గ్రీన్​ఫీల్డ్​ హైవేకు భూములివ్వం.. ఒత్తిడి చేస్తే ఆత్మహత్యలే..

గ్రీన్​ఫీల్డ్​ హైవేకు భూములివ్వం.. ఒత్తిడి చేస్తే ఆత్మహత్యలే..

పరకాల, వెలుగు :  గ్రీన్​ఫీల్డ్​ హైవేకు భూములిచ్చేది లేదని, ఒకవేళ ఒత్తిడి చేస్తే చస్తామంటూ భూనిర్వాసిత రైతులు హనుమకొండ జిల్లా పరకాల ఆర్డీవో ఆఫీసు ఎదుట బధవారం ఆందోళన చేశారు. తమ భూములను హైవేకు ఇచ్చేది లేదని చెబుతున్నా అధికారులు వినిపించుకోకపోవడాన్ని నిరసిస్తూ పురుగులమందు డబ్బాలతో గేటు ముందు నిరసన తెలిపారు. అధికారులను ఆఫీసు నుంచి బయటకు వెళ్లకుండా గేటు ముందు అడ్డంగా పడుకున్నారు. తమను బుధవారం ఆర్డీవో ఆఫీసుకు రావాలని పేపర్లలో ప్రకటన ఇచ్చారని, కానీ, నేరుగా సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. నేషనల్​ హైవేస్​ అధికారులు, ఆర్డీవోకు భూములు ఇవ్వం అని చెప్పినా వినడం లేదన్నారు.

తమకు పరిహారం అవసరం లేదని, భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. తమను భూములివ్వాలని ఒత్తిడి చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. హైకోర్టులో కేసు నడుస్తుండగా అధికారులు భూములను లాక్కోవాలని చూడడం సరికాదన్నారు. దీంతో ఆర్డీవో శ్రీనివాస్​ రైతులతో మాట్లాడారు. రైతులు చెప్పిన విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.