అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు

అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు

నల్గొండ అర్బన్, వెలుగు : అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందని నల్గొండ జిల్లాలో రైతులు ఆవేదన చెందుతున్నారు. పోసి10 రోజులవుతున్నా ఐకేపీ, పీఏసీఎస్​ కేంద్రాల నిర్వాహకులు కొనకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. నల్గొండ మండలం అనంతారం గ్రామానికి చెందిన తండు శ్రీను పది రోజుల క్రితం ధాన్యాన్ని అక్కలాయగూడెం (ఎస్ఎల్బీసీ) కేంద్రానికి తీసుకువచ్చి పోశాడు.

మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో సుమారు 20 నుంచి 25 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది. నిర్వాహకులు కావాలనే కాంటా వేయడం లేదని, పైరవీ చేయించుకున్న వారికి, డబ్బులు ఇచ్చిన వారి వడ్లకే కాంటాలు పెడుతున్నారని ఆరోపించాడు. శ్రీను ధాన్యం కొట్టుకుపోగా, మరో 70 నుంచి 80 మంది రైతుల ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మునుగోడు మండలం కొరిటికల్, మునుగోడు కేంద్రాల్లో కూడా వడ్లు తడిసిపోయాయి.

నల్గొండలోని కొత్తపల్లి, ఎస్ఎల్బీసీల్లో ధాన్యం కుప్పులు తడిసిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేయడం వల్లే ఇలా జరిగిందని రైతులు వాపోతున్నారు. తడిసిన వడ్లను కొంటామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు.