
హైదరాబాద్‌సిటీ, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్‌గా సందీప్ మాథుర్ మంగళవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో విధుల్లో చేరారు. 1988 బ్యాచ్ ఐఆర్‌ఎస్‌ఎస్‌ఈ(ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగ్నలింగ్ ఇంజనీర్) కేడర్‌కు చెందిన మాథుర్.. రైల్వే బోర్డులో ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సిగ్నలింగ్)గా, ఉత్తర రైల్వేలో అసిస్టెంట్ సిగ్నల్ ఇంజనీర్‌గా, ఝాన్సీలో డివిజనల్ రైల్వే మేనేజర్‌గా సేవలందించారు.
భారతీయ రైల్వే పరిశోధన విభాగమైన ఆర్‌డీఎస్‌వోలో "కవచ్" ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అరుణ్ కుమార్ జైన్ సోమవారం పదవీ విరమణ చేయడంతో మాథుర్‌ను ఎస్సీఆర్ కు జీఎంగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన.. దక్షిణ మధ్య రైల్వేఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైల్వే భద్రత, వర్షాకాల జాగ్రత్తలు, ప్రయాణీకుల సౌకర్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.