24 గంటల విద్యుత్ అంటూ గప్పాలు..ఇస్తుందే నాలుగైదు గంటలే

24 గంటల విద్యుత్ అంటూ గప్పాలు..ఇస్తుందే నాలుగైదు గంటలే

మెట్ పల్లి, వెలుగు: కరెంట్ కోతలపై రైతులు కన్నెర్రజేశారు. అసెంబ్లీలో 24గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్న సర్కారు.. క్షేత్ర స్థాయిలో నాలుగైదు గంటలే ఇస్తోందని మండిపడ్డారు. మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని సబ్ స్టేషన్ ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సీఎండీ ప్రభాకర్ రావు తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయని, నెల రోజులుగా కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియడం లేదన్నారు. కరెంట్ ఎప్పుడిస్తారో తెలియకుండా ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేయాలని సీఎండీ చెప్పడం సిగ్గుచేటన్నారు. స్టార్టర్లు తీసేస్తే.. పొలాల వద్ద ఎవరు కాపలా కాయాలని ప్రశ్నించారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ మాకొద్దని, కనీసం 10 గంటలైనా ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజులుగా కరెంట్ కోతలపై ఆందోళన చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు.

సబ్ స్టేషన్ వద్ద వంటా వార్పు..

నిర్మల్: కరెంట్ కోతలను నిరసిస్తూ.. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి సబ్ స్టేషన్ ముందు రైతులు వంటావార్పు చేపట్టారు. ఉదయమే పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన తెలిపారు. గ్రామాల్లో నాలుగైదు గంటలే కరెంట్​వస్తోందని, 24గంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరెంట్ లేక పంటలకు పూర్తి స్థాయిలో నీళ్లు అందించలేకపోతున్నామని వాపోయారు. అధికారులకు పలుసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.  ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ.. అధికారులు మాత్రం కరెంట్ ఇవ్వడం లేదన్నారు. నాలుగైదు రోజులు ఇలాగే కొనసాగితే పంటలు ఎండిపోతాయని ఆవేదన చెందారు. కాగా, పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే కరెంటు సరఫరా చేయలేకపోతున్నామని అధికారులు తెలిపారు. 

హుస్నాబాద్​ లో వైఎస్సార్​టీపీ ధర్నా..

హుస్నాబాద్: 24గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్దాలు చెప్పడం సిగ్గుచేటని వైఎస్ఆర్ తెలంగాణపార్టీ లీడర్లు మండిపడ్డారు. నిరంతర విద్యుత్ అంటూ రైతులను మోసం చేస్తున్నారని  ఫైర్ అయ్యారు. సర్కారు తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మంగళవారం ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, రైతులు హుస్నాబాద్ డీఈ ఆఫీసు ముందు ధర్నా చేశారు. ఉద్యమ సమయంలో అర్ధరాత్రి కరెంట్ ఇచ్చారని విమర్శించిన బీఆర్ఎస్ నేతలు.. కరెంట్ కోతలపై ఇప్పడు ఏం మొఖం పెట్టుకొని మాట్లాడుతారని ఎద్దేవా చేశారు. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. కరెంట్ కోతలపై కనీసం నోరు విప్పడం లేదన్నారు. తెలంగాణకు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియడం లేదన్నారు.

ఏసీడీ చార్జీలు ఎత్తేయాలి..

మణుగూరు: ఏసీడీ చార్జీలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో విద్యుత్  ఆఫీస్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులపై ఏసీడీ చార్జీల పేరుతో భారం మోపుతోందన్నారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్​ ఇస్తామని చెప్పి 8 గంటలు కూడా నాణ్యమైన విద్యుత్  అందించడం లేదన్నారు. అనంతరం ఏఈకి వినతిపత్రం అందజేశారు.

ఆఫీసర్లు స్పందించాలె..

నిజామాబాద్ ​రూరల్: రైతులకు అరకొరగా త్రీఫేస్ కరెంట్ అందిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. కోతల కారణంగా పంటలు ఎండుతున్నాయని, అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రావడం లేదన్నారు. ఈక్రమంలో ఓ రైతు అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశాడు. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ సురేశ్ వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.