మంత్రి కేటీఆర్ ఇలాకాలో రైతుల పోరాటం

మంత్రి కేటీఆర్ ఇలాకాలో రైతుల పోరాటం

రాజన్న సిరిసిల్ల,వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలలో పది రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ కోసం భూమి సేకరించి సరైన పరిహారం ఇవ్వడంలేదని ఆవేదన చెందారు. పదిరోజులవుతున్నా ఎవరూ స్పందించకపోవడంతో ఆ భూముల్లోనే టెంట్లు వేసుకొని దీక్ష కొనసాగిస్తున్నారు. 

గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం 2020లో అధికారులు నర్మాల, దేశాయిపేట,లచ్చపేట రైతుల నుంచి 370 ఎకరాలు సేకరించారు. ఇందులో దేశాయిపేట,లచ్చపేట నుంచి 60 ఎకరాలు, మిగతా భూమిని నర్మాల రైతుల నుంచి సేకరించి, టీఎస్ఐఐసీకి అప్పగించారు. తమ భూములకు అరకొర పరిహారం ఇచ్చి, తమ బతుకులు ఆగం చేశారని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్​ ధర ఎకరానికి రూ. 20 లక్షలు ఉంటే తమకు కేవలం రూ. 5 లక్షలు ఇచ్చారని రైతులు చెబుతున్నారు.. 

కేటీఆర్​ను నమ్మి ఇచ్చినం..

‘ఫుడ్​ ప్రాసెసింగ్​ యూనిట్​ వస్తే ఇక్కడ పరిస్థితులు బాగు పడతాయని, భూములు ఇస్తే, సరైన పరిహారం ఇస్తాం’ అని కేటీఆర్​ హామీ ఇస్తేనే భూ సేకరణకు ఒప్పుకున్నాం అని రైతులు అంటున్నారు. కానీ, పేద దళిత రైతులకు అరకొర పరిహారం ఇచ్చి అన్యాయం చేశారని ఆవేదన చెందారు. మంత్రి కేటీఆర్ స్పందించేదాక తాము దీక్షలు ఆపబోమని స్పష్టం చేశారు. నర్మాల రైతులకు ఎకరానికి రూ. 5లక్షలు మాత్రమే పరిహారం అందింది. కొంత మంది రైతులకు చెక్కులు అందినా.. ఖాతాల్లో డబ్బు జమ కాలేదని అన్నారు. భూముల్లోని బోరుబావులకు,పశువుల పాకలు పరిహారం ఇవ్వలేదు. రైతులకు అందించే నష్టపరిహరంలో కొంత మంది అధికార పార్టీ నాయకులు చేతివాటం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. నర్మాల పక్కనే ఉన్నా దేశాయిపేట,లచ్చపేట రైతులకు ఎకరానికి రూ.10.40లక్షల చొప్పున పరిహారం ఇచ్చారని, నర్మాల రైతులకు మాత్రం అన్యాయం జరిగిందని రైతులు అంటున్నారు. పక్కపక్కనే గ్రామాల్లో పరిహారం ఇవ్వటంలో అధికారులు తేడాలెందుకు చూపారని, భూముల్ని త్యాగం చేసిన అందరికి సమాన పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. 

కేటీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి

మంత్రి కేటీఆర్ గతంలో గంభీరావుపేట లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం భూములిచ్చిన రైతులను ఆదుకుంటామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గంలోనే రైతులు పరిహారం కోసం పోరాడుతున్నా పట్టించుకునేవారే లేరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం సరైన పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు. 

కూలికి పోతున్నా ..

నాకున్న ఎకరం భూమిని ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు నేను కూలికిపోతున్న. భూములు రేట్లు పెరిగినా ప్రభుత్వం పరిహారం తక్కువే ఇచ్చింది. బతుకు దెరువు లేక గోస పడుతున్నాం. సర్కారే మమల్ని ఆదుకోవాలి.

– నర్మాల రైతు, మిద్దెరాజయ్య

ఉపాధి కల్పించాలి

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్​ కోసం ప్రభుత్వం మా భూమిని తీసుకుంది. వ్యవసాయం మీదనే ఆధారపడిన కుటుంబం మాది. భూములు ఇచ్చి త్యాగాలు చేసిన వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన మంత్రి కేటీఆర్ ఆ హామీ నిలబెట్టుకోవాలి.రెండేండ్ల నుంచి ఇతర పనులు చేసుకుంటున్నాం. భూములు కోల్పోయిన నాలాంటి యువతకు ఉద్యోగం కల్పించాలి.

– కర్రోల్ల రాజు,​ నర్మాల గ్రామ యువకుడు