ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం

 ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతుల ఆగ్రహం
  • ..తేమ శాతం పెంచాలని డిమాండ్
  • నేషనల్ హైవేపై బైఠాయించి నిరసన
  • 2 కి.మీ. మేర నిలిచిన వాహనాలు 

నేరడిగొండ, వెలుగు: తేమశాతాన్ని పరిగణలోనికి తీసుకోకుండా పత్తి, సోయా కొనుగోలు చేయాలని ఆదిలాబాద్ ​జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని నేషనల్ హైవేపై శనివారం రైతులు ఆందోళన చేశారు. ఎడతెరపి లేని వర్షాలు, పత్తి తడిసి ముద్దయినా.. ఆరబెట్టి తీసుకొస్తే, తేమ శాతం పేరుతో సీసీఐ అధికారులు రైతులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కపాస్ కిసాన్​యాప్​ను తొలగించి పత్తి తేమ శాతాన్ని 12 శాతం నుంచి 20 శాతానికి, సోయాబీన్ తేమ శాతాన్ని 8 శాతం నుంచి 18 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.

 ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి, 10 క్వింటాళ్లు సోయాబీన్​ను కొనుగోలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, సీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా.. కలెక్టర్ వచ్చేంతవరకు నిరసన విరమించేది లేదని రైతులు స్పష్టం చేశారు. 

దీంతో పోలీసులు జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరింప చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్​ను క్లియర్ చేశారు. నిరసనలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడే వసంత్ రావు, కమల్ సింగ్, జాదవ్ కపిల్, నాయుడి రవి, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.