కాళ్ల మీద పడ్డా.. కనికరిస్తలేరు

కాళ్ల మీద పడ్డా.. కనికరిస్తలేరు
  • ఎన్‌ఎస్పీ కాలువల పక్కన మొక్కలు నాటాలని ప్రభుత్వ ఆదేశం 
  • పేదలను భూముల నుంచి వెళ్లగొడుతున్న ఆఫీసర్లు

సూర్యాపేట, వెలుగు : దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్నామని.. వాటిని లాక్కోవద్దని రైతులు ఆఫీసర్ల కాళ్ల మీద పడి వేడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల కాలువల పక్కన మొక్కలను నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది. సూర్యాపేట జిల్లాలోని నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్, ఎస్సారెస్పీ,  మూసీ ప్రాజెక్టుల పరిధిలోని 330 ఎకరాల్లో మొక్కలు నాటాలని ఆఫీసర్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ కోసం పని చేసిన వందలాది గ్రామస్థులు నడిగూడెం నుంచి నాయకన్ గూడెం వరకు కాలువల పక్కన భూములను సాగు చేసుకుంటున్నారు. పది రోజులుగా కెనాల్ పక్కన సేద్యం చేయొద్దని రైతులను ఆఫీసర్లు హెచ్చరిస్తున్నారు. మొక్కలను నాటేందుకు స్థల పరిశీలన కోసం అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మంగళవారం నడిగూడెం చేరుకోగా రైతులు ఆయన వెహికల్ ను అడ్డుకున్నారు. అడిషనల్ కలెక్టర్ కిందకు దిగడంతో రైతులు తాత ముత్తాతల కాలం నుంచి సేద్యం చేసుకుంటున్న భూములను తీసుకోవద్దని ఆయన కాళ్ల మీద పడి వేడుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను వెళ్లగొట్టారు. కాలువలను ఆక్రమించుకొని వెంచర్లు వేసిన లీడర్ల భూముల జోలికి ఆఫీసర్లు పోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఏండ్లుగా సాగు చేస్తున్న తమ పొలాలు లాక్కోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బలవంతంగా లాక్కుంటున్నరు
తాతల కాలం నుంచి 80 సెంట్ల భూమిలో వ్యవసాయం చేస్తున్నం. ఇప్పుడు ప్రభుత్వం మొక్కల కోసం వ్యవసాయం చేయొద్దని భూమిపైకి పోనిస్తలేదు. పేదల నుంచి గుంజుకొని అన్యాయంగా మొక్కలు నాటుతున్నరు. వందల ఎకరాల్లో పడావు భూములు ఉండగా పేదల భూములను గుంజుకోవడం అన్యాయం.  
– సుధీర్ కుమార్, నడిగూడెం, సూర్యాపేట జిల్లా

ఎట్ల బతకాలె
ప్రభుత్వం మూడు ఎకరాల భూమి ఇస్తా అని మాట మార్చింది. ఇప్పుడు 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను మొక్కల పేరుతో గుంజుకుంటోంది. ఇంక మేం ఎట్ల బతకాలె. మా భూముల్లో మేం వ్యవసాయం చేసుకుంటాం. ఇందుకు సర్కారు సహకరించాలి.
– ఏపూరి తిరుపతమ్మ, నడిగూడెం, సూర్యాపేట జిల్లా