కాంటా పెట్టి 15 రోజులైనా అమౌంట్ జమైతలే 

కాంటా పెట్టి 15 రోజులైనా అమౌంట్ జమైతలే 

వానాకాలం సీజన్​కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై 15 రోజులు గడచినా ఇంకా వడ్లు అమ్మిన రైతులకు పైసలు వస్తాలేవు. రైస్​మిల్లర్లతో సివిల్​ సప్లై డిపార్ట్​మెంట్​ అగ్రిమెంట్​ ప్రాసెస్​ డిలే కావడంతో  పేమెంట్​ జరగడం లేదని తెలుస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • కాంటా పెట్టి 15 రోజులైనా అమౌంట్ జమైతలే 
  • మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో  రూ.313 కోట్లు డ్యూ
  • ఆందోళనలో రైతులు..  త్వరగా ఇవ్వాలని విజ్ఞప్తి

మెదక్​/సంగారెడ్డి, (నిజాంపేట), వెలుగు : వానాకాలం సీజన్​లో మెదక్​ జిల్లాలో రైతులు పండించిన 5 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్, ఎఫ్​పీఓ ఆధ్వర్యంలో 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 15 వరకు ఆయా కేంద్రాల ద్వారా 19,468 మంది రైతుల నుంచి 1.02,948 మెట్రిక్​ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. అందులో 95,620 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్​ మిల్లులకు తరలించారు. ఇప్పటి వరకు కొన్న ధాన్యానికి సంబంధించి రైతులకు రూ.212 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాగా ఇప్పటి వరకు 154 మంది రైతులకు రూ.1.41 కోట్లు మాత్రమే జమయ్యాయి.  ఇవి పోను ఇంకా 19,314 మంది రైతులకు రూ 210 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 

సంగారెడ్డి జిల్లాలో....

జిల్లాలో ఇప్పటి వరకు 10,361 మంది రైతుల నుంచి 56,529 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో 53,111 మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు షిఫ్ట్ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.116 కోట్లు చెల్లించాల్సి ఉండగా,  కేవలం 1,176 మంది రైతులకు  రూ.14.44 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా 9,185 మంది రైతులకు రూ.102 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 

అగ్రిమెంట్​ ప్రాసెస్​ లేట్ తో....

ఆయా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టం మిల్లింగ్​కోసం రైస్ ​మిల్లులకు పంపిస్తారు. రైస్​ మిల్లుల నుంచి ట్రక్​ షీట్ ​వచ్చాక, సెంటర్​ నిర్వహకులు ట్యాబ్​లో ఎంట్రీ పూర్తి చేస్తే రైతుల బ్యాంక్​ అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. అయితే కస్టం మిల్లింగ్ కు సంబంధించి రైస్​ మిల్లర్లతో సివిల్ సప్లై డిపార్ట్​మెంట్​ అగ్రిమెంట్​ చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చే ధాన్యం బాధ్యత తమదేనని, ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా కస్టం మిల్లింగ్​ రైస్​(సీఎంఆర్) సరఫరా చేస్తామని ఒప్పందం రాసివాల్సి ఉంటుంది. ఈ అగ్రిమెంట్​ కాపీలను ఆన్​లైన్​లో అప్​లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్​ పూర్తి అయితేనే కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు డబ్బులు చెల్లించే వీలుంటుంది. అయితే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై పదిహేను రోజులు కావడంతోపాటు, తూకం వేసిన ధాన్యం రైస్​మిల్లులకు తరలిస్తున్నప్పటికీ రైస్​మిల్​ ఓనర్లతో అగ్రిమెంట్​ ప్రాసెస్​ సకాలంలో పూర్తి కాక పోవడం వల్ల  పేమెంట్ ​ లేటు అయ్యింది. ఫలితంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పంట కోసిన హార్వెస్టర్లు, ట్రాన్స్​పోర్ట్, టాపర్ల కిరాయి చెల్లించేందుకు చేతిలో పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ అకౌంట్లలో వడ్ల పైసలు జమ చేయాలని కోరుతున్నారు. 

పది రోజులైనా పైసలు రాలే

పది రోజుల కింద చల్మెడ కొనుగోలు కేంద్రంలో 109 క్వింటాళ్ల వడ్లు కాంటా పెట్టిన. రెండు రోజుల్లో పైసలు వస్తయని చెప్పిన్రు. కానీ ఇంకా నా అకౌంట్​లో వడ్ల పైసలు జమ కాలే. పైసల్లేక మస్తు ఇబ్బంది అయితుంది. జల్ది ఇయ్యాలె. 

- సంతోష్ రెడ్డి, రైతు, చల్మెడ