విశ్లేషణ: విపత్తులు, ప్రభుత్వ విధానాలతో అప్పుల ఊబిలో రైతులు

విశ్లేషణ: విపత్తులు, ప్రభుత్వ విధానాలతో అప్పుల ఊబిలో రైతులు

కరువులు, వర్షాభావ పరిస్థితులు, వరదలు, వడగండ్లు, భారీ వర్షాలు, తుపాన్లు, పిడుగులు, క్లౌడ్ బరస్ట్ లు– ప్రకృతి వైపరీత్యమేదైనా తక్షణం నష్ట పోయేది రైతులే. విపత్తులతో ఆయా పంటల సగటు దిగుబడులు తగ్గిపోవడం, మొత్తం పంటే నాశనమైపోవడం, నాణ్యత తగ్గడం, ఫలితంగా సరైన ధర రాక, పంట ఉత్పత్తి ఖర్చులకు తగినట్లు ఆదాయం లేకపోవడం– ఇవన్నీ కలగలసి రైతు కుటుంబాలను అప్పుల ఊబిలోకి దించుతున్నాయి. అప్పుల నుంచి బయట పడలేని దుస్థితిలోనే రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తెలంగాణలో గత 8 ఏండ్లలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వెనుక ప్రకృతి వైపరీత్యాలు సృష్టించిన విధ్వంసం ఉంది. విపత్తులతో నష్టాలు ఎక్కడైనా సహజమే. కొన్ని సార్లు ఈ నష్టాలను అరికట్టడం రైతులకు, ప్రభుత్వాలకు కూడా సాధ్యం కాదు. అందుకే ఆయా దేశాల్లో ప్రభుత్వాలు రైతులను, ప్రజలను ఆదుకోవడానికి నష్టపరిహారం చెల్లిస్తాయి. లేదా బీమా పథకాలు అమలు చేస్తాయి. అమెరికా, యూరప్, చైనా, జపాన్ లాంటి దేశాల్లో కూడా ఇలాంటి పథకాలు ఉన్నాయి. రైతులు, ప్రజలు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన కనీస పాలనా బాధ్యత ఇది. 

ఎకరానికి రూ.4 వేల పరిహారం

మన దేశంలో జాతీయ స్థాయిలో 2005 జాతీయ విపత్తు చట్టం అమలులో ఉంది. జాతీయ ప్రకృతి వైపరీత్యాల పరిహార నిధి (ఎన్​డీఆర్ఎఫ్) కూడా కేంద్ర బడ్జెట్ లో భాగంగా ఉంది. ఎన్‌డీ‌ఆర్‌ఎఫ్ నుంచి ఏటా ఎస్‌డీ‌ఆర్‌ఎఫ్ కు నిధులు అందుతాయి. వీటికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించుకొని, ప్రజలకు నష్టాలు వాటిల్లిన సందర్భాల్లో తక్షణ పరిహారం
(ఇనపుట్ సబ్సిడీ) అందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇన్ పుట్ సబ్సిడీగా నిర్ణయించింది తక్కువ మొత్తమే, అయినా కనీసం ఆ పద్ధతి అమలులో ఉంది. నష్ట పోయిన రైతులకు ఎకరానికి కనీసం రూ.10 వేలు పరిహారంగా అందించాలని 2013 లోనే “హుడా కమిషన్” సిఫారసు చేసినా , తెలంగాణలో 2015 లో వచ్చిన జీవో ప్రకారం ఎకరానికి కేవలం రూ.4 వేల పరిహారం మాత్రమే నిర్ణయించారు. ఇది కూడా పంట సగటు ఉత్పత్తిలో 33 శాతం మించి నష్టపోతే మాత్రమే అందుతుంది. 

కోర్టు తీర్పు ఇచ్చిన అమలు చేయక..

పరిహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రశ్నిస్తూ..  రైతు స్వరాజ్య వేదిక కోర్టు తలుపులు తట్టింది. 2020 ఖరీఫ్ లో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2020 సెప్టెంబర్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. వర్షాల వల్ల  జరిగిన నష్టాలను వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి 2020 అక్టోబర్ 15న కేంద్రానికి ఉత్తరం కూడా రాశారు. కేంద్ర బృందం వచ్చి పరిశీలించి వెళ్లింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ కూడా 2021 నాటికే నష్టం వివరాలతో ఫైనల్ రిపోర్ట్ కేంద్రానికి పంపింది. ఈ వ్యాజ్యంపై ఏడాది పాటు విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు 2021 సెప్టెంబర్ 28 న రైతులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 3 నెలల్లో రైతులను గుర్తించి 2022 జనవరి 28 నాటికి పరిహారం అందించాలని, పంటల బీమా పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు కాబట్టి, సన్న, చిన్న కారు రైతులకు బీమా పరిహారం కూడా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకుండా, పచ్చి అబద్ధాలతో సుప్రీం కోర్టు అప్పీల్ కు వెళ్లింది. ప్రస్తుతం విచారణ జరుగుతున్నది.

కలెక్టర్లు స్పందించినా పరిహారం వచ్చే అవకాశం..

2021, 2022 ఖరీఫ్ సీజన్లలో కూడా భారీ వర్షాలతో రైతులు నష్టపోయారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం 2020 అనుభవాల నుంచి ఏమీ నేర్చుకోలేదు. గ్రామాల వారీగా నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి కేంద్రానికి పంపలేదు. రాష్ట్ర సర్కారు తరఫున కూడా ఎలాంటి సాయం అందించలేదు. సమాచార హక్కు చట్టం కింద రైతు స్వరాజ్య వేదిక రాసిన లేఖకు సమాధానంగా 2022  ఖరీఫ్ సీజన్ లో ఆదిలాబాద్ జిల్లాలో 29,805 మంది రైతుల 1,03,305 ఎకరాల్లో, మంచిర్యాల జిల్లాలో 20,997 మంది రైతుల 34,519 ఎకరాల్లో, నిర్మల్ జిల్లాలో 8,766 మంది రైతుల 24,567 ఎకరాల్లో, జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో 29,630 మంది రైతుల 92,310 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన14 మంది రైతులు 2022 ఖరీఫ్ లో తమకు జరిగిన పంట నష్టాలకు పరిహారం చెల్లించాలని సెప్టెంబర్ 27న దాఖలు చేసిన ట్రీట్ పిటీషన్ పై రాష్ట్ర హైకోర్టు అక్టోబర్ 21న, రైతులకు జరిగిన నష్టం వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఈ మేరకు ఆ జిల్లాలో ఆ గ్రామ సర్వే కూడా పూర్తి చేశారు. రాష్ట ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో నష్టం వివరాలను సేకరించాలనే విధాన నిర్ణయం తీసుకోకపోయినా, 2005 ప్రకృతి వైపరీత్యాల యాజమాన్య చట్టం ప్రకారం, వివరాలను సేకరించి, ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ మీదే ఉందని ఈ ఆర్డర్ లో కోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ ఆర్డర్ స్ఫూర్తిని అర్థం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూడకుండా మిగిలిన జిల్లాల కలెక్టర్స్ కూడా నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పంపితే, రైతులకు పరిహారం అందే అవకాశం ఉంది. 

ప్రభుత్వమే బీమా అమలు చేయాలె..

ప్రజాస్వామిక పరిపాలన అంటే, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలించడం. కనీసం కోర్టు ఆదేశాలను పాటించడం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సూత్రాలను పాటించడం లేదు. ఇప్పటికే రాష్ట్ర రైతులకు జరిగిన నష్టాలను అర్థం చేసుకుని 2023 ఖరీఫ్ నుంచి రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి. అన్నిపంటలను, గ్రామం యూనిట్ గా బీమా పరిధిలోకి తీసుకు రావాలి. సన్న, చిన్నకారు రైతుల ప్రీమియం మొత్తాన్ని కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ లాగ మొత్తం రైతుల ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. 2020 సంవత్సరానికి పంట నష్ట పరిహారం చెల్లింపు విషయంలో, సుప్రీంకోర్టులో అప్పీల్ ను ఉపసంహరించుకుని రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలు చేయాలి. ఎప్పుడు ప్రకృతి వైపరీత్యం సంభవించినా, వెంటనే నష్టపోయిన వారి వివరాలు సేకరించి,పరిహారం అందించాలి. ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో కూడా నిధులను కేటాయించాలి.

పంటల బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ

జాతీయ స్థాయిలో అమలవుతున్న పంటల బీమా పథకాలకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం భారాన్ని భరించే విధానం ఉంది. బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతులు ఆటోమాటిక్ గా పంటల బీమా పరిధిలోకి వచ్చే వాళ్లు. 2019 వరకు రైతులు కొద్దిపాటి ప్రీమియం చెల్లిస్తే, మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేవి. పంట నష్టం జరిగినప్పుడు బీమా పరిధిలోకి వచ్చిన రైతులకు ఎంతో కొంత బీమా పరిహారం అందేది. కానీ 2020లో కేంద్రం బీమా మార్గదర్శకాల్లో మార్పులు చేసి, తన వాటా ప్రీమియం చెల్లింపును 30 శాతానికి పరిమితం చేసుకుంది. పైగా ఈ బీమా పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేయాలా వద్దా అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 2020 ఖరీఫ్ నుంచి పంటల బీమా పథకాలను పూర్తిగా నిలిపి వేసింది. మరి కొన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర బీమా పథకాల అమలు ఆపేసినా, కనీసం తమ రాష్ట్రాలకు సొంత బీమా పథకాలు అమలు చేసుకున్నాయి. అసలు పంటల బీమా పథకమే లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. ఫలితంగా రైతులు నష్ట పోయిన సందర్భాల్లో బీమా పరిహారం అందడం లేదు. గత మూడేండ్లుగా రాష్ట్రంలో భారీ వర్షాలతో రైతులు పంటలు నష్టపోతూనే ఉన్నారు. ప్రభుత్వం అత్యంత బాధ్యతా రహితంగా వ్యవహరిస్తూ, కనీసం గ్రామాల వారీగా పంటలు నష్టపోయిన రైతుల వివరాలను కూడా సేకరించడం లేదు. నష్టపోయిన రైతుల వివరాలతో కేంద్రానికి నివేదికలు పంపి సాయం కూడా అడగడం లేదు. 
- కన్నెగంటి రవి,
రైతు స్వరాజ్య వేదిక