పోడు భూముల కోసం కొట్లాడితే  ఉన్న భూములు గుంజుకున్నరు

పోడు భూముల కోసం కొట్లాడితే  ఉన్న భూములు గుంజుకున్నరు

అది జూన్​ 30, 2019..కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని కాగజ్​నగర్ ​మండలం సార్సాల గ్రామానికి ఫారెస్ట్​ అధికారులు, సిబ్బందితో కలిసి వచ్చారు. గ్రామస్తులు, మరికొంతమంది గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు తమ శాఖకు చెందినవంటూ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు. దీంతో గ్రామస్తులంతా వారిపై మర్లవడ్డారు. ఈ సందర్భంగా జరిగిన గొడవలో ఫారెస్ట్ ​రేంజ్ ​ఆఫీసర్, మరికొంతమంది సిబ్బంది గాయపడ్డారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ జడ్పీ వైస్​చైర్మన్​ కోనేరు  కృష్ణారావుతో సహా 38 మంది రైతులపై కేసులు పెట్టారు. దీంతో అందరూ 59 రోజుల పాటు జైలు జీవితం గడిపి వచ్చారు. ఇదంతా జరిగి నేటికి మూడేండ్లు. అయితే రైతుల కష్టాలు రెట్టింపయ్యాయి తప్పితే సమస్య పరిష్కారం కాలేదు. పోడు భూముల కోసం పోరాడితే వాటిని ఆనుకుని ఉన్న సొంత భూముల్లోనూ సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. పట్టాలున్నా, సర్కారు రైతుబంధు డబ్బులు అకౌంట్లలో జమ చేస్తున్నా ఆ భూముల్లోకి ఫారెస్ట్ డిపార్ట్​మెంట్​ రానివ్వడం లేదు. ‘సారూ సాయం చేయండి’ అంటూ  రెవెన్యూ అధికారుల దగ్గరకు వెళ్తే... ‘మీ దగ్గర పట్టాలున్నాయి కదా దున్నుకోండి’ అంటూ ఉచిత సలహాలు ఇచ్చి పంపిస్తున్నారు.  దీంతో రైతులంతా ఏం చేయాలో తెలియక, కడుపు మాడ్చుకోలేక కూలి పనులకు పోతున్నారు.  

ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు : కొత్త సార్సాల గ్రామంలో మూడేండ్ల కింద జరిగిన పోడు భూముల లొల్లితో ఎంతోమంది రైతులు జీవనాధారం కోల్పోయారు. పోడు భూముల సంగతి వదిలేస్తే సర్కారు పట్టాలిచ్చిన భూములు కండ్లెదుటే కనవడతున్నా అందులో కనీసం కాలు కూడా పెట్టే అవకాశం లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం అటవీ శాఖ తన భూములు వదులుకున్నందుకు బదులుగా ప్రభుత్వం కాగజ్‌‌నగర్ అటవీ డివిజన్‌‌ లోని కడంబా బ్లాక్‌‌లో ఉన్న కొత్త సార్సాలలో 20 హెక్టార్ల భూమి కేటాయించింది. ఇందులో అప్పటికే అక్కడి గ్రామస్తులు పోడు సాగు చేసుకుంటున్నారు. దీంతో ఫారెస్ట్ ​శాఖ మొక్కలు నాటేందుకు రాగా రైతులంతా కలిసి  అడ్డుకోవడంతో గొడవ జరిగింది. తర్వాత 38 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ భూములను ఆనుకునే 42/1, 193/52, 193/15/2,193/81  సర్వే నంబర్లలో రైతులకు చెందిన 50 ఎకరాల వరకు పట్టా భూములున్నాయి. కొద్ది రోజులకే అటవీ శాఖ ఈ భూములు కూడా తమవేనంటూ వాదించడం మొదలుపెట్టింది. గొడవ జరిగేనాటికే అందులో రైతులంతా విత్తనాలు వేసుకోగా, ట్రెంచ్​కొట్టి స్వాధీనం చేసుకుంది. మొదటి పంట తీసుకునేందుకు అనుమతి ఇచ్చినా తర్వాత అటు వైపు  కన్నెత్తి చూడనివ్వడం లేదు. అప్పటి నుంచి రైతులు తమకు పట్టాలున్నా, రైతుబంధు వస్తున్నా కేసులు పెట్టి జైలుకు పంపుతారనే భయంతో సొంత భూముల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారు.  

పాస్ బుక్ లున్నయ్.. రైతు బంధు వస్తోంది కానీ..  

కొత్త సార్సాలలో దాదాపు మూడేండ్లుగా సాగు లేకపోవడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సుమారు పదిహేను మంది రైతుల దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పాస్ బుక్స్ ఉన్నాయి. రైతు బంధు డబ్బులు కూడా వస్తున్నాయి. అయినా  సొంతభూమిలో పంట పండించుకునే అవకాశం లేక అరిగోస పడుతున్నారు. మరికొందరు క్రాప్​లోన్​ కడుతున్నా ఆ భూమి వారిది కాదంటున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నట్టు తమ దగ్గర పత్రాలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారుల దగ్గరకు వెళ్లి కాళ్లా వేళ్లా పడితే... ‘పట్టాలిచ్చినం కదా..మీకు రైతు బంధు కూడా వస్తోంది. ధరణిలో కూడా మీ పేరే చూపిస్తాంది.  మమ్మల్ని ఇంకేం చేయమంటరు’ అని సమాధానం చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. మరోవైపు రైతుల భూముల్లో ఫారెస్ట్​శాఖ బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. భూముల దగ్గరికి వస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తోంది.    


భర్త లేడు.. పిల్లల కోసం  కూలికి పోతున్నా.. 

నా పెండ్లికి పసుపు కుంకుమ కింద మా తల్లిగారు ఎకరం ఇరవై గుంటల భూమి ఇచ్చిన్రు. 193/81 సర్వే నంబర్​లో ఉన్నది. నా భర్త చనిపోయిండు. ఇద్దరు పిల్లలన్నరు. సార్సాలలోనే ఎవుసం చేసుకొని బతకాలని అనుకున్నా. అయితే ఎకరం భూమిని ఫారెస్టోళ్లు గుంజుకున్నరు. అందులోకి అడుగు పెట్టనిస్తలేరు. దీంతో మూడేండ్లుగా ఇద్దరు పిల్లల కోసం కూలి పనులకు పోతున్న. అధికారులు కనికరం చూపిస్తలేరు. నా పిల్లల కోసమైనా నా భూమి నాకు ఇప్పించండి సార్​.  

– పూదరి కళావతి,  సార్సాల 

 చీపుర్లు ఏరుకుంటున్నా...

ఊరి పక్కన ఉన్న భూమిలో ఎన్నో ఏండ్ల సంది సాగు చేసుకుంటున్నం. అయితే ఫారెస్టోళ్లు వచ్చి ఈ భూమి వాళ్లదేనని రానిస్తలేరు. మా ఉరివాళ్ల మీద కేసులు పెట్టినప్పటి నుంచి అక్కడికి పోవాలంటే భయమైతాంది. రైతుబంధు వస్తున్నా అరకపట్టి పంట వేయలేని పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు చీపురు పుల్లలు ఏరుకొని..చీపుర్లు కట్టి అమ్ముతున్నా...ఇప్పటికైనా దయతలచాలె. 
-
 నాయిని ఇందిర,  మహిళా రైతు, సార్సాల


పట్టాలున్నాయి తెలుసు.. కానీ భూమి ఫారెస్ట్ దే

సార్సాల సమీపం లో రైతులకు పట్టాలు ఉన్న మాట నిజమే. కానీ ఆ భూమి అటవీ శాఖకు చెందినదే..గతంలో ప్రభుత్వం చేపట్టిన ఓ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు రైతులకు పట్టాలు ఇష్యూ చేశారు. అయితే ఆ పట్టాలు ఉన్న భూములకు మోఖా మాత్రం చూపలేదు.  అది మా భూమి కాబట్టే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మొక్కలు నాటుతున్నాం. 

– వేణు గోపాల్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, పెంచికల పేట్