వడ్ల పైసలు ఇంకా రాలె!

వడ్ల పైసలు ఇంకా రాలె!

 45 రోజులు దాటిన అందని డబ్బులు
 ఆందోళనకు దిగిన రైతులు

మహబూబాబాద్, వెలుగు: ఖరీఫ్ వడ్ల పైసలు ఇంకా రైతుల అకౌంట్లో పడలేదు. 24గంటల్లో చెల్లిస్తామన్న ప్రభుత్వం.. 45 రోజులు దాటినా చెల్లించడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో రూ.28.91కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో రబీలో పంట పెట్టుబడికి అన్నదాతలు అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆందోళనకు దిగిన రైతులు..

ధాన్యం డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లాలోని నరసింహులపేట మండల రైతులు ఆందోళనకు దిగారు. మండలంలోని 13 లారీల ధాన్యాన్ని సూర్యాపేట జిల్లాకు తరలించగా.. అందులో 10 లారీల డబ్బులు ఇంకా జమ కాలేదు. 40మంది రైతులకు రూ.80లక్షలకు పైగా రావాల్సి ఉంది. దీంతో తహసీల్దార్ ఆఫీసు ఎదుట నిరసన తెలిపి, ఆఫీసర్లకు వినతిపత్రం ఇచ్చారు. తొర్రూరు పీఏసీఎస్​పరిధిలోనూ 4వేల క్వింటాళ్ల ధాన్యం రైతులకు జమ కావాల్సి ఉంది. దీనిపై సివిల్ సప్లై డీఎం కృష్ణవేణిని వివరణ కోరగా.. టార్గెట్ కు మించి ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. అడిషనల్ ఆర్వోల కోసం సివిల్ సప్లై రాష్ట్ర కమిషనర్ నుంచి అనుమతి రావాల్సి ఉన్నందున చెల్లింపుల్లో జాప్యం జరిగిందన్నారు. క్లియరెన్స్ రాగానే రైతులకు డబ్బులు చెల్లిస్తామన్నారు.