
ఖమ్మం టౌన్, వెలుగు : రైతులు లాభసాటి పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం లచ్చిరాంతండాలో సోమవారం పర్యటించిన మంత్రి బీటీ రోడ్డు రిపేర్లు, బిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేస్తున్నామన్నారు.
రైతులు ఆయిల్‌పామ్, వక్క వంటి పంటలు సాగు చేసుకోవాలని.. వీటిలో అంతర పంటలుగా మిర్చి, పత్తి, కూరగాయలు సాగు చేసుకోవచ్చని చెప్పారు. ఆయిల్‌పామ్ సాగు చేస్తే ఎకరానికి రూ. 50 వేల సబ్సిడీ వస్తుందని చెప్పారు. వేసవి కాలంలో కూడా రఘునాథపాలెం మండలంలో చెరువులను నింపే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.
గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, రెండో విడతలో రేకుల ఇండ్లలో ఉంటున్న వారికి, మూడో విడతలో ఇండ్లు లేని వారికి ఇస్తామని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇల్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దన్నారు.
ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటూ, ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు పొందిన వారిని ఆఫీసర్లు ఇబ్బంది పెట్టొదని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పీఆర్ ఈఈ మహేశ్‌బాబు, విద్యుత్ శాఖ డీఈ రామారావు, రఘునాథపాలెం తహసీల్దార్ శ్వేత పాల్గొన్నారు.