మోడీ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగినయ్ : రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

మోడీ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగినయ్ : రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు

కార్మికుల హక్కులను మోడీ హరింపజేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాగర్ అన్నారు. నల్లగొండలో రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలు ముగింపు సమావేశంలో రైతు సంఘం అధ్యక్షుడు సాగర్, ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. రానున్న రోజుల్లో రైతులకోసం ఏ విధంగా పోరాటం చేయాలనే విషయం గురించి మహాసభలో తీర్మానాన్ని చేశామని స్పష్టం చేశారు. అఖిల భారత కిసాన్ 35వ మహాసభలు డిసెంబర్ లో కేరళలో జరుగుతాయని చెప్పారు. స్వామినాథన్ కమిషన్ ను అమలు పరిచి రైతులకు అన్ని రకాల సబ్సీడీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 4 నల్ల చట్టాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇప్పటికే ఉపాధి లేక దిన కూలీలు వేలమంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత రెండు మూడు సంవత్సరాల కాలంలో రైతుల ఆందోళనలు, ఆత్మహత్యలు పెరిగాయని రైతు సంఘం ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. దేశ వ్యాప్తంగా సంవత్సరానికి 15వందల మంది రైతులు, తెలంగాణాలో 7వందలమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతులు కష్టపడి పంటలు పండించినప్పటికీ సరైన గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములకు చెందిన రైతులకు పట్టాలు ఇస్తానని మాట తప్పిందన్నారు. రుణమాఫీ ఏకకాలంలో చెయ్యాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. లేదంటే రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు.