కూలీ అంతంత మాత్రమే!

కూలీ అంతంత మాత్రమే!

ఇంతకాలం గోదారమ్మ దయతో పంటలు పండించుకున్న రైతులు మూడు పూటలా కడుపు నింపుకున్నారు. భార్య,పిల్లలను పోషించుకున్నారు. సీజన్​లో కోతల పనులతో ఎంతో కొంత సంపాదించుకునే కూలీలు కూడా మంచిగానే బతికేవారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న తరుణంలో ఉగ్రరూపం దాల్చిన గోదావరి పంటలను మొత్తం తుడిచిపెట్టేసింది. దీంతో ఇబ్బందుల్లేని జీవితాలు గడుపుతున్న రైతులు, కూలీలు తల్లడిల్లుతున్నారు. అప్పు చేసి పెట్టిన పెట్టుబడులు పోయి, చేతిలో చిల్లి గవ్వలేక పట్టణాలకు వలస పోతున్నారు. కూలీలుగా మారి రోజుకు ఎంత దొరికితే అదే మహాభాగ్యమనుకుని కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. 

భద్రాచలం, వెలుగు :  గోదావరి వరదలు భద్రాచలం మన్యంలో ఉపాధిని దెబ్బతీశాయి. సుమారు 40 రోజుల పాటు వరద ప్రభావం ఉండడంతో వ్యవసాయ సీజన్​ అనేదే లేకుండా పోయింది. ఊళ్లో పనుల్లేక వ్యవసాయ కూలీలు వలసబాట పట్టారు.  సన్న, చిన్నకారు రైతులైతే భద్రాచలంలో భవన నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఎకరం, రెండెకరాల్లో వేసిన పత్తి, వరి పంటలు పూర్తిగా మునగడంతో తిరిగి వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేక, పెట్టుబడులు పుట్టక, కుటుంబాలు గడవడం కోసం కూలీలయ్యారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏడు మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది.  

కూలీ దొరికితేనే పూట గడిచేది 

పత్తి, వరి సాగు చేసే సీజన్​లో, కూలీలు పని చేసుకునే టైంలో పొలాల్లోకి వచ్చిన వరదతో రైతులు, రైతు కూలీలు ఆగమయ్యారు. సన్న, చిన్నకారు రైతులంతా అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. అంతా సవ్యంగా సాగితే నెల రోజుల్లో పత్తి చేతికొచ్చేది. ఇంతలోనే గోదావరి ఉగ్రరూపం దాల్చడం, పోలవరం బ్యాక్​ వాటర్​ కారణంగా ముంపు మరింత పెరిగి రోజుల తరబడి పొలాలు నీళ్లలోనే ఉండిపోయాయి. దీంతో ఉన్న ఊళ్లో ఉపాధి పనులు చేసుకుందామనుకుంటే పనుల కుదింపు, ఇతర కారణాలతో వీలు కాలేదు. ఈ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కూలీలు భద్రాచలానికి పనుల కోసం క్యూ కడుతున్నారు. ప్రతిరోజు ఉదయం చద్ది కట్టుకుని సూపర్​బజార్ ​సెంటర్​లో అడ్డాపైకి వస్తున్నారు. పనులు ఇచ్చే వారి కోసం ఎదురుచూస్తున్నారు. ఏ పని చేయడానికైనా సిద్ధమని వచ్చినవారిని బతిమిలాడుకుంటున్నారు. భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక తదితర గోదావరి పరివాహక మండలాల్లోని వేల మంది ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. విలీన ఆంధ్రాలోని ముంపు మండలాల నుంచి కూడా భారీ సంఖ్యలో అడ్డాపైకి కూలీ కోసం వస్తున్నారు. చాలామంది పనులు దొరక్క పూట గడిచేది ఎలాగో తెలియక ఇండ్లకు వెళ్లిపోతున్నారు.  

కూలీ అంతంత మాత్రమే!

కూలీ పనులకు వెళ్తున్నా వచ్చే డబ్బులు ఎటూ సరిపోవడం లేదు. పనులు చేయించుకునేవారిలో చాలామంది రోజుకు రూ.350 వరకు ఇస్తున్నారు. కొందరు ఈ డబ్బులు కూడా ఇవ్వట్లేదు.  పనులు దొరక్క రూ.100, రూ.200లకు కూడా చేయడానికి వెనుకాడడం లేదు. 

అప్పు తీర్చాలి..పిల్లలను చదివించాలి

3 ఎకరాల్లో పత్తి వేసిన. దీని కోసం అప్పు తెచ్చిన. వరదల్లో పంట మొత్తం మునిగింది. ఇప్పుడు అప్పు తీరే దారి కనిపిస్తలేదు. ఇద్దరు పిల్లల్ని కూడా చదివించాలి. ఉన్న ఊళ్లో వేరే పనిచేయలేక భద్రాచలంలో బిల్డింగ్​పనులు  చేస్తున్నా. 
- నర్రెబోయిన శ్రీనివాస్​,  రాయినపేట

కొడుకు ట్రాక్టర్ ​డ్రైవర్..​ నేను కూలి

2 ఎకరాల పత్తి వేస్తే వరదతో కుళ్లిపోయింది. నా కొడుకును ట్రాక్టర్​ డ్రైవర్​గా పెట్టిన. నేను భద్రాచలం వచ్చి కూలీ పని చేస్తున్న. ఈ పనులు కూడా దొరకట్లే. ఏదో తిప్పలు పడి దొరకపుచ్చు కుంటున్నా. ఇల్లు గడవాలంటే ఏదో ఒకటి చేయాలిగా!    
- దుద్దుకూరి మాధవరావు 

పెండ్లాం, పిల్లలతో ఊరొదిలి..

3 ఎకరాల్లో వ్యవసాయం చేసేటోడ్ని. వరదల వల్ల మొత్తం పోయింది. అప్పులే మిగిలినయి. పొట్ట చేత పట్టుకుని పెండ్లాం, పిల్లలతో భద్రాచలం వచ్చిన. అడ్డా మీద పని ఏమైనా దొరికితే ఇల్లు గడుస్తుంది.  లేకుంటే పస్తులే. ఇద్దరం కలిసి కూలీ చేస్తేనే ఇంటి అద్దె, ఖర్చులు వెళ్తున్నాయి.  
- మంచర్ల సత్యనారాయణ, రామచంద్రాపురం 

తాపీ మేస్త్రీగా మారిన

ఎవుసం కలిసి రానప్పుడు ఏం చేస్తం. అప్పో సప్పో చేసి పంటలు వేసి బతికిన. అన్నీ వరద పాలై రోడ్డున పడ్డా. కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఏదో ఒక పనిచేయాలని, భద్రాచలం వచ్చి తాపీ మేస్త్రీనైనా. అడ్డామీదకు వస్తే ఏదో ఒక పని దొరుకుతుంది. కానీ ఎక్కువ పనులు రావట్లే. 2 రోజులకోసారి మాత్రమే దొరుకుతున్నాయి.  - కోట రామారావు, తోటపల్లి