ఉమ్మడి మెదక్ జల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జల్లా సంక్షిప్త వార్తలు

 

  • రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి
  • ఎమ్మెల్యే రఘునందన్ రావు

సిద్దిపేట, వెలుగు : ఎల్లారెడ్డిపేట నుంచి లింగంపేట పటేల్ చెరువు వరకు నిర్మిస్తున్న  డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కోసం సేకరిస్తున్న  భూములకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రైతులతో కలసి అడిషనల్ కలెక్టర్ కు మంగళవారం వినతి పత్రం సమర్పించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాన్గల్ గ్రామస్తులకు  ఎకరాకు రూ.1.92 లక్షలు పరిహారం ఇవ్వడం అన్యాయమని, దీన్ని వెంటనే సవరించాలని కోరారు. కొత్త రిజిస్ట్రేషన్ ధరలకు తగ్గట్టు  పరిహారాలు నిర్ణయించాలని కోరగా అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి సరైన పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  బీజేపీ తొగుట మండల అధ్యక్షుడు తుక్కాపూర్ సర్పంచ్ చిక్కుడు చంద్రం, కాన్గల్ సర్పంచ్ ప్రేమల చంద్రారెడ్డి తో పాటు  విభీషణ్ రెడ్డి,  ఐ.చంద్రశేఖర్ గౌడ్,  వరదపల్లి నరసింహారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

 

  • కేజీబీవీలపై స్పెషల్​ ఫోకస్​ పెట్టాలి 
  • సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ప్రత్యేక అధికారులు విద్యార్థుల చదువు, ఆరోగ్యం, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ క్యాంప్ ఆఫీస్​లో విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు కేజీబీవీ ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల నారాయణఖేడ్ కేజీబీవీలో జరిగిన ఆహార కల్తీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా సంబంధిత అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కిచెన్ గార్డెన్​లో తప్పనిసరిగా పండ్లు, కూరగాయల మొక్కలు పెంచాలని సూచించారు. వంటకు సంబంధించిన సామగ్రిని స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో, ఫుడ్ కమిటీ పర్యవేక్షణలో ఇవ్వాలన్నారు. టెన్త్​, ఇంటర్ లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలని సూచించారు. సమీక్షలో డీఈవో రాజేశ్ సివిల్ సప్లై డీఎం సుగుణ సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. 

సంక్షేమంపైనే సర్కారు దృష్టి

కొండాపూర్, వెలుగు: సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్‌‌ చింతా ప్రభాకర్‌‌ తెలిపారు. శనివారం మండల పరిధిలోని గిర్మాపూర్, గారకుర్తి, తొగర్‌‌పల్లి, అలియాబాద్, కొండాపూర్, మారేపల్లిలో రూ.20 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, అండర్‌‌ డ్రైనేజీ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మనోజ్‌‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ నరహరిరెడ్డి, డీసీసీబి జిల్లా వైస్‌‌ చైర్మన్‌‌ మాణిక్యం, సర్పంచులు, టీఆర్‌‌ఎస్‌‌ నాయకులు పాల్గొన్నారు.

ఇరిగేషన్​ భూమి  ఆక్రమిస్తే చర్యలు

నర్సాపూర్, వెలుగు :  ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ తహసీల్దార్ ఆంజనేయులు హెచ్చరించారు. మంగళవారం నర్సాపూర్ పట్టణంలోని ఇరిగేషన్ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు  వచ్చింది. పోలీసు, ఇరిగేషన్ శాఖ  అధికారులతో కలిసి ఆక్రమణ కు గురైన స్థలాన్ని ఆయన సందర్శించారు. స్థలంలో  ఏర్పాటు చేసిన కడీలను తొలగించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీనివాస్, ఏఈ మణిభూషణ్ తో కలిసి ఆయన మాట్లాడారు. నర్సాపూర్ పట్టణంలోని  79 సర్వే నంబరులో ఇరిగేషన్ శాఖకు 3 ఎకరాల 26 గుంటల భూమి ఉందని,  దీన్ని ఆక్రమించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

తూప్రాన్ లో భగ్గుమన్న టీఆర్ఎస్ వర్గపోరు

తూప్రాన్, వెలుగు: తూప్రాన్ లో టీఆర్ఎస్ వర్గపోరు భగ్గుమంటోంది. మున్సిపల్​ చైర్మన్, వైస్​ చైర్మన్​ వర్గాలు ఎవరికీవారు సమావేశాలు నిర్వహించుకుంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. మంగళవారం తూప్రాన్ లో టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్  సతీశ్​చారితో కలిసి  మున్సిపల్​ వైస్​ చైర్మన్​  నందాల శ్రీనివాస్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మున్సిపల్  చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఎన్నికై  మూడేండ్లు కావస్తున్నా పలు వార్డుల్లో సరైన అభివృద్ధి జరగడం లేదన్నారు. పార్టీ భీఫారమ్ పై గెలిచిన తమను ఆయన ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తూప్రాన్ లో  పార్టీకి నష్టం కలిగే విధంగా చేస్తున్న చైర్మన్ వర్గంపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు. తనకు చైర్మన్ నుంచి ప్రాణహాని ఉందన్నారు. పట్టణంలో ఇళ్ల నిర్మాణం చేసేవారి వద్ద, ఇతర వ్యక్తుల వద్ద నగదు వసూలు చేశారని ఆరోపిస్తూ 60 అంశాలతో ఉన్న బుక్ లెటన్​ను విడుదల చేశారు. 

చైర్మన్ ​వర్గం సమావేశం.. 

మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్  రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకనే అతడిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పలువురు కౌన్సిలర్లు, నాయకులు అన్నారు. చైర్మన్​పై వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ ఆరోపణలు చేడయంపై స్పందిస్తూ పలువురు కౌన్సిలర్లు, నాయకులు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎఫ్ డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్​ రెడ్డి కనుసన్నల్లోనే రవీందర్ గౌడ్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. చైర్మన్ అవినీతి చేసినట్లు ఆధారాలతో రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని సవాల్​ విసిరారు. కొందరు స్వార్థం కోసం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పట్టణ ప్రధాన కార్యదర్శి ఏర్పుల లక్ష్మణ్ ఆరోపించారు.  నిత్యం ప్రజలతో మమేకమై ఉంటున్న చైర్మన్ పై  ప్రతాప్ రెడ్డి  కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. 

సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ప్రారంభం 

కంది/సంగారెడ్డి టౌన్, వెలుగు :  సంగారెడ్డిలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ మంగళవారం స్టార్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ హైదరాబాద్​ నుంచి పర్చువల్​గా కాలేజీని ప్రారంభించారు. అనంతరం కాలేజీ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్, పలువురు ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో చుట్టుప్రక్కల జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ మెడికల్ కాలేజీని రాష్ట్రంలో నంబర్ వన్ మెడికల్ కాలేజీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. కాలేజీ ఓపెనింగ్​సందర్భంగా చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, అందోల్​ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్,  అడిషనల్ కలెక్టర్ రాజార్జిషా, కాలేజీ సూపరింటెండెంట్ అనిల్ కుమార్, ప్రిన్సిపాల్ వాణి, డీఎం హెచ్ వో గాయత్రీ దేవి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మాణిక్యం, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ లత, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, నాయకులు  పాల్గొన్నారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యత

సిద్దిపేట రూరల్, వెలుగు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు. మంగళవారం చిన్నకోడూరు మండల పరిషత్ ఆఫీస్ లో ఎంపీపీ మాణిక్య రెడ్డి అధ్యక్షతన రైతులకు ఆయిల్ ఫామ్ పంట సాగుపై అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ సాగుతో తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు  వస్తాయన్నారు. రైతులకు సబ్సిడీ పైన మొక్కలతో పాటు డ్రిప్స్ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో  రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వనిత రవీందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.

తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట రైతుల ఆందోళన 

జిన్నారం, వెలుగు:  జిన్నారంలోని సర్వే నంబర్​ 1లో భూములున్న రైతులు తహసీల్దార్ ​ఆఫీస్​ఎదుట మంగళవారం ఆందోళన చేశారు. తమ భూములను టీఎస్ఐసీసీకి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము కోల్పోతున్న భూములకు ప్రత్యామ్నాయంగా భూములు కేటాయించాలని,  ఆ తర్వాతే తమ భూములను పరిశ్రమల కోసం తీసుకోవాలన్నారు. పై అధికారుల ఆదేశాల ప్రకారమే ఆ భూములు కేటాయించామని తహసీల్దార్​ చెప్పడంతో ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, బీజేపీ మాజీ జడ్పీటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ రైతులకు మద్దతు తెలిపారు. 50 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను పరిశ్రమలకు కేటాయించడం అన్యాయమని, భూములను రక్షించలేని ఎమ్మెల్యే ఎందుకున్నట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నినాదాలు చేస్తూ భూముల వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి కాంగ్రెస్, బీజేపీ లీడర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

  • తెలంగాణ పల్లెల అభివృద్ధి భేష్
  • పుల్లూరును సందర్శించిన జమ్మూ కశ్మీర్ రాష్ట్ర బీడీసీ చైర్మన్ల బృందం

సిద్దిపేట రూరల్, వెలుగు : మూడంచెల ప్రభుత్వ పరిపాలన విధానం ద్వారా గ్రామాలు వేగంగా డెవలప్​అవుతాయనడానికి తెలంగాణ  పల్లెలు  అభివృద్ధి నిదర్శనమని జమ్మూ కశ్మీర్ రాష్ట్ర బ్లాక్ డెవలప్​మెంట్ చైర్మన్ల బృందం సభ్యులు అన్నారు.  హైదరాబాద్ నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ రూరల్ డెవలప్​మెంట్ లో నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణలో భాగంగా   వారు మంగళవారం పుల్లూరు గ్రామానికి ఎక్స్పోజర్ విజిట్ కు వచ్చారు.  గ్రామంలోని రైతు వేదిక, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, సామూహిక గొర్రెల హాస్టల్, పల్లె ప్రకృతి వనం, ఓపెన్ జిమ్ ను సందర్శించారు. వారికి డీపీవో దేవకీదేవి, ఎంపీపీ శ్రీదేవి చందర్ రావు, సర్పంచ్ పల్లె నరేశ్​గౌడ్  అభివృద్ధి తీరును వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లెలను పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్న తీరు అభినందనీయమన్నారు. తడి, పొడి చెత్తతో గ్రామపంచాయతీకి ఏడాదికి రెండు లక్షల ఆదాయం తెచ్చిన సర్పంచ్ నరేశ్​గౌడ్ ను అభినందించారు. అనంతరం జడ్పీ ఆఫీస్ లో జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ ను కలిసి సిబ్బందితో చర్చా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల తీరును, నిధుల సమీకరణ, ఖర్చు విధానాలను రోజా శర్మ, జెడ్పీ సీఈవో రమేశ్​బాబు వారికి వివరించారు. కార్యక్రమంలో నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ రూరల్ డెవలప్​మెంట్ రిసోర్స్ పర్సన్ రామేశ్వర్, ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఉప సర్పంచ్ ప్రసాద్​ రెడ్డి, జమ్ము పంచాయతీరాజ్ అసిస్టెంట్ కమిషనర్ మీనాక్షి వ్యాస్,  బ్లాక్  డెవలప్​మెంట్ చైర్మన్లు ఉమి చాంద్, దేవరాజ్, మహమ్మద్ అబ్దుల్లా, అమీర్, సుష్మా దేవి, దీక్ష, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

రిలీఫ్ ఫండ్ లో బాధితులకు భరోసా

చేర్యాల, వెలుగు: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడువటూరు గ్రామానికి చెందిన మినాలపురం చంద్రమౌళి అనారోగ్యంతో బాధపడుతుండగా.. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపురం కిరణ్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందేలా చేశారు. మంగళవారం ఇందుకు సంబంధించిన రూ.2.50లక్షల ఎల్ వోసీని బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో మినాలపురం శ్రీనివాస్, ఉదయ్​కుమార్, స్వామి, సిద్దులు, విజయలక్ష్మి ఉన్నారు.