విద్యుత్​ షాక్​లతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు 

విద్యుత్​ షాక్​లతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు 
  •     ఉమ్మడి జిల్లాలో 17 రోజుల్లో తొమ్మిది మంది మృతి  
  •     విద్యుత్ శాఖ వ్యవస్థలో లోపాలు
  •     పట్టించుకోని అధికారులు 

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : రైతు కుటుంబాల్లో కరెంట్ ప్రమాదాలు చీకట్లు నింపుతున్నాయి. ఉమ్మడి మెదక్​ జిల్లాలో కరెంట్​ షాక్​తో గత 17 రోజుల్లోనే  తొమ్మిది మంది రైతులు చనిపోయారు. పెద్దదిక్కును కోల్పోయి ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘటనలకు విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం, కరెంట్ సరఫరా వ్యవస్థలో లోపాలు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద ఎర్తింగ్ సమస్యలు, రైతుల అజాగ్రత్త, ఇతరత్రా కారణాలుగా తెలుస్తోంది. 

వరుస ప్రమాదాలు.. ఆందోళనలో రైతులు.. 

ఉమ్మడి జిల్లాలో వరుస కరెంట్​ ప్రమాదాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కరెంట్​కు సబంధించి ఏ రిపేరు వచ్చినా చేసుకునేందుకు జంకుతున్నారు. కానీ సరైన సమయానికి అధికారులు, మెకానిక్​లు అందుబాటులో లేకపోవడంతో వేరే దిక్కులేక భయపడుతూనే స్టార్టర్లు, మోటర్లు సొంతంగా రిపేర్లు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల స్తంభాల నుంచి కరెంట్​ తీగలు తెగిపడి ప్రమాదాల బారిన పడుతున్నారు. మరికొన్ని చోట్ల పంటల రక్షణకు కంచెలుగా కరెంట్​ తీగలు కట్టుకుని ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. 

రెండు వారాల్లో జరిగిన ఘటనలు.. 

  • మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామానికి చెందిన కుమ్మరి పెంటయ్య (32) కౌలుకు చేస్తున్న పొలం వద్ద ఐదు రోజుల కింద కరెంట్ షాక్ తో మృతి చెందాడు. కరెంట్ వైర్ తెగి పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ పై మీద పడింది. అది గమనించని పెంటయ్య కంచెను దాటుతుండగా తీగ తగిలి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే చనిపోయాడు. రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన ఇబ్రహీం (30) ఐదు రోజుల కింద పొలం దగ్గర బోరు మోటారుకు సంబంధించిన స్టార్టర్ డబ్బా  ముట్టుకోగా కరెంట్ షాక్ కొట్టి స్పాట్ లోనే చనిపోయాడు. రెండు వారాల కింద వెల్దుర్తి మండలం శేరిల్లాకు చెందిన బండ మైసయ్య(35) పొలం వద్ద స్టార్టర్​ సరి చేస్తుండగా కరెంట్​ షాక్​ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. 
  • సంగారెడ్డి జిల్లాలో రెండు ఘటనల్లో ముగ్గురు చనిపోయారు.  నాలుగు రోజుల కింద ఝరాసంగం మండలం బిడేకన్నెలో భార్యభర్తలు ముక్కన్నగారి దేవదాసు, మరియమ్మ పొలం పనులు చేస్తున్నారు. అక్కడే అడవి పందుల నుంచి చెరుకు తోటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ఉంది. తోటకు గడ్డిమందు స్ప్రే చేస్తూ ప్రమాదవశాత్తు భార్య విద్యుత్ షాక్ కు గురైంది. ఆమెను కాపాడే ప్రయత్నంలో భర్త కూడా షాక్ కు గురై అక్కడికక్కడే ఇద్దరూ చనిపోయారు. వారం రోజుల కింద కోహీర్​ మండలం సజ్జాపూర్​ గ్రామానికి చెందిన పెద్దదొడ్డి పాండురంగారెడ్డి తన పొలంలో సోయా పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన వైర్​ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు.
  • సిద్దిపేట జిల్లా తొగుట మండలం  బంజీరుపల్లికి చెందిన రైతు పిట్ల రామస్వామి పొలం వద్ద విద్యుత్  తీగ తగిలి షాక్ తో అక్కడికక్కడే చనిపోయాడు. కోహెడ మండలం అరేపల్లికి చెందిన  రైతు పకిడే బాల మల్లయ్య (57)తన పొలం వద్ద బోరు మోటారు ఆన్ చేస్తున్న క్రమంలో వైరు తగిలి కరెంట్ షాక్ తో  మృతి చెందాడు. దౌల్తాబాద్ మండలం తీర్మలపుర్ లో జనగామ పోచయ్య  బావి వద్ద బోరు మోటారు రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్ గురై చనిపోయాడు. 

ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లే.. 

విద్యుత్ శాఖ వ్యవస్థలోని లోపాలతోనే ఎక్కువ ప్రమాదాలు జరగుతున్నాయని, ప్రమాదాన్ని పసిగట్టి ముందే అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవట్లేదని పలువురు రైతులు వాపోతున్నారు. పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్ల ఎర్తింగ్ ను సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం, విద్యుత్ సరఫరా అవాంతరాలను సరి చేసేందుకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో దిక్కులేక సొంతంగా రిపేర్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పొలాల్లో జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్, వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టాల్సిన చైతన్య కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదని పలువురు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

జాగ్రత్తలు తీసుకుంటే మేలు.. 

కరెంట్ ప్రమాదాలకు గురికాకుండా రైతులు కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మేలు.  వ్యసాయం మోటర్లకు సంబంధించిన స్టార్టర్లు వానకు తడవకుండా చూడాలి. స్టార్టర్లు బురదలో కాకుండా గట్టుపై ఉండేలా చూసుకోవాలి. పొలంలో కరెంట్ స్తంభాలు వరిగి ఉన్నా, తీగలు మనుషులకు తాకేలా కిందకు వేలాడుతున్నా వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చి సరిచేయించాలి. నాణ్యత కలిగిన కరెంట్​ తీగలనే వాడాలి.