ధరణితో అన్నదాతల అవస్థలు..

ధరణితో అన్నదాతల అవస్థలు..

కరీంనగర్, వెలుగు: రైతులు ఎదుర్కొంటున్న వివిధ భూసమస్యలపై అప్లికేషన్లు పెట్టుకునేందుకు ధరణి పోర్టల్​లో కొత్త మాడ్యుల్స్, ఆప్షన్లు తీసుకురావడమే తప్పా..సమస్యలకు పరిష్కారం చూపడం లేదు. ధరణి పోర్టల్​లో దరఖాస్తు చేసుకున్న బాధితులు నెలల తరబడి తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. మండల స్థాయిలో ఆర్ఐ నుంచి మొదలుకుంటే సీసీఎల్ఏ వరకు ఇదే తీరు. దీంతో సమస్య పరిష్కారమయ్యే మార్గం దొరకక ఆవేదనతో తహసీల్దార్​, కలెక్టర్​ ఆఫీసుల వద్ద ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల కింద కరీంనగర్ జిల్లా కొత్తపల్లి తహసీల్దార్ ఆఫీసులో ఐలోనిపల్లికి చెందిన రైతు ఏనుగుల మల్లేశం సూసైడ్​ చేసుకున్న ఘటన.. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో రెవెన్యూ ఆఫీసర్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రెవెన్యూ శాఖలో ఇన్నాళ్లు  పూర్తి స్థాయి సీసీఎల్ఏ లేక ధరణి పోర్టల్ లో సమస్యలు పరిష్కారం కావడం లేదనే ఆరోపణలున్నాయి. పూర్తి స్థాయి సీసీఎల్ ఏగా ఐఏఎస్ ఆఫీసర్ నవీన్ మిట్టల్ బాధ్యతలు స్వీకరించాక కూడా ఫీల్డ్​ లెవెల్​లో రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలపై దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 

12 లక్షలు దాటిన అప్లికేషన్లు... 

ధరణి పోర్టల్​ ప్రారంభించి రెండున్నరేండ్లయినా భూసమస్యలు పెరిగాయే తప్పా తగ్గలేదు. తీరొక్క సమస్యలతో వేలాది మంది రైతులు కలెక్టరేట్, సీసీఎల్ఏ ఆఫీసుల మెట్లెక్కుతుండగా,  ధరణి పోర్టల్ లో పరిష్కరించే మెకానిజం లేక ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు. కొన్ని పరిష్కరించే అవకాశమున్నా కొందరు కలెక్టర్లు, తహసీల్దార్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ధరణి పోర్టల్ లో 33 మాడ్యుల్స్ లో వివిధ రకాల గ్రీవెన్స్ కు సంబంధించినవే ఐదు ఉన్నాయి. గ్రీవెన్స్ రిలేటెడ్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్, గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇన్ క్లూజన్ ఇన్  ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టు, గ్రీవెన్స్ రిలేటెడ్ టు ల్యాండ్ అక్వయిర్డ్, గ్రీవెన్స్ రిలేటింగ్ టు టెక్నికల్ ఇష్యూస్, మాడిఫికేషన్ రిక్వెస్ట్​(పాస్ బుక్ డేటా కరెక్షన్ ‌‌- టీఎం 33 మాడ్యుల్)లాంటి మాడ్యుల్స్ ఉన్నాయి. ఈ మాడ్యుళ్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 12 లక్షల అప్లికేషన్లు రాగా, ఇందులో 4.50 లక్షల వరకు రిజెక్ట్  అయ్యాయి. మరో 2 లక్షలు పెండింగ్ లో ఉన్నాయని అంచనా. 

టీఎం 33లో దరఖాస్తులతోనే రూ.23 కోట్ల ఇన్ కం 

ధరణిలో వచ్చే దరఖాస్తుల్లో ప్రధానంగా పాస్ బుక్ డేటా కరెక్షన్ కు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. టీఎం 33 మాడ్యుల్ లో పాస్ బుక్ లో పేరు తప్పుగా పడితే మార్చుకోవడం, నేచర్ ఆఫ్ ల్యాండ్, క్లాస్లిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ లో ఏమైనా మార్పులు, భూమి రకంలో మార్పులు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు ఉంటే సవరించడం, ఏవైనా సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్ మిస్సయితే చేర్చడం, నోషనల్ ఖాతా నుంచి పట్టా భూమిగా మార్చడం, భూమి అనుభవం(ఎంజాయ్​మెంట్)లో మార్పుల వంటి వాటికి ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఏడాది క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ మాడ్యుల్ ద్వారా 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ ఆఖరు వరకు 1.70 లక్షల అప్లికేషన్లు రాగా, మూడున్నర నెలల్లోనే 64 వేల వరకు వచ్చాయి. మొత్తంగా 2.34 లక్షలకుపైగా దరఖాస్తులు రాగా, ఒక్కో అప్లికేషన్ కు రూ.1000 ఫీజు చొప్పున రూ.23 కోట్లకుపైగా ఆదాయం వచ్చిందని అంచనా. వీటిని జిల్లాస్థాయిలో కలెక్టర్లు పరిశీలించి ఫైల్స్ సీసీఎల్ఏ ఆఫీసుకు పంపిస్తున్నారు. కాగా, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలకు సంబంధించిన అప్లికేషన్ల పరిశీలనను సీసీఎల్ఏ ఆఫీసు నిలిపివేసినట్టు తెలిసింది. తమ అప్లికేషన్ ఏమైందో తెలుసుకునేందుకు రోజూ సీసీఎల్ ఏ ఆఫీసుకు వందల్లో బాధితులు వెళ్తున్నారు. 

లీడర్లు చెప్తేనే పనులు.. 

ధరణి పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రొహిబిటెడ్ జాబితా నుంచి సర్వే నంబర్లను తొలగించడం దగ్గరి నుంచి టీఎం 33లో పాస్ బుక్ డేటా కరెక్షన్ వరకు రైతులు నేరుగా వెళితే పనులు కావడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార పార్టీ లీడర్ల సిఫార్సు ఉంటేనే సీసీఎల్ఏ అధికారులు, కలెక్టర్లు పట్టించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ధరణిలో తప్పుల సవరణ, ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి సర్వే నంబర్లు తొలగించడం, విలువైన భూములకు సంబంధించిన చిక్కులను తొలగించేందుకు కొందరు తహసీల్దార్లు, లీడర్లు దళారుల అవతారమెత్తుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల సీసీఎల్ఏ ఆఫీసుకు భూసమస్యపై వచ్చిన వ్యక్తిని ఓ ఆఫీసర్ దుర్భాషలాడడం కలకలం రేపింది. పట్టాదారుకు బదులు వారి కుటుంబ సభ్యులు సీసీఎల్ఏ కు వస్తే అనుమతించడం లేదు. సమస్యలు చెప్పుకుందామని వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన రైతుల దగ్గర అప్లికేషన్లు తీసుకుని పంపిస్తున్నారు కానీ, పరిష్కారం చూపడం లేదు.


సీసీఎల్ ఏలో పెండింగ్ లో వేలాది అప్లికేషన్లు.. 

ధరణి పోర్టల్ టీఎం 33 పాస్ బుక్ మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్లు పెట్టుకున్న సుమారు లక్ష మంది.. డేటా కరెక్షన్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. కొన్ని అప్లికేషన్లను అప్రూవ్ చేసినా రికార్డుల్లో మార్పులు కనిపించట్లేదు. కలెక్టర్లు అప్రూవ్ చేస్తే సరిపోదని, సీసీఎల్ఏ స్థాయిలో ఏర్పాటు చేయబోయే కమిటీ పరిశీలించాకే డేటా అప్ డేట్ అవుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఈ కమిటీతో సంబంధం లేకుండానే ప్రభుత్వ పెద్దలకు, వారి బంధువులకు చెందిన అప్లికేషన్లు ధరణిలో జెట్ స్పీడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో క్లియర్ అవుతున్నాయి. వీటిలో కొన్నింటిని కలెక్టర్లు అప్రూవ్ చేసినా..ధరణిలో రికార్డు అప్ డేట్ కావడం లేదు. లక్షలాది అప్లికేషన్లను కలెక్టర్లు పరిశీలించకుండానే రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణాలూ చెప్పడం లేదు.

రెవెన్యూ సదస్సుల జాడలేదు.. 

భూసమస్యల పరిష్కారం కోసం సీఎం సొంత నియోజకవర్గంలోని ములుగులో గత జూన్ లో పైలట్ ప్రోగ్రామ్ చేపట్టారు. ఒక్క ములుగులోనే 272 అప్లికేషన్లు రాగా.. కలెక్టర్ స్థాయిలోనూ పరిష్కరించలేని దరఖాస్తులు 132 ఉన్నాయి. భూసమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని జూలై 5న సీఎం ప్రకటించారు. జూలై 15 నుంచి 100 బృందాలతో జరగాల్సిన సదస్సులను వర్షాల సాకుతో వాయిదా వేశారు. తర్వాత 10 నెలలు గడిచినా ఇప్పటి వరకు రివైజ్డ్ షెడ్యూల్ రిలీజ్ చేయలేదు. అనంతరం రెవెన్యూ సదస్సులను నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ సదస్సుల జాడ కూడా లేదు. 
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ రెవెన్యూ పరిధిలోని ఐలోనిపల్లికి చెందిన ఏనుగుల మల్లేశం(55)కు గ్రామంలో ఐదెకరాలుంది. ఇందులో కొంతభూమికి 2021లో పాస్ బుక్ వచ్చింది. సర్వేనంబర్ 273/ఏ/బీలోని 5 గుంటల భూమి స్వభావం(నేచర్ ఆఫ్ ల్యాండ్) పట్టాకు బదులు నీరటి ఇనాంగా ధరణి పోర్టల్ లో నమోదైంది. పాస్ బుక్ లోనూ అలాగే వచ్చింది. నీరటి ఇనాం భూమిని పట్టాగా మార్చాలని ఆయన టీఎం 33 మాడ్యుల్ ద్వారా ధరణి పోర్టల్ లో అప్లైచేసుకున్నారు. ఇతడి ఇంటి పక్కన సర్వే నంబర్ 298లో ఉన్న 20 గుంటల వ్యవసాయ భూమి హౌస్ సైట్స్ గా నమోదైంది.ఈ రెండు సమస్యలపై కొన్నాళ్లుగా మల్లేశం తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఎంతకీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ నెల 13న కొత్తపల్లి తహసీల్దార్ ఆఫీసు ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జరిగిన తర్వాత మేల్కొన్న రెవెన్యూ ఆఫీసర్లు పాస్ బుక్ డేటా కరెక్షన్ కోసం కలెక్టర్ కు పంపారు. అయినా.. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. 

ధరణి అప్లికేషన్ల పరిష్కారంలో సర్కార్​కు చిత్తశుద్ధి లేదు.. 

ధరణి అప్లికేషన్ల పరిష్కారంలో ప్రభుత్వానికి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ కు చిత్తశుద్ధి లేదు. జిల్లాల్లో అప్రూవల్ అయిన వేలాది ఫైళ్లు సీసీఎల్ఏ ఆఫీసుకు వచ్చిన తర్వాత నలుగురైదుగురు ఆఫీసర్లు మాత్రమే చూసి క్లియర్ చేస్తున్నారు. సీసీఎల్ ఏకు వెళ్లినవాళ్ల ఫైళ్లే చూస్తున్నారు. రానోళ్ల అప్లికేషన్లను పట్టించుకోవడంలేదు. ఏదైనా సమస్యపై పట్టాదారే రావాలనడం కరెక్ట్ కాదు. వృద్ధాప్యంతో, అనారోగ్యంతో, విదేశాల్లో ఉన్న పట్టాదారులు రాలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు కలిసే అవకాశమివ్వాలి. 
- మన్నె నర్సింహారెడ్డి, కన్వీనర్, ధరణి సమస్యల వేదిక