సబ్సిడీ పనిముట్లు ఏమాయే.. ఐదేళ్లుగా రైతుల ఎదురుచూపులు

సబ్సిడీ పనిముట్లు ఏమాయే.. ఐదేళ్లుగా రైతుల ఎదురుచూపులు
  • ఎవుసం చేసేందుకు తప్పని తిప్పలు
  • సొంతంగా తయారు చేసుకుని పనులు 

సంగారెడ్డి, వెలుగు:వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ పనిముట్లు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు సబ్సిడీ పనిముట్లు ఏమాయే.. ఐదేళ్లుగా రైతుల ఎదురుచూపులు. ఏడాదికోసారి అందాల్సిన ఈ పరికరాలు సంగారెడ్డి జిల్లాలో ఐదేండ్ల నుంచి రావడం లేదు.  దీంతో రైతులే సొంతంగా పరికరాలు తయారు చేసుకొని ఎవుసం చేసేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు. 

వ్యవసాయంలో పెట్టుబడుల సమస్య ఒకవైపు..  పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధరలు లేక మరోవైపు రైతులు ఇబ్బంది పడుతుండగా ఇంకోవైపు ఎవుసానికి అవసరమైన పరికరాలు కొనలేక ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. 

కేంద్రం వాటాలో రాష్ట్రం వాటా నిల్

వ్యవసాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తున్న ఫండ్స్ లో రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండా పోయింది. వ్యవసాయ యాంత్రీకీకరణ, జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) వీటితో పాటు ఇతరత్రా పథకాల ద్వారా కేంద్రం ఫండ్స్ రిలీజ్ చేస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద మరికొన్ని నిధులు సమకూర్చి రైతులకు వ్యవసాయ సబ్సిడీ పరికరాలను అందజేయాల్సి ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయ శాఖకు గడిచిన ఐదేండ్లలో ఫండ్స్ ఇవ్వకపోవడంతో సబ్సిడీ పథకాలకు రైతులు నోచుకోలేకపోతున్నారు. 

ట్రాక్టర్, మినీ ట్రాక్టర్, కల్టివేటర్లు, పవర్ స్ప్రేయర్లు, చేతిపంపులు, దుక్కులు దున్నే పనిముట్లు, టార్పాలిన్లు, డ్రిప్ పైపులు ఇతరత్రా పరికరాలను రైతులకు సబ్సిడీ కింద ఇవ్వాల్సి ఉంది. సబ్సిడీ పరికరాలకు బడ్జెట్ రాకపోవడం వల్లే పనిముట్లు ఇయ్యలేకపోతున్నామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ పరికరాల కోసం  అగ్రికల్చర్ ఆఫీసుకు రైతులు రోజూ క్యూ కడుతున్నారు. ఏండ్ల నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి పరికరాలు అందకపోవడంతో ఎవుసం కష్టమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు సబ్పిడీ పరికరాలు ఇవ్వాలని పలువురు రైతులు కోరుతున్నారు.

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగ్లూరు చెందిన బాయప్ప ఎడ్లు కిరాయికి తెచ్చి వ్యవసాయం చేసే స్తోమత లేదు. దీంతో తన కొడుకు సైకిల్ వెనక టైరు తీసేసి పైడిల్ కు ఓ ఐరన్ పరికరాన్ని అమర్చి దానితో దుక్కులు దున్నుతున్నాడు. ప్రభుత్వం సబ్సిడీపై పనిముట్లు ఇవ్వకపోవడంతో అవస్థలు పడుతున్నామని తన బాధను చెప్పుకొచ్చారు. రైతుల కోసం ఎంతో చేస్తున్నామని చెప్పుకునే సీఎం కేసీఆర్ ఎవుసం చేసేందుకు సామాన్లు ఇస్తే బాగుంటుందని  బాయప్ప కోరారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్​కి చెందిన  మాణిక్యానికి నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. పత్తి పంట కోసం దుక్కులు దున్ని గింజలు వేసిన ఆయనకు ప్రస్తుతం ట్రాక్టర్ తో పని ఉంది. కానీ కిరాయికి తెచ్చుకునే స్తోమత ఆయనకు లేదు. దాంతో దుక్కులు దున్నే పాత పరికరాన్ని ఒక రాడ్డుకు అమర్చి ఓ పరికరంగా చేసుకొని పనికానిస్తున్నాడు. అగ్రికల్చర్​ ఆఫీసర్లను పనిముట్లు అడిగితే బడ్జెట్ రాలేదన్నారని, మరి ఎప్పుడు ఇస్తారో తెలుస్తలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.