు. నిరుటితో పోలిస్తే.. లబ్ధిపొందే రైతుల సంఖ్య ఈసారి పెరిగింది.
అప్పువచ్చే దాకా వెయిటింగ్
ఆర్థిక శాఖ నుంచి తమకు రూ. 35వేల కోట్ల నిధులు రిలీజయ్యాయని, మిగతా రూ. 34వేల కోట్లు వస్తేనే అందరికీ సాయం అందుతుందని అధికారులు చెప్తున్నారు. రైతుబంధుకు అవసరమైన నిధుల సమీకరణకు ఆర్థిక శాఖ తంటాలు పడుతోంది. సెప్టెంబర్‌లోపు వరుసగా మూడు నెలల్లోనే.. సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా తమకు రూ. 7500 కోట్లు అప్పు కావాలని ఇటీవలే ఆర్బీఐకి ఇండెంట్ సమర్పించింది. ఆర్బీఐ నుంచి అప్పులు వచ్చేంత వరకు రైతులకు ఎదురుచూపులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిరుడు 12.97 లక్షల మందికి మొండిచేయి
గతేడాది ఖరీఫ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమల్లో పెట్టింది. నిరుడు సీజన్‌కు ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు సీజన్లలో పంపిణీ చేసింది. ఖరీఫ్‌లో 51 లక్షల 50వేల మంది రైతులకు చెక్కులు పంపిణీ చేసింది. రబీలో 49లక్షల 3వేల మందికి నగదు బదిలీ చేసింది. వివిధ కారణాలతో గత ఏడాది ఖరీఫ్ లో 5.25 లక్షల మందికి, రబీలో 7.72 లక్షల మందికి పెట్టుబడి సాయం అందలేదు. గత ఏడాది తమకు అందని సాయం ఈ ఏడాదైనా వస్తుందని ఆశించిన రైతులకు పెద్ద షాకే తగిలింది. నిరుడు రెండు సీజన్లలో సాయం అందని రైతుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవద్దని వ్యవసాయ శాఖ అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. నిరుడు ఖరీఫ్, రబీ పంటల కాలం ముగిసిపోయిందని, అప్పటి పెట్టుబడి ఖర్చులను ఇప్పుడెలా చెల్లిస్తామని అధికారులు అంటున్నారు. దీంతో 12 లక్షల 97వేల మంది అర్హులు రైతుబంధు సాయాన్ని కోల్పోయారు.
పాసు పుస్తకాల చిక్కు
డిజిటల్ సంతకం కాని రైతులకు రైతుబంధు ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. గడిచిన ఏడాది కాలంలో చాలా భూములకు సంబంధించి కొనుగోళ్ల బదలాయింపు జరిగింది. ఒక రైతు తన భూమిని వేరే రైతుకు అమ్మితే ఆ భూమి పాస్‌పుస్తకాలు డిజిటల్ సంతకాలు రాలేదు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులతో చాలా మందికి పాస్ పుస్తకాలు రాలేదు. విరాసనత్, మ్యూటేషన్ చేసుకున్న చాలా మందికి వారి పేరు మీద కూడా పాస్‌పుస్తకాలు రాలేదు. భూమి యజమాని చనిపోతే ఆ యజమాని కుటుంబసభ్యుల పేరులోకి భూములు మారలేదు. గత పది నెలల్లో చనిపోయిన 2500 మంది రైతుల కుటుంబాలకు కూడా రైతు బంధు అందడం లేదు.