చావమంటరా.. అన్నల్లో చేరమంటరా?

చావమంటరా.. అన్నల్లో చేరమంటరా?

మమ్మల్ని ఫారెస్ట్ ఆఫీసర్లు వేధిస్తున్నరు
భూములు సాగు చేసుకోనివ్వడం లేదు
కలెక్టర్ ఎదుట మీనాజీపేటగ్రామస్తుల ఆవేదన

మహాముత్తారం, వెలుగు: ‘‘తాత ముత్తాతల కాలం నుంచి ఈ భూములనే దున్నుకుంటున్నం. ఇప్పుడేమో ఫారెస్ట్ ఆఫీసర్లు మమ్మల్ని అడ్డుకుంటున్నరు. భూముల్లోకి రానివ్వడంలేదు. సాగు చేసుకోనివ్వడం లేదు. బోర్లు వేసుకోనివ్వడం లేదు. మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నరు ” అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం నల్లగుంట మీనాజీపేట గ్రామస్తులు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి సర్పంచ్ ముత్యాల రాజు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీమ్, డీఎఫ్ఓ పురు షోత్తం హాజరయ్యారు.

ఈ సందర్భంగా పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెలమరెడ్డి అనిల్ రెడ్డి మాట్లాడుతూ… 246 సర్వే నంబర్ లో దాదాపు 2వేల ఎకరాల భూమి ఉందని, వా టిని 1200 మంది రైతులు ఎప్పటి నుంచో చేసుకుంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు రైతులు భూములు చేసుకోకుండా ఫారెస్ట్​ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని చెప్పారు.

ఇట్ల అయితే ‘‘చావమంటరా…అన్నల్లోకి పొమ్మంటరా?” అని గ్రామస్తులు, అనిల్ రెడ్డి నిలదీశారు. మిషన్ భగీరథలో భాగంగా రెండు ట్యాంకులు కట్టారని, కానీ తాగేందుకు నీళ్లే రావడంలేదని వాపోయారు. అంతకుముందు డీఎఫ్ఓ మాట్లాడుతూ.. సీఎం ఇచ్చిన ‘‘జంగల్ బచావో.. జంగల్
బడావో’’ నినాదంతో ముందుకెళ్తున్నామని, అడవుల రక్షణకు కృషి చేస్తున్నామని చెప్పారు. అనిల్ రెడ్డి కలగజేసుకొని రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ సీఎంను బదనాం చేస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ జోక్యం చేసుకొని ‘‘సీఎం గొప్ప వ్యక్తి. ఆయన పేరును అగౌరవపరచొద్దు. అనవసరంగా సభను పక్కదారి పట్టిస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుందామని సర్ది చెప్పారు. భూముల సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్స్ ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేయిస్తామని హామీ ఇచ్చారు.