నష్టపోతున్నాం.. న్యాయం చేయండి.. తహసీల్దార్ఎదుట రైతుల నిరసన

నష్టపోతున్నాం..  న్యాయం చేయండి.. తహసీల్దార్ఎదుట రైతుల నిరసన

పెనుబల్లి, వెలుగు :  రైల్వే లైన్ నిర్మాణంలో భూములు ఇచ్చి పూర్తిగా పరిహారం అందక నష్టపోయమని, ఇప్పుడైనా న్యాయం చేయాలని సీతారామ ప్రాజెక్ట్ కాల్వ నిర్వాసిత  రైతులు నిరసన వ్యక్తం చేశారు. పెనుబల్లి మండలం గౌరారం రెవెన్యూలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటింగ్ కెనాల్ నిర్మాణానికి 60.04 ఎకరాల భూమిని సేకరించడానికి పెనుబల్లి తహసీల్దార్ వీరభద్ర నాయక్ గౌరారం రైతువేదికలో మంగళవారం రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గౌరారం రెవెన్యూలో ఉన్న సర్వే నెంబర్లలో కోల్పోతున్న భూమి వివరాలు చెట్లు, ఇతర సదుపాయల గురించి రైతులకు తెలియజేశారు. రైల్వే భూ సేకరణలో భూమి మొత్తం కోల్పోయి కొద్దిపాటి భూమి మిగిలిపోయిందని, దానికి కూడా దారి లేకుండా పోయిందని, అప్పుడు అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా ఉన్న భూమి పోతే ఏంచేయాలంటూ కొంతమంది రైతులు నిరసన వ్యక్తం చేశారు. సర్వే అధికారులు భూముల్లో ఉన్న చెట్ల వివరాలు పంపితే ఇంతవరకు ఫారెస్ట్ డిపార్ట్​మెంట్ మార్కింగ్ చేయలేదని ఫిర్యాదు చేశారు. రైల్వే భూ సేకరణలో అన్యాయం జరిగింది, ఇప్పుడు ప్రాజెక్టు భూ సేకరణలోనూ తమకు అన్యాయం చేయొద్దని వేడుకున్నారు.