కక్ష కట్టి వడ్లు కొంటలేరు.. పాశిగామలో రైతుల రాస్తారోకో

కక్ష కట్టి వడ్లు కొంటలేరు.. పాశిగామలో రైతుల రాస్తారోకో

వెల్గటూర్, వెలుగు : ఇథనాల్ ప్రాజెక్టు రద్దు కోసం ఆందోళనలు చేస్తున్నందుకే కక్ష కట్టి తమ ధాన్యం కొనడం లేదని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ రైతులు మంగళవారం గ్రామ స్టేజీ దగ్గర రోడ్డుపై బైఠాయించారు. వడ్ల బస్తాలు, మొలకెత్తిన ధాన్యం పోసి సుమారు గంట పాటు రాస్తారోకో చేశారు. దీంతో కరీంనగర్– రాయపట్నం రాష్ట్ర రహదారి పై ట్రాఫిక్ జామయ్యింది. పాశిగామ కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి రెండు నెలలు గడుస్తున్నా కొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటికే వర్షాలు వచ్చి ధాన్యం తడిసిపోయిందని, మంగళవారం కూడా ఇలాగే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితమే ధర్మపురి మండలం తిమ్మాపూర్ సొసైటీ ముందు నిరసన తెలిపినా పట్టించుకోవడం లేదని, అందుకే ఇలా రాస్తారోకో చేయాల్సి వచ్చిందన్నారు. ఇథనాల్​ప్రాజెక్టు రద్దు కోసం ఆందోళనలు చేస్తే కక్షతో ధాన్యం కొనరా అంటూ తహసీల్దార్​రమేశ్​తో  వాగ్వాదానికి దిగారు. ఆయనను ఐకేపీ సెంటర్​లోకి తీసుకువెళ్లి మొలకెత్తిన ధాన్యాన్ని చూపించారు. వెంటనే కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని  హామీ ఇవ్వడంతో ఆందోళన  విరమించారు.