న్యూఢిల్లీ: ఇండిపెండెంట్స్ డే వేడుకల సందర్భంగా ప్రధాని మోడీ వ్యవసాయ విధానాలపై తన స్పీచ్‌లో ప్రాముఖ్యతను ఇచ్చారు. ఆత్మనిర్భర్ క్యాంపెయిన్‌లో భాగంగా నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్రికల్చరల్ రీఫార్మ్స్‌ను మోడీ హైలైట్ చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కీలక కార్యక్రమాలను చేపట్టామన్నారు. దీని ఫలితంగా రైతుల ఆదాయం, ఎగుమతులు పెరిగాయన్నారు.
‘ఎవరికైనా వ్యవసాయంతోపాటు వస్తువులు ఎగుమతి చేసే విషయంలో మనం స్వావలంబన సాధించాం. ఇది ఆత్మ నిర్భర్‌కు ఉదాహరణ. అగ్రికల్చర్ సెక్టార్ కోసం మేం పలు చట్టాలను తీసుకొచ్చాం. ఆత్మనిర్భర్‌ను సాధించాలంటే ఇండియాకు లక్షలాది సవాళ్లున్నాయి. అవును, ఇతర ప్రపంచం నుంచి భీకరమైన పోటీ కూడా ఉంది. కానీ నేనెప్పుడూ చెప్పేదొక్కటే.. ఒకవేళ భారత్ లక్షలాది చాలెంజ్‌లను ఎదుర్కొన్నా మన దేశానికి 130 కోట్ల పరిష్కారాలు ఉన్నాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి మేం కృషి చేస్తున్నాం. మీలో కొందరికి ఇది తెలియవు. కానీ మిగతా వ్యాపారులలానే తమ ఉత్పత్తులను దేశం, ప్రపంచంలో ఎక్కడైనా ఎంత ధరకైనా అమ్ముకునే స్వేచ్ఛను రైతులకు కల్పించాం. ఇప్పటివరకు వారికి ఆ స్వేచ్ఛ లేదు. ఫలానా వాళ్లకు అమ్మమని చెబితేనే వారు విక్రయించేవారు. మేం ఇప్పుడు ఈ ఆంక్షలను ఎత్తేశాం. దీంతో రైతులు అత్యుత్తమ ధరలకు, ఎక్కడైనా, తమకు నచ్చిన వారికి ఉత్పత్తులను అమ్ముకోవచ్చు’ అని మోడీ వివరించారు.
