రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు

రుణ మాఫీ చేయకపోవడంతో రైతులకు కొత్త చిక్కులు

మెదక్/రామాయంపేట/నిజాంపేట, వెలుగు: ప్రభుత్వం పంట రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల రైతులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. క్రాప్ లోన్ రెన్యువల్ కోసం రైతులు బ్యాంక్ కు వెళితే థర్డ్ పార్టీ ష్యూరిటీ ఇస్తేనే లోన్ రెన్యువల్ చేస్తామని బ్యాంక్ ఆఫీసర్లు కండీషన్ పెడుతున్నారు. అలా ఇవ్వకుంటే లోన్ రెన్యువల్ చేయడం లేదు. దీంతో ఓ వైపు వడ్డీ.. మరోవైపు అపరాధ రుసుంతో రైతులపై భారం మరింత పెరిగిపోతోంది. పంట సాగు పెట్టుబడి కోసం రాష్ట్రంలో అధిక శాతం రైతులు బ్యాంక్​లలో క్రాప్​లోన్​తీసుకుంటున్నారు. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తామని చెప్పడం వల్ల చాలా మంది రైతులు లోన్లు చెల్లించలేదు. ప్రభుత్వ రూల్స్​ ప్రకారం రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతులు 36.68 లక్షల మంది ఉన్నారు. వీరందరికి కలిపి రూ. 19,198 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. కానీ నాలుగేండ్లలో కనీసం 20 శాతం మందికి కూడా రుణమాఫీ చేయలేదు. ప్రభుత్వం గతేడాది రూ.25 వేల లోన్​ ఉన్న రైతులకు, ఈసారి రూ.50 వేల వరకు రుణమాఫీ వర్తింపజేసింది. రూ.50 వేల కంటే ఎక్కువ బాకీ ఉన్న రైతులకు ఇంతవరకు రుణమాఫీ అమలు కాలేదు. అంతేగాక లోన్​ సకాలంలో చెల్లించకపోవడంతో రైతులపై 12 శాతం వరకు వడ్డీ భారం పడుతోంది. దీంతో తీసుకున్న లోన్​వడ్డీ, దానిపై అపరాధ వడ్డీతో కలిపి మూడు నాలుగింతలవుతోంది. 30 లక్షల మందికిపైగా రైతులు సర్కారు ఎప్పుడు రుణమాఫీ చేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 

కొత్త రూల్​తో ఇబ్బంది

అటు రుణమాఫీ అమలు కాకపోవడం, ఇటు లోన్ రెన్యువల్ కోసం బ్యాంకులు కొత్త రూల్​పెట్టడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రూ.1.60 లక్షలకు పైగా బాకీ ఉన్న రైతులు రెన్యువల్ చేసుకునేందుకు బ్యాంకు​లకు వెళితే థర్డ్ పార్టీ ష్యూరిటీ కావాలని చెబుతున్నారు. రైతులకు ష్యూరిటీ ఇచ్చేవారు రూ. 200 స్టాంప్​పేపర్లపై సైన్ చేయాల్సి ఉంటుంది. అంతేగాక వేలిముద్ర వేసేవాళ్లు ష్యూరిటీ ఇచ్చేందుకు అనర్హులని బ్యాంక్ ఆఫీసర్లు చెబుతున్నారు. ష్యూరిటీ సైన్ చేసేవాళ్ల ఆధార్ కార్డు, ఫోటో బ్యాంక్ సిబ్బంది తీసుకుంటున్నారు. ఒకవేళ సకాలంలో ఆ రైతు లోన్​చెల్లించకుంటే ష్యూరిటీ ఇచ్చినవారు బాధ్యులవుతారు. బ్యాంక్ కు చెల్లించాల్సిన బాకీని వారినుంచే వసూలు చేస్తారు. ఈ రూల్​కారణంగా రైతులకు ష్యూరిటీ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో బాకీ ఉన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బ్యాంకర్లు లోన్​ తప్పనిసరిగా రెన్యువల్​ చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో ష్యూరిటీ ఇచ్చేవారికోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలోని ఏపీజీవీబీ బ్యాంక్​తో పాటు శివ్వంపేట మండలంలోని పలు బ్యాంక్​లలో ష్యూరిటీ అడుగుతుండటంతో రైతులు లోన్​ రెన్యువల్​ చేసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసి ఉంటే తమకు ఈ ఇబ్బందులు ఉండేవి కావని రైతులు అంటున్నారు. లోన్​ అమౌంట్​ రూ.1.60 లక్షలు దాటితే తప్పనిసరిగా ష్యూరిటీ తీసుకోవాలని పై ఆఫీసర్ల నుంచి తమకు ఇన్ స్ట్రక్షన్స్ ఉన్నాయని బ్యాంక్ సిబ్బంది చెబుతున్నారు. 

బంగారం కుదువపెట్టి మిత్తి కట్టిన

రామాయంపేట గ్రామీణ వికాస బ్యాంకులో 2017లో క్రాప్ లోన్ రూ. 65 వేలు తీసుకున్న. మిత్తితో కలిపి అది రూ. 2.25 లక్షలైంది. బ్యాంకు వాళ్లు కంపల్సరీగా లోన్ రెన్యువల్​చేయించుకోవాలని ఒత్తిడి చేసిన్రు. పైసల్లేక అదే బ్యాంకులో బంగారం కుదువ పెట్టి మిత్తి కట్టిన. గవర్నమెంట్ రుణమాఫీ చేస్తామనడంతో లోన్ కట్టలేదు. దాంతోని బాకీ నాలుగింతలైంది. - జె.రామాగౌడ్​, డి.ధర్మారం, మెదక్​జిల్లా

జమానత్​ ఇచ్చేటోళ్లు దొరుకుతలే 

కేసీఆర్​రుణమాఫీ చేస్తాం అనడంతో లోన్ పైసలు కట్టలేదు. మాఫీ చేస్తామని చెప్పకపోతే ఫసల్ కిన్ని లోన్ పైసలు కడ్తుంటిని. రూ. 75 వేల లోన్ తీసుకుంటే ఇప్పుడు మిత్తితో కలిపి రూ. 2 లక్షల మీద అయ్యింది. లోన్​రెన్యువల్​చేద్దామంటే బ్యాంకోళ్లు ఇంకెవరిదన్న జమానత్​కావాలంటున్రు. జమానత్​ ఇచ్చేటోళ్లు రూ. 200 స్టాంప్​ కాగితాల మీద సంతకం చేయాల్నట. ఇప్పటికి నలుగురైదుగురిని అడిగిన. ఎవరూ జమానత్​ పెట్టమంటున్రు. – రొయ్యల మల్లేశం, కోమటిపల్లి