తొగుట, వెలుగు : తరుగు పేరుతో మిల్లర్లు ధాన్యంలో కోత విధించడమే కాకుండా, అన్‌లోడింగ్ చేసుకోవడం లేదంటూ రైతులు ధర్నాకు దిగారు. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేటలో మెదక్ – సిద్దిపైట హైవేపై బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... పోతారెడ్డిపేటలోని కొనుగోలు కేంద్రాల్లో సుమారు 16 లారీల వడ్లు ఉన్నాయన్నారు.
తరుగు తీసేందుకు ఒప్పుకుంటేనే వడ్లను అన్‌లోడింగ్ చేసుకుంటామని రైస్ మిల్లర్లు చెబుతున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లు నిలుపు దోపిడీ చేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు. ఎలాంటి షరతులు లేకుండా వడ్లు కొనాలని, ఇబ్బంది పెడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విషయం తెలుసుకున్న భూంపల్లి ఎస్సై హరీశ్‌గౌడ్ ఘటనాస్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. రాస్తారోకోలో సర్పంచ్ గువ్వల మానిక యేసురాజు, ఉపసర్పంచ్ ప్రవీణ్ పాల్గొన్నారు.
