ఢిల్లీలో నిరసనలకు రైతుల పక్కా ప్లాన్

V6 Velugu Posted on Mar 14, 2021

  •  ఢిల్లీ బార్డర్‌‌‌‌లో రోడ్లపై రైతుల ఇండ్లు
  • రాబోయే వేసవిని తట్టుకునేందుకు పక్కాగా నిర్మాణం

న్యూఢిల్లీ/కురుక్షేత్ర: అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్ పై పట్టు వీడని రైతులు.. ఎక్కువ కాలం ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టిక్రి బార్డర్ లో ఏకంగా పక్కా ఇండ్లను కట్టుకున్నారు. గత ఏడాది నవంబర్ 26 నుంచి రైతుల ఆందోళన మొదలైంది. గడ్డ కట్టే చలిని సైతం రైతులు లెక్క చేయలేదు. ఆందోళన శిబిరాలకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్ కట్ చేసినా.. కరెంట్ బంజేసినా.. ఇతర ఆంక్షలు విధించినా.. వెనక్కి తగ్గలేదు. మొదట్లో ట్రాక్టర్లనే షెల్టర్లుగా వాడుకున్న రైతులు.. పంటలు కోతకు వచ్చిన సమయంలో వాటిని గ్రామాలకు వెనక్కి పంపారు. టెంట్లు, టెంపరరీ షెల్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్ ను పట్టించుకోకపోవడంతో ఆందోళనను మరింత తీవ్రం చేశారు. ఎక్కువ కాలం నిరసనను కొనసాగించేందుకు నిర్ణయించుకున్న రైతులు, తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాబోయే వేసవికి టెంట్లు, టెంపరరీ షెల్టర్లలో ఏసీలు, కూలర్లు రెడీ చేసుకోగా.. ఇప్పుడు పక్కా ఇండ్లను కట్టుకుంటున్నారు. కిసాన్ సోషల్ ఆర్మీ చొరవతో టిక్రి బార్డర్ లోని బహదూర్ గఢ్ హైవేపై 25 ఇండ్లను నిర్మించుకున్నారు. 'రైతుల పట్టుదలలాగే ఈ ఇండ్లు కూడా చాలా స్ట్రాంగ్. ఒక్కో ఇంటికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు అవుతోంది. ప్రస్తుతం 25 ఇండ్లు కట్టాం. రాబోయే రోజుల్లో మరో వెయ్యి నుంచి 2 వేల ఇండ్లు కడుతం' అని కిసాన్ సోషల్ ఆర్మీకి చెందిన అనిల్ మాలిక్ చెప్పారు. రైతులు మెటీరియల్ కు మాత్రమే డబ్బులు ఇస్తున్నారని, ఫ్రీగా లేబర్ సేవలు అందిస్తున్నామని తెలిపారు.

హర్యానాలో అధికార పార్టీ జేజేపీకి నిరసన సెగ

హర్యానాలో అధికార పార్టీ జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి రైతుల నిరసన సెగ తగిలింది. శనివారం కురుక్షేత్రలోని సర్క్యూట్ హౌస్ లో జేజేపీ చీఫ్ అజయ్ సింగ్ చౌతాలా బర్త్ డే సందర్భంగా పారిశుధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని రైతులు ప్రకటించారు. సర్క్యూట్ హౌస్ ఆవరణలో భారీగా మోహరించిన పోలీసులు రైతులు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ బ్యానర్ తో రైతులు ఆందోళనకు దిగారు. హర్యానా సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనందుకు జేజేపీ ఎమ్మెల్యే రామ్ కరణ్ కాలాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ఆందోళనకు మద్దతిస్తామని చెప్పిన రామ్ కరణ్ కాలా మాట తప్పారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు జేజేపీ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. ఇటీవల అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న బీజేపీ, జేజేపీ కూటమి సర్కారు 55-–32 తేడాతో గట్టెక్కింది.

Tagged Delhi, houses, protests, borders, Continue, planning, constructing, temporary

Latest Videos

Subscribe Now

More News