భూ ఆక్రమణలపై మర్లవడుతున్న బాధితులు

భూ ఆక్రమణలపై మర్లవడుతున్న బాధితులు
  • అక్రమాలపై మర్లవడుతున్న బాధితులు
  • చస్తం.. లేదా చంపుతం.. అంటూ ఆఫీసర్లకు హెచ్చరికలు
  • ఆఫీసుల ఎదుట కుటుంబసభ్యులతో ఆందోళనలు
  • ధరణిలో లోపాలే ఆసరాగా లీడర్ల కబ్జాలు
  • లంచాలు తీస్కొని పట్టాల్లో పేర్లు మార్చేస్తున్న రెవెన్యూ సిబ్బంది


కరీంనగర్/నెట్ వర్క్, వెలుగు: ధరణి పోర్టల్​లోని లోపాలతో విసిగిపోయిన రైతులు మర్లవడుతున్నరు. తమ భూములు తమకు కాకుండా చేస్తున్నారని ఎక్కడికక్కడ ఆఫీసర్లను నిలదీస్తున్నరు. లీడర్లు, అధికారులు కుమ్మక్కై భూములను కబ్జా చేస్తున్నరని మండిపడుతున్నరు. ఒకే భూమిని ఇద్దరి పేరిట రిజిస్టర్​ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ లేకుండానే భూముల విరాసత్  చేయడం, మ్యుటేషన్​ కాని ల్యాండ్స్​కు డబుల్ రిజిస్టర్​చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నరు. న్యాయం కోసం కలెక్టరేట్లు, తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ ఏండ్ల తరబడి తిరుగుతున్నా స్పందిస్తలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. ఆఫీసుల ముందే కొందరు బాధితులు కిరోసిన్, పెట్రోల్ బాటిళ్లు, పురుగుల మందు డబ్బాలతో ఆత్మహత్యాయత్నం చేస్తుంటే.. ఇంకొందరు తమ భూములు తమకు దక్కకపోతే ఆఫీసర్ల అంతుచూస్తామని హెచ్చరిస్తున్నరు.

ఒకే భూమి.. రెండు రికార్డులు..

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భూమి రిజిస్టర్​ చేసుకుని మ్యుటేషన్ చేసుకోకపోతే అలాంటి భూములకు పట్టాదారులుగా ధరణిలో పాత ఓనర్ల పేర్లు వచ్చాయి. సాదా బైనామాల ద్వారా భూములు అమ్మిన వారిదీ ఇదే పరిస్థితి. ఇదే అదనుగా పాత ఓనర్లు ఆఫీసర్లతో కుమ్మక్కై మరొకరికి భూములు అమ్మేయడం, లేదంటే తమ బినామీల పేరిట రిజిస్టర్​ చేయడం లాంటి ఘటనలు ఘర్షణలకు దారితీస్తున్నాయి. 

నా చావుకు పర్మిషన్​ ఇవ్వండి

బీఆర్​ఎస్​ లీడర్​ తన భూమిని ఆక్రమించుకున్నాడని, అధికారులు న్యాయం చేయడం లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట మాజీ మావోయిస్టు​ కొడెం సమ్మయ్య అలియాస్​ చంద్రన్న ఇట్ల నాలుగురోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ఇదే మనాదితో తన భార్య చనిపోయిందని, కలెక్టరేట్​ ఎదుట ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతివ్వాలని 
సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 

మీ అంతు చూస్త

తన నాలుగెకరాల భూమిని అక్రమంగా వేరే వాళ్ల పేరుమీదికి ఎక్కించారని, సమస్యను పరిష్కరించాలని తిరుగుతున్నా స్పందించడం లేదంటూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అప్పల్ రావు పేటకు చెందిన మురారిశెట్టి బాలరాజు బుధవారం తహసీల్దార్​ను నిలదీశారు. ‘‘ఎన్నిరోజులు ఇట్లా తిరగాలి. మీ అంతు చూస్త. అప్పుడుగానీ మీకు, ప్రభుత్వానికి బుద్ధిరాదు”అంటూ హెచ్చరించారు.

తమ భూమిని అక్రమంగా ఇతరులకు పట్టా చేశారంటూ ఫిబ్రవరి 13న  జనగామ జిల్లా పసరమడ్లకు చెందిన రైతు నిమ్మల నర్సింగరావు దంపతులు కలెక్టర్​ ఆఫీసు బిల్డింగ్​ పైకెక్కి  డీజిల్​ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  గతంలో  సాదాబైనామా  పద్ధతిలో అప్పటి తహశీల్దార్​ పట్టాలిచ్చారని,  ఇప్పుడు ధరణి నిబంధనల వల్ల తామేమీ చేయలేమని అధికారులు చెప్తున్నారని  రైతు దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో నాలా కన్వర్షన్ కూడా చేసుకోకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసి అమ్మేశారు. రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్లు కొనుగోలుదారుల చేతుల్లో పెట్టారు. రిజిస్ట్రేషన్ అయిందనే భరోసాతో పాటు అవగాహన లోపంతో చాలా మంది ప్లాట్ల కొనుగోలుదారులు ఏండ్లు గడిచినా రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేయించుకోలేదు. దీంతో ఒకే ల్యాండ్  సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్లాట్ల కొనుగోలుదార్ల పేరిట, రెవెన్యూ రికార్డుల్లో పాత పట్టాదారుల పేరిట ఉండిపోయింది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో వీఆర్వోలు, ఎమ్మార్వోలు పాత ఓనర్ల పేర్లనే రికార్డుల్లోకి ఎక్కించి పాస్ బుక్స్ ఇచ్చారు. దీంతో కొందరు పాత ఓనర్లు ఇవే భూములను ఇతరులకు మరోసారి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. 

తహసీల్దార్లకు కాసులు కురిపిస్తున్న సర్క్యులర్

మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ప్లాట్ విస్తీర్ణం 20 గుంటలకు తక్కువగా ఉంటే రిజిస్టర్​ చేయొద్దని సూచిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్ 2021 జులై 9న అప్పటి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, సీసీఎల్ఏ గా ఉన్న సోమేశ్​కుమార్​కు లెటర్ రాశారు. ఇది లేఖ మాత్రమే. ఉత్తర్వు కాదు. ఈ లెటర్ పై అప్పటి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ, ఇదే లెటర్ చాలా మంది తహసీల్దార్లకు వరంగా మారింది. వ్యవసాయ భూములు కలిగిన రైతులు తమ అవసరాల కోసం ధరణిలో రెండు, మూడు గుంటలు అమ్మకానికి పెట్టి రిజిస్ట్రేషన్ కు వెళ్తే ప్రభుత్వం ఆర్డర్ ఉందని, కుదరదంటున్నారు. కానీ ధరణి ఆపరేటర్లు, మధ్యవర్తుల ద్వారా ల్యాండ్ వాల్యూను బట్టి రూ.20 వేల నుంచి లక్ష వరకు ముట్టజెప్తే రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇటీవలి ఘటనలు..

సాదాబైనామా కింద కొన్న భూమిని పాత యజమాని ఇతరుల పేర్లమీద రిజిస్టర్​  చేయడంతో బాధిత రైతు కుటుంబసభ్యులతో కలిసి ఫిబ్రవరి3న సిద్దిపేట జిల్లా కోహెడ తహసీల్దార్​ఆఫీసు ఎదుట ఆందోళన చేశాడు. ఆఫీసర్ల తీరు వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, తన సమస్య పరిష్కరించకపోతే కుటుంబంతో పాటు అక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించాడు. కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన ఇట్టిరెడ్డి పద్మారెడ్డి, ఇట్టిరెడ్డి సరోజనకు కోహెడ శివారులోని సర్వే నంబర్ 89 లో రెండెకరాల భూమి ఉంది. గూల్ల బాలయ్య 50 ఏండ్ల కింద సాదాబైనామా ద్వారా ల్యాండ్​ కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి మోకా మీద ఉన్న బాలయ్య వ్యవసాయం చేసుకుంటున్నాడు. సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నా సర్కారు చేయలేదు. ఈలోగా ధరణిలో పాత యజమానుల పేర్లే రావడంతో ఆ పాతయజమానులు  ఇతరుల పేర్ల మీద పట్టా చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు బాలయ్య న్యాయం కోసం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగాడు. 

మెదక్​ జిల్లా మనోహరాబాద్​ మండలం కొండాపూర్​లో సర్వేనంబర్ 126లో హైదారాబాద్​కు చెందిన ఓ వ్యక్తి కి మూడెకరాల భూమి ఉన్నట్టు అధికారులు రెవెన్యూ రికార్డులు సృష్టించారు. అసలు భూమే లేకున్నా ఆ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్​ చేయడమే కాక, అలాంటి భూమికి హద్దులు చూపాలన్న పిటిషన్​కు కూడా ఓకే చెప్పారు. ఆ సర్వేనంబర్​లోని ఇతర రైతులకు నోటీసులు ఇచ్చిన అధికారులు..  ఈ నెల 9న  సర్వే చేసేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న రైతులు ఆఫీసర్ల మీద మర్లపడ్డారు. రైతుల ఆందోళనలో ఒక కారు ధ్వంసమైంది.

కరీంనగర్ - హైదరాబాద్ హైవేలోని తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 666లో సుమారు 3 ఎకరాల్లో పదేండ్ల కిందట అనుమతుల్లేకుండా వెంచర్ చేశారు. కొనుగోలు చేసినవాళ్లకు పట్టాదారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేశారు. 2017 -- 18 పహాణీలో రెవెన్యూ ఆఫీసర్లు ఈ ఏరియాను ఇండ్ల స్థలాలుగా చూపినా నాలా కన్వర్షన్ మాత్రం చేయలేదు. అంతేగాక భూరికార్డుల ప్రక్షాళనలో ప్లాట్లు చేసి అమ్ముకున్న పాత యజమాని పేరిట పట్టాదారు పాస్ బుక్ జారీ చేశారు. ఒకే భూమిపై ఓనర్ పేరు ధరణి రికార్డుల్లో ఒకలా, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ రికార్డుల్లో మరోలా నమోదయ్యాయి. 


నా భూమి నాకు ఇప్పించకపోతే అంతుచూస్త

పైసలకు కక్కుర్తిపడి తన భూమిని ఇతరులకు తహసీల్దార్​ రిజిస్టర్​ చేశారని, తహసీల్దార్​ అంతుచూస్తానని ఓ రైతు హెచ్చరించాడు. ‘‘తహసీల్దార్​ విజయారెడ్డిని చంపినట్లు చేస్త.. అప్పుడుగానీ మీ రెవెన్యూ డిపార్ట్​మెంట్​కు, ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదు.. మహా అయితే జైలుకు పోతా.. 90 రోజుల్లో బెయిల్​ వస్తది..’’ అంటూ ఆందోళనకు దిగాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో బుధవారం జరిగింది. మండలంలోని అప్పల్ రావు పేట గ్రామంలో మురారిశెట్టి బాలరాజుకు నాలుగు ఎకరాల 28 గుంటల భూమి ఉంది. 15 ఏండ్ల కింద వరంగల్ వలస వెళ్లిన బాలరాజు.. 2015లో తన భూమిని మురారిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి అప్పటి ఆఫీసర్లకు లంచం ఇచ్చి రికార్డుల్లోకి ఎక్కించుకున్నాడని ఆందోళనకు దిగాడు. తప్పును సరిదిద్దాలంటూ తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదని మండిపడ్డాడు. బుధవారం రెవెన్యూ ఆఫీసుకు వచ్చి తహసీల్దార్ డీఎస్ వెంకన్నను బాలరాజు నిలదీశాడు. తన భూమిని ఇతరుల పేరు మీదికి ఎలా ఎక్కిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

నా చావుకు అనుమతించండి

‘‘నేను లొంగిపోయినందుకు ప్రభుత్వం ఇచ్చిన ఎకరంన్నర భూమిని ఓ బీఆర్ఎస్​ లీడర్​ కబ్జా చేసిండు. భూమి దగ్గరికి వస్తే చంపేస్తా అంటూ బెదిరిస్తున్నడు. అతని నుంచి భూమైనా ఇప్పించండి. లేదంటే నా  చావుకైనా అనుమతించండి’’ అంటూ మాజీ మావోయిస్టు​ కొడెం సమ్మయ్య అలియాస్​ చంద్రన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట బుధవారం నుంచి న్యాయ పోరాటానికి దిగాడు. మూడు, నాలుగు రోజులు ఇక్కడే దీక్ష చేస్తానని, అప్పటికీ ఆఫీసర్లు స్పందించకుంటే కలెక్టరేట్​ ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. బీఆర్​ఎస్​ ఇల్లెందు మున్సిపాలిటీ వైస్​ చైర్మన్​ జానీ పాషా తన భూమిని ఆక్రమించుకొని, మొక్కలు నాటాడన్నాడు. భూమి కోసం తాను, తన భార్య తహసీల్దార్​ను వేడుకున్నా లాభం లేకుండా పోయిందని చెప్పాడు. ఈ క్రమంలో మనాదితో తన భార్య సుగుణ చనిపోయిందని సమ్మయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.