
- ఏటా వానాకాలంలో ప్రాణాలు తీస్తున్న పాత ఇండ్లు
- 385 భవనాలను గుర్తించిన ఆఫీసర్లు
- లెక్కకురానివి 1000కి పైనే..
- రివ్యూలు, ఆదేశాలకే పరిమితమైన కూల్చివేతలు
2022 జూన్ రెండో వారం. ఇదే వానాకాలం సీజన్‍లో వరంగల్ చార్‍బౌలీలో కూలీ పనికోసం వెళ్లిన శ్రీనివాస్, సునీతపై పాత ఇల్లు కూలడంతో మట్టి గోడల కిందపడి అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో కాళ్లు, చేతులు పొగొట్టుకున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ వరంగల్లో గడువు దాటిన శిథిల భవనాలను తొలగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఆదేశాలను నాలుగైదు భవనాల కూల్చివేతతో మమ అనిపించారు. గత రెండు వానాకాలం సీజన్లలో కూడా పాత ఇండ్లు కూలినా ఆ సమయంలో మనుషులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్ స్మార్ట్ సిటీలో పాతకాలంనాటి శిథిల భవనాలు జనాలను వణికిస్తున్నాయి. మెయిన్ జంక్షన్లు, షాపింగ్ మాల్స్, చిరువ్యాపారాలు కొనసాగించే పలుచోట్ల పెచ్చులూడుతున్న స్లాబులు, బీటలు వారిన పిల్లర్లు, పాకురుపట్టి చెట్లు మొలిచిన గోడలతో ఉన్న ఓల్డ్ బిల్డింగులు ఎప్పుడు ఎవరిపై కూలుతాయోనని ఆందోళన చెందుతున్నారు. కాగా, ఏటా వానాకాలానికి రెండు, మూడు నెలల ముందే నగరంలోని శిథిల భవనాలను గుర్తించి వాటిని కూల్చివేయాల్సిన జీడబ్ల్యూఎంసీ అధికారులు, ఈసారి జులై నెల వచ్చినా ఇంకా రివ్యూల్లో కూల్చివేతల ఆదేశాల వరకే పరిమితమయ్యారు.
ఆఫీసర్ల లెక్కలో 385 డేంజర్ ఇండ్లు..
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‍లోని సిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల లెక్కల ప్రకారమే ట్రైసిటీలోని 66 డివిజన్లలో 385 భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా, మొత్తం సిటీతోపాటు విలీన గ్రామాలను పరిశీలిస్తే వీటి సంఖ్య మరో 1000 దాటే అవకాశం ఉంది. గ్రేటర్ వరంగల్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న కాలం చెల్లిన భవనాలు ప్రధానంగా వరంగల్ స్టేషన్ రోడ్డు, రైల్వేగేట్, సీకేఎం హాస్పిటల్ రోడ్, రామన్నపేట, బీట్‌బజార్, వరంగల్ చౌరస్తా, జేపీఎన్ రోడ్, గిర్మాజీపేట, చౌర్‌బౌలీ, మండిబజార్, ఎంజీఎం, గోపాలస్వామి గుడి, హనుమకొండలోని మచిలీబజార్, నయీంనగర్, కాజీపేట, సోమిడి రోడ్, బాపూజీ నగర్లో కనిపిస్తున్నాయి.
ఎంజీఎం ఆస్పత్రి.. సర్కారు ఆఫీసులు
వరంగల్ సిటీలో కాలం చెల్లిన బిల్డింగుల్లో ప్రైవేటు భవనాలతోపాటు గవర్నమెంట్ ఆఫీసులు, ఆస్పత్రులున్నాయి. రైల్వే స్టేషన్ రోడ్‍లో మూడు, నాలుగు తరాలుగా జనాలు చూస్తున్న బిల్డింగులు ప్రధాన రోడ్లవెంటే ఉన్నాయి. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని పలు వార్డులు డేంజర్‍గా ఉన్నాయి. గతంలో పిల్లల విభాగంలో పెచ్చులూడి తల్లి, బిడ్డలకు ప్రమాదాలు జరిగాయి. శుక్రవారం సైతం సర్జికల్ వార్డు వద్ద పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడగా ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఆదేశాలు, నోటీసులకే పరిమితం..
ప్రజాభద్రత దృష్ట్యా భవన నిర్మాణాల చట్టంలో సెక్షన్353(బీ) ప్రకారం పాత బిల్డింగులను కూల్చే అధికారం గ్రేటర్ అధికారులకు ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టి 70 నుంచి 80 ఏండ్లు దాటడానికితోడు ప్రమాదకరంగా ఉన్న భవనాలను గుర్తించి టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఇండ్లు నాణ్యతగా ఉండే సదరు ఓనర్లు వారంలో స్ట్రక్చర్ స్టెబిలిటీ సర్టిఫికేట్ సంబంధిత ఆఫీసర్లకు సమర్పించాలి. లేదంటే స్వచ్ఛందంగా వారే ఇంటిని కూల్చాలి. వారు స్పందించని క్రమంలో బల్దియా అధికారులే శిథిలావస్థలో ఉన్న ప్రమాదకర ఇండ్లను కూల్చివేయాలి.
కాగా, గ్రేటర్ వరంగల్ సిటీలో మాత్రం టౌన్‍ప్లానింగ్ సిబ్బంది నోటీసులు లేదంటే రాజకీయ ఒత్తిళ్లతో ఆ ఇండ్లకు స్టిక్కర్లు వేయడం వరకే పరిమితమవుతున్నారు. ఇది నిజమన్నట్లుగా గడిచిన రెండు, మూడు నెలలుగా మేయర్, కమిషనర్ స్థాయిలో నిర్వహించిన రివ్యూల్లో కూడా ఓల్డ్ బిల్డింగ్స్పై చర్యల అంశం వస్తున్నాఎక్కడా కూల్చివేతలు జరగలేదు. ప్రమాదాలు జరుగకముందే పట్టించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.