మిల్లర్ల దోపిడీకి నిరసనగా రైతుల బంద్

మిల్లర్ల దోపిడీకి నిరసనగా రైతుల బంద్
  • జగిత్యాలలో స్వచ్ఛందంగా షాపులు మూసేసిన వ్యాపారులు 
  • మిల్లర్ల దోపిడీకి నిరసనగా చేపట్టిన రైతులు
  • స్వచ్ఛందంగా షాపులు మూసేసిన వ్యాపారులు

వడ్ల కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీకి నిరసనగా రైతు సంఘాల జేఏసీ సోమవారం జగిత్యాల జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. బంద్​లో భాగంగా జగిత్యాల టౌన్​తో పాటు జిల్లావ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసేశారు. మిల్లర్ల దోపిడీని అరికట్టాలంటూ పది రోజులుగా నిరసనలు తెలుపుతున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు జిల్లా బంద్  నిర్వహించారు.  - 

జగిత్యాల, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీకి నిరసనగా రైతు సంఘాల జేఏసీ సోమవారం జగిత్యాల జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. బంద్​లో భాగంగా జగిత్యాల టౌన్​తో పాటు జిల్లా వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసేశారు. వడ్ల కొనుగోళ్లలో మిల్లర్ల దోపిడీ అరికట్టాలంటూ పది రోజులుగా రైతులు జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నా..  ప్రభుత్వం స్పందించడం లేదని సోమవారం జిల్లా బంద్  చేపట్టారు. ఉదయాన్నే రైతులు ర్యాలీ గా తిరుగుతూ బంద్​కు సహకరించాలని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. రైతు నాయకులు తిరుపతిరెడ్డి, మల్లన్న, కరుణాకర్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించి 40 రోజులవుతున్నా ఇంకా కొనుగోళ్లు సగం కూడా పూర్తికాలేదని అన్నారు. అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై తప్ప, తాలు పేరుతో రైతులను దోచుకుంటున్నారని, కటింగులకు ఒప్పుకోకపోవడంతో కావాలనే కొనుగోళ్లు లేట్​ చేస్తున్నారని తెలిపారు. మరో వారం రోజుల్లో రోహిణి కార్తె వస్తుందని, వర్షాలు పడ్తే వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయని, ఈలోపే కొనుగోళ్లు పూర్తయ్యేలా చూడాలని కోరారు. మిల్లర్లు ఎలాంటి కోతలు పెట్టకుండా మద్దతు ధరకు వడ్లను  దింపుకునేలా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్​ చేశారు.