
- టార్గెట్ 70.13 లక్షల టన్నులు
- ఇప్పటివరకూ కొన్నది 22.80 లక్షల టన్నులే
- 40 రోజులు కావస్తున్నా మూడో వంతే కొనుగోళ్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభమై 40 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు టార్గెట్‌లో మూడో వంతు కన్నా ఎక్కువ పూర్తికాలేదు. ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో ఒకవైపు అకాల వర్షాలతో సెంటర్లలో ఆరబోసుకున్న ధాన్యం ఆగమవుతోంది. సెంటర్ల వారీగా వెదర్ అలర్ట్ ఇస్తున్నప్పటికీ ధాన్యం సేకరణకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో తూకాలు అవుతున్నా తీసుకెళ్లిన ధాన్యం మిల్లులు, గోదాముల వద్ద అన్లోడ్ కాకపోవడంతో లారీల సమస్య తీవ్రం అవుతోంది. ఎండ తీవ్రత, పనిభారం అధికం కావడంతో లారీల్లో తీసుకెళ్లిన వడ్లను హమాలీలు దించడంలేదు. దీంతో రోజుల తరబడి వడ్లు వాహనాల్లోనే మగ్గుతున్నాయి.
ఫలితంగా కాంటా పెట్టిన వడ్లు సెంటర్లలోనే నిలిచిపోతున్నాయి. రాష్ట్రంలో రైస్‌మిల్లులు మూడువేల వరకు ఉన్నా.. వాటిలో చాలా వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ అమ్ముకుని డిఫాల్టర్లుగా మారారు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ ఫైన్లు కట్టకుండా ధాన్యానికి సంబంధించిన బ్యాంక్ గ్యారంటీ ఇవ్వని వారికి ధాన్యం కేటాయించడం లేదు. దీంతో ప్రస్తుతం 1579 మిల్లులకు ధాన్యం కేటాయింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎంఆర్ కోసం అనుమతించిన 1,579 రైస్ మిల్లులకు, 45 లక్షల టన్నుల ధాన్యాన్ని మిలర్లకు కేటాయించారు. మిల్లర్ల ఎఫెక్ట్ కూడా ధాన్యం కొనుగోళ్లు లేట్ అవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
లారీలు రాక నిలుస్తున్న కాంటాలు
కొనుగోలు కేంద్రాలకు వచ్చే వరిధాన్యంలో దొడ్డు, సన్నరకాలు ఉంటున్నాయి. రామిల్లర్లు దొడ్డురకం వడ్లను దింపనివ్వడం లేదు. ఈ రకం వడ్లు తీసుకుంటే మిల్లింగ్ చేసి ఎఫ్ సీఐకి బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫ్‌సీఐ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాల్సి ఉండడంతో వాళ్లు పెట్టే కొర్రీలతో ఇబ్బంద అని దొడ్డువడ్లు తీసుకోవడానికి మిల్లర్లు ఇంట్రెస్ట్ చూపడం లేదు. అందుకే సన్నరకం తీసుకుంటే సీఎంఆర్ సివిల్ సప్లయ్స్ డిపార్డ్మెంట్ కు ఇక్కడే ఇవ్వొచ్చనే ఉద్దేశంతో సన్నవడ్లు తీసుకుని దొడ్డువడ్లను తిరస్కరిస్తున్నారు. బాయిల్డ్ మిల్లులకు దొడ్డురకం వడ్లు రోజుకు ఒక్కొక్క మిల్లుకు పెద్ద ఎత్తున్న లారీల లోడ్లు వస్తుంటే ఆ మిల్లర్లకు సమస్యగా ఏర్పడుతోంది. ఫలితంగా మిల్లుల వద్ద లారీలు నిలిచిపోతున్నాయి. లారీలు తిరిగివచ్చే వరకు సెంటర్లలో కాంటాలు నిలిచిపోతున్నాయి.
ఇక, రాష్ట్రంలో యాసంగిలో 54.89 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఈ సీజన్లో 1.27 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో 8,329 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 70.13 లక్షల టన్నులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 30 లక్షల టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు సెంటర్లకు చేరింది. కాగా.. ఇప్పటివరకు 3.10 లక్షల రైతుల మంది రైతులకు సంబంధించి 22.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశారు. కొనుగోళ్ల టార్గెట్‌లో ఇది 33 శాతమే. సేకరించిన ధాన్యానికి సంబంధించి మద్దతు ధరతో రూ.5,244 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.2,555 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. సెంటర్లలో సేకరించిన 9.85 లక్షల టన్నుల సన్నవడ్లకు అదనంగా రూ.500 బోనస్‌తో రూ.492.50 కోట్లు చెల్లించడానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది.
నిజామాబాద్లోనే ఎక్కువ కొనుగోళ్లు
రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోళ్లలో 6.12 లక్షల టన్నుల కొనుగోళ్లతో నిజామాబాద్ టాప్‌లో నిలిచింది. ఇక్కడ ఇప్పటికే 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. తరువాత నల్గొండ జిల్లాలో 3.33 లక్షల టన్నులు, కామారెడ్డి జిల్లాలో 2 లక్షలు, సూర్యాపేట జిల్లాలో 1.25 లక్షల వడ్ల కొనుగోళ్లు జరిగాయి.