పత్తి విక్రయానికి రైతుల పడిగాపులు!

పత్తి విక్రయానికి రైతుల పడిగాపులు!

తెలంగాణలో ఈ సంవత్సరం 45.34 లక్షల ఎకరాలలో 22 లక్షల మంది రైతులు పత్తిపంట సాగుచేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రకటించినప్పటికీ అంతకంటే ఎక్కువగానే సాగు చేసినట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం పత్తి పంటల సాగు మొదలైనప్పటి నుంచి అన్నదాతలపై  దెబ్బమీద దెబ్బ పడుతోంది. వాతావరణ అనుకూల పరిస్థితులలో  రైతన్నలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు.  తొలుత అనావృష్టి, తర్వాత అతివృష్టి, ఇప్పుడు అకాల వర్షాలు.. రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. సకాలంలో విత్తనాలు, ఎరువుల కొరతలు,  లేబర్ రేట్లు పెరగటం, కలుపు నివారణ, పెట్టుబడులు పెరిగిపోవడంతో  రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నీటిపాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు  ప్రకృతి కరుణించక కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి, మరికొన్ని ప్రాంతాలలో అనావృష్టి వలన పంటల దిగుబడి బాగా తగ్గడంతో రైతుల బాధలు పెరిగాయి.  

గత నెల రోజులుగా  కురుస్తున్న వర్షాలు, చలి వాతావరణం  రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో  తేమశాతం పెరిగి  పత్తిని నిల్వచేసుకోలేక,  అమ్ముకుందామంటే  కొనే  నాథుడు లేక రైతులు పరేషాన్ అవుతున్నారు. తాజాగా 'మొంథా'  తుఫాన్  ప్రభావంతో గత వారంలో భారీ వర్షాలు రావడంతో  రైతులు మరింత ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది.  

కొనుగోళ్లు ఆగొద్దు

రాష్ట్రంలో సెప్టెంబర్  రెండో వారం నుంచే  పత్తిపంట తీసే సీజన్ స్టార్ట్ అవుతుంది.  భారతదేశంలోనే  తెలంగాణ అత్యధికంగా పత్తి పంటను సేద్యం 
చేస్తున్న రాష్ట్రం.  తెలంగాణలో  ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్​నగర్  జిల్లాల్లో  పత్తి పంటసాగు విస్తీర్ణం ఎక్కువ.   పత్తి పంట ఏరుతున్న సీజన్ స్టార్ట్ అయినందున రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.  ఈ మేరకు ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం,  సీసీఐను ఒప్పించి ఈ సీజన్లో 122 సీసీఐ కేంద్రాలను పెట్టడానికి ఒప్పించింది.   కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ 22  నుంచి ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం,  సీసీఐ ప్రకటించింది.   రాష్ట్రంలో 318  జిన్నింగు మిల్లు కేంద్రాలతోపాటు  మార్కెట్ యార్డులలో  పత్తి కొనుగోలుకు అనుమతించామని,  దీపావళి  పండుగ తర్వాత కొనుగోలు చేపడతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  ప్రకటించారు. అక్టోబర్ 17న కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి  కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 22 నుంచి 122  సీసీఐ కేంద్రాలలో పత్తి కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు.

కొనుగోలు కేంద్రాలు 72 మాత్రమే ప్రారంభించారు

పత్తి  రైతులను ఆదుకొనుటకుగాను క్వింటాల్ రేటును రూ. 8,110 లుగా కేంద్రం నిర్ణయించి,   తేమశాతం 8 నుంచి 12 కంటే  తక్కువగా ఉండేవిధంగా రైతులు చూసుకోవాలని కోరారు.  కానీ, రాష్ట్రంలో అక్టోబర్ 28 నాటికి ప్రారంభించిన కేంద్రాలు 72 మాత్రమే. అయితే,  తేమశాతం ఎక్కువగా ఉందని కొనుగోలు నిలుపుదల చేశారు.  ఇంకా 246  కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉంది.  అక్టోబర్ 28వ తేదీ నాటికి కొన్నది 1,624 టన్నులు మాత్రమే. 72 కేంద్రాలు ప్రారంభించినామని చెప్పుతున్నప్పటికీ.. వాస్తవంగా కొనుగోలు చేసింది 23 కేంద్రాలలో 784 మంది రైతుల నుంచి మాత్రమే కొనుగోలు జరిగింది.  అత్యధికంగా  నారాయణపేటలో 251 మంది, వికారాబాద్ లో 99,  ఆదిలాబాదులో 92,  ఖమ్మంలో 64,  సిద్దిపేటలో 62,  నాగర్ కర్నూలులో 61 మంది  రైతుల నుంచి కొనుగోలు చేసి వారికి రూ. 12.77 కోట్లు చెల్లించినట్లు సీసీఐ వెల్లడించింది.

తేమ పేరుతో దక్కని మద్దతు ధర

కొనుగోలు కేంద్రాలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర  క్వింటాలుకు  రూ.8,110లకు రైతులు పత్తిని అమ్ముకోవాలని ప్రభుత్వం తెలిపింది. అందుకు తేమశాతం 10-–12 వరకు మాత్రమే ఉండాలని తెలిపింది. కొనుగోలు కేంద్రాలలో  తేమశాతం ఎక్కువగా ఉందని నిరాకరించటంతో,  రైతులు తేమశాతం 20వరకు ఉండటంతో ప్రైవేటు వ్యాపారులకు వారి ఏజెంట్ల ద్వారా రూ 6,500లోపే అమ్ముకుంటున్నారు.

తెలంగాణలో గత కొన్ని వారాలుగా వర్షాలు, వాతావరణంలో  మార్పులు దృష్ట్యా పత్తిలో తేమశాతం 20 వరకు ఉంటుందని రైతులు వాపోతున్నారు.  కనీసం 20% వరకు అనుమతించి కొనుగోలు చేయాలని  సీసీఐని రాష్ట్ర ప్రభుత్వం కూడా విజ్ఞప్తి చేసింది. కానీ, తేమ 8-–12 శాతం ఉంటేనే కొనుగోలు చేస్తామని భారత పత్తి సంస్థ(సీసీఐ) అధికారులు కరాకండిగా చెబుతున్నారు. అదేవిధంగా అంతర్జాతీయంగా డిమాండ్ లేనందున మద్దతు ధరకు కొనలేమని ప్రైవేటు వ్యాపారులు చేతులెత్తేయడంతో రైతులు మార్కెటుకు తెచ్చిన పత్తిని వాపస్ తీసుకుపోలేక అతి తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది.  మద్దతు ధర దక్కకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో అక్టోబర్ 27న  నిర్వహించిన వేలంపాట ఏకపక్షంగా సాగింది.  క్వింటాల్ పత్తికి అతి తక్కువగా రూ. 6,550లు నిర్ణయించి కొనుగోలు చేశారు.  రైతాంగం తీవ్ర నిరసనలతో ధర్నాకు దిగి మార్కెట్​ను  స్తంభింపజేశారు. దీంతో  జిల్లా కలెక్టర్,  జిల్లా వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులు చర్చలు జరిపి చివరికి రూ. 6,950 లు చెల్లించేవిధంగా ఏర్పాట్లుచేశారు. అయితే,  ఒకవైపు భారీగా వర్షాలు కురిసిన  నేపథ్యంలో తేమ నిబంధనలు మెలికపెట్టడం దారుణమని రైతు ప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాతకు దెబ్బమీద దెబ్బ 

గత వారం రోజులుగా వర్షాలు రావడంతో చేతికి వచ్చిన పంట ఏరుకోలేని పరిస్థితుల్లో రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాల వలన పత్తి పంట పూర్తిగా నల్లబడిపోవడం, పత్తి చేలలో వర్షపునీరు చేరి చేను పూర్తిగా ఎర్రబడి చచ్చిపోవడం జరుగుతున్నది.  కొన్ని ప్రాంతాలలో  పత్తి తీసేందుకు లేబర్ రావటం లేదు.   ఒక క్వింటాలు  పత్తి ఏరేందుకు  రూ.4 వేలు ఖర్చు అవుతుందని,  ప్రస్తుతం క్వింటాలుకు  రూ. 6 వేలు కూడా రావటం లేదని, కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ లో అతివృష్టి, అకాల వర్షాలతో  రైతన్నల పరిస్థితి  ఆగమాగమైంది.  సాధారణం కంటే 34 శాతం అధిక వర్షపాతం  పత్తి రైతులకు  తీరని నష్టాన్ని మిగిల్చింది. అయితే,  జులై, ఆగస్టు, సెప్టెంబర్ లో  సాధారణ స్థాయికి మించి వర్షాలు కురవడంతో  చేలల్లో నీరు నిలిచి పత్తి మొక్కలు ఎదగలేదు. ఫలితంగా దిగుబడి ఎకరాకు 4-6 క్వింటాలు మాత్రమే వస్తుంది. ఇప్పుడు మొంథా తుఫాన్​ కారణంగా పత్తి దెబ్బతింటుండగా.. రైతులు ఏరుకోనే పరిస్థితి లేక చేలలోనే వదిలివేసే పరిస్థితి ఉంది. తుఫాన్ వర్షాలతో  పంట నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి.

- ఉజ్జిని రత్నాకర్ రావు,
సీపీఐ సీనియర్​ నేత