ఎంపీలు, ఎమ్మెల్యేలే మా వడ్లను తగలబెట్టండి

ఎంపీలు, ఎమ్మెల్యేలే మా వడ్లను తగలబెట్టండి
  • వడ్లు మొలకొస్తున్నయ్ ఇంకెప్పుడు కొంటరు?
  • అధికారులను నిలదీసిన రైతులు
  • ఎంపీలు, ఎమ్మెల్యేలే వడ్లను తగలబెట్టండి
  • లేదంటే పురుగుల మందు తాగి చస్తం: రైతులు
  • కాంటాలు, లారీలు ఏర్పాటు చేస్తం: అడిషనల్ కలెక్టర్ హామీ
  • పోచంపల్లిలో మిల్లు ముందు వానలో ధర్నా

యాదాద్రి/ చందుర్తి/ తంగళ్లపల్లి/ఉప్పునుంతల  వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్లను ప్రభుత్వం వెంటనే కొనాలంటూ రాష్ట్రమంతటా రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ‘‘వడ్లు తెచ్చి నెలైతున్నా కొంటలేరు. అవేమో తడిచి మొలకలొస్తున్నయి” అంటూ యాదాద్రి కలెక్టరేట్ ముందు రైతులు కన్నీరుమున్నీరయ్యారు. తడిసిన వడ్లు రంగుమారి మొలకలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తడిసిన వడ్లను కూడా సర్కారే కొనాలని డిమాండ్​చేశారు. ‘‘కొనకుంటే వడ్లన్నీ తెచ్చి కుప్పలు పోస్తం. మేం గెలిపించిన ఎంపీలు, ఎమ్మెల్యేలే వచ్చి వాటిని తగలబెట్టుకోండి” అంటూ ఆవేదన చెందారు. తాము కూడా ఉరేసుకొని చచ్చిపోతామంటూ గోసపడ్డారు. ఆకుతోట బావితండా, సూరేపల్లి రైతులు శనివారం యాదాద్రి కలెక్టరేట్​ముందు రెండు గంటలకు పైగా ఆందోళనకు దిగారు. కాంటా వేసి రాయగిరి మిల్లుకు పంపినా దించుకోవడం లేదన్నారు. కలెక్టరేట్​లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో రైతులంతా అక్కడే బైఠాయించారు. వడ్లు కొంటామని కలెక్టర్​హామీ ఇచ్చేదాకా కదిలేది లేదన్నారు. అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాసరెడ్డి రైతు ప్రతినిధులను చాంబర్​కు పిలిచి మాట్లాడారు. ‘‘వడ్లు కొనకుంటే పురుగుల మందు తాగి సచ్చిపోతం” అని ఆయనకు రైతులు స్పష్టం చేశారు. కాంటాలు వేయిస్తానని, లారీ పంపిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

భూదాన్ పోచంపల్లిలో వానలోనే...

భూదాన్​పోచంపల్లి మండలం పిల్లాయిపల్లిలో రైస్​మిల్లు వద్ద కూడా రైతులు ఆందోళనకు దిగారు. వచ్చిన వడ్లను అన్​లోడ్​ చేసుకోకుండా కొర్రీలు పెడుతున్నారంటూ బాలాజీ రైస్​మిల్ ​ముందు ఆందోళన రెండో రోజు కూడా కొనసాగింది. జోరు వానలోనే రైతులు ధర్నా చేశారు. మూసీ పరివాహక ప్రాంతం కనుక తమ వడ్లలో నూకలు ఎక్కువవొస్తాయనే సాకుతో నెల నుండి అన్​లోడ్​చేసుకోవడం లేదని ఆరోపించారు. వడ్లు కొనకుంటే సోమవారం కలెక్టరేట్​ను ముట్టడిస్తామని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్​రెడ్డి హెచ్చరించారు.

సొసైటీ సిబ్బంది నిర్బంధం

వరి కోసి నెలలైతున్నా కొంటలేరని రాజన్న సిరిసిల్ల జిల్లా సనుగులలో రైతులు శనివారం ఆందోళనకు దిగారు. సింగిల్ విండో సొసైటీ సిబ్బందిని నిర్బంధించారు. ‘‘అకాల వర్షాలకు వడ్లు తడిసి ముద్దైతున్నా కొంటలేరు. కొనుగోలు కేంద్రాల్లోనే మొలకలొస్తున్నయని చెప్పినా పట్టించుకుంటలేరు” అని మండిపడ్డారు. సిబ్బందిని గంటసేపు నిర్బంధించారు. స్పష్టమైన హామీ వచ్చేదాకా వదిలేది లేదన్నారు. తడిసిన ధాన్యం కూడా కొనాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆఫీసర్లు తెలపడంతో ధర్నా విరమించారు.

రైతు ఆత్మహత్యాయత్నం

వారం రోజులుగా వడ్లు కొనే దిక్కు లేకపోవడం, వానకు తడిసి మొలకలు రావడంతో దుఃఖం పట్టలేక శనివారం ఓ పేద రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నాగర్‌‌‌‌ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం జప్తి సదగోడుకు చెందిన రైతు కాళ్ల లాలయ్య తన మూడెకరాలతో పాటు మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న, వరి సాగు చేశాడు. వడ్లు అమ్ముదామంటే కొనే దిక్కు లేకపోయింది. వారం రోజులుగా పడుతున్న వానలకు వడ్లు తడిసి మొలకలొచ్చాయి. దాంతో మనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కొడుకులు  మందు డబ్బా లాక్కున్నారు. కల్లాల్లో కప్పిన ధాన్యం మొలకెత్తుతున్నదని నాగర్‌‌‌‌ కర్నూల్ జిల్లా రైతులు వాపోతున్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అప్పులు తీరే దారి లేక చావే గతవుతుందని వాపోతున్నారు. 

సిరిసిల్ల రైతుల కన్నెర్ర.. వడ్లు తగలబెట్టి నిరసన

కొనుగోలు సెంటర్లలోని వడ్లు కొంటలేరంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో రైతులు రోడ్డెక్కారు. హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. వడ్లను రోడ్డుపై పోసి నిప్పటించారు. రాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘‘నెలలు గడుస్తున్న కొనుగోలు సెంటర్లో పోసిన ధాన్యాన్ని కొంటలేరు. లారీల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నరు” అని మండిపడ్డారు. ‘‘మమ్ముల ఇట్నే ఇబ్బంది పెడితే ఎన్నికల్లో సత్తా చూపిస్తం. ఏడేండ్ల టీఆర్ఎస్​ పాలనలో ఎవలకూ బాగ్గాలే. వడ్లు కొనకపోతే కేసీఆర్​రాజీనామా చేయాలె” అని డిమాండ్​ చేశారు. బీజేపీ లీడర్లు వారికి సంఘీభావం ప్రకటించారు. కేసీఆర్ సర్కారుకు వైన్స్​ మీదున్న ఇంట్రెస్టు రైతుల మీద లేదని విమర్శించారు. రైతులు అరిగోస పడుతుంటే స్థానిక మంత్రి కేటీఆర్ అస్సలు పట్టించుకుంటలేరని దుయ్యబట్టారు. పోలీసులు అగ్రి ఆఫీసర్లతో మాట్లాడి రైతుల ధర్నాను విరమింపజేశారు.