కోతుల కోసం కరెంట్​ పెడ్తే.. రైతుల ప్రాణాలు పోయినయ్

కోతుల కోసం కరెంట్​ పెడ్తే.. రైతుల ప్రాణాలు పోయినయ్

రామాయంపేట/వెల్గటూరు/కూసుమంచి, వెలుగు: కోతులు, అడవి జంతువుల కోసం కరెంట్ పెట్టగా, ప్రమాదవశాత్తు వాటిని తాకిన రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఖమ్మం జిల్లాలో ఇంటి ఆవరణలో అమర్చిన కరెంట్​తీగలు తాకి ఓ రైతు చనిపోయాడు. తిరుమలాయపాలెం మండలం కోక్కిరేణికి చెందిన గద్దల గోపయ్య(70).. తన ఇంటి ఆవరణలోని రేకులను, మొక్కలను కోతులు పాడు చేస్తున్నాయని చుట్టూ బైండింగ్ వైర్ అమర్చి కరెంట్​కనెక్షన్​ఇచ్చాడు. మంగళవారం కోతులను తరిమే క్రమంలో గోపయ్య ఫెన్సింగ్​వైర్లను తాకాడు. 

కరెంట్​షాక్​తో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కొడుకు ఫిర్యాదు మేరకు తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లాలో పొలం వద్ద ఏర్పాటు చేసిన కరెంట్ ఫెన్సింగ్‌ తగిలి మరో రైతు చనిపోయాడు. ఎండపల్లి మండలం సూరారం గ్రామానికి చెందిన చెల్పూరి రాజేశం(53) తన ఎకరం భూమిలో మొక్కజొన్న సాగు చేశాడు. అడవి పందులు, ఇతర జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు చేను చుట్టూ ఫెన్సింగ్​ఏర్పాటు చేసి, రాత్రి పూట కరెంట్​కనెక్షన్​ఇస్తున్నాడు. సోమవారం రాత్రి పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన రాజేశం, కరెంట్​సప్లై ఇచ్చిన సంగతి మర్చిపోయి ఫెన్సింగ్​ను తాకాడు. కరెంట్​షాక్​తో అక్కడికక్కడే చనిపోయాడు. 

మంగళవారం ఉదయం రాజేశం ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, చేనులో విగతజీవిగా పడిఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు వెల్గటూర్​ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. మెదక్ ​జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల గ్రామానికి చెందిన ధ్యాగల శ్రీనివాస్(32) తనకున్న ఎకరం భూమిలో వరి సాగు చేశాడు. రోజూలాగే మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. అక్కడి మోటార్ ఆన్​చేసేందుకు ప్రయత్నించగా, స్టార్ట్ కాలేదు. సర్వీస్​వైర్​ఊడిపోయిందని గుర్తించిన శ్రీనివాస్ సరిచేస్తుండగా కరెంట్​షాక్​తో అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య గంగమణితోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.​