రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించాలి: గంగుల కమలాకర్

రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించాలి: గంగుల కమలాకర్

వానాకాలం పంట వేయాలంటే ఇంతకాలం రైతులు మొగులువైపు చూసేవాళ్లన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రస్తుతం నీటికి ఇబ్బంది లేకుండా కాళేశ్వరం జలాలతో చెరువులన్నీ నడి వేసవిలో మత్తడి దునుకుతున్నాయన్నారు. వానాకాలం పంట ఆలస్యమై..కోతల సమయంలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయన్నారు. ఈ సమస్య లేకుండా ముందుస్తు సాగు చేసుకునేలా నీటి వసతి కల్పించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు.గతంలో ఎస్సారెస్పీలో నీరు లేక కాకతీయ కాలువ చివరి ఆయకట్టుకు నీరు అందేది కాదని..ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. కాలువతో కనెక్టవిటీ ఉన్న చెరువులన్నీ నింపుతామన్నారు. బియ్యం గింజల సైజును బట్టి రేటు వస్తుందన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ రైతులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. దొడ్డు రకం బియ్యం నిల్వలు దేశంలోని ఎఫ్.సి.ఐ గోడౌన్లలో మురిగిపోయే పరిస్థితులున్నాయన్నారు. సన్నబియ్యానికి మాత్రం కొరత ఉందన్న మంత్రి గంగుల… డిమాండ్ ఉన్న పంటలు రైతులు పండించాలన్నారు.

కంది పంట వేస్తే ప్రభుత్వమే కొంటుందని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కల్తీ లేని ఆహార ఉత్పత్తులు తెలంగాణలో రావాలని.. అందుకోసమే ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ల ఏర్పాటు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. రైసు మిల్లుల నుంచి కాలుష్యం వెలువడ కుండా ఇకపై మిల్లులన్నీ ఒకే చోట ఉంచాలని చూస్తున్నామన్నారు. అంతేకాదు ఇతర ఆహారోత్పత్తుల పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు  చెప్పారు.

చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరి దిగుబడి ఈ సారి వచ్చిందన్నారు గంగుల. దీంతో రవాణా, గోడౌన్ కొరతతో కొంత ఆలస్యమైందన్నారు. ఖరీఫ్ లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామన్నారు. యాసంగిలో ఇప్పటికే 49 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని తెలిపారు. కొనుగోళ్లు పూర్తి కావచ్చినా ఇంకా ప్రతిపక్షాలు కళ్లాల వెంబడి తిరుగుతున్నారని ఆరోపించారు.

కరీంనగర్ జిల్లాలో 1153, 1156 రకం ధాన్యం వేసిన ప్రాంతాల్లో తాలు సమస్య  వచ్చిందని…ఇలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం సూచించిన విత్తనాలే వేయాలని సూచించారు. మమ్మల్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలు కనీసం కేంద్రం నుంచి గన్నీ సంచులు ఇప్పించలేకపోయారని విమర్శించారు.ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ 45 రోజుల్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని చెప్పారు.

ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలతో కరోనాను నియంత్రించామని చెప్పారు గంగుల కమలాకర్. కరీంనగర్ నుంచి కరోనాను తరిమేసామని చెప్పారు. త్వరలో కరీంనగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందన్నారు.రాం విలాస్ పాశ్వాన్ సహా ఎఫ్.సి.ఐ అధికారులు తెలంగాణ ధాన్యం సేకరణ విధానాన్ని మెచ్చుకున్నారని తెలిపారు.